Jun 29,2023 06:42

పిల్లల చదువుల కోసం 'జగనన్న అమ్మ ఒడి' పేరిట ప్రతి ఏటా ప్రభుత్వం అందించే నగదు సాయం పొందే తల్లులు నిరుటి కంటే ఈయేడు లక్షా 34 వేల మంది తగ్గారు. ఒక్క సంవత్సరంలో ఇంత మంది లబ్ధిదారులు తగ్గారంటే బడికిపోయే పిల్లలు తగ్గారనుకుంటే పొరపాటు. పథకం లబ్ధికి ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలే 'అమ్మఒడి' లబ్ధికి తల్లులను దూరం చేశాయి. పిల్లలను బడికి పంపించడమే తల్లులు చేయాల్సిన పని, చదివించే బాధ్యత ప్రభుత్వానిదేనన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వ ప్రతినకు చిత్తశుద్ధి లోపించిందని గడచిన నాలుగేళ్లల్లో 'అమ్మఒడి' అమలు తీరుతెన్నులను పరిశీలించిన వారెవరికైనా అర్థమవుతుంది. ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుకొనే పిల్లల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా ప్రతి ఏటా రూ.15 వేలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకొచ్చాక స్కీం రూపకల్పనలోనే ఎంతమంది పిల్లలున్నప్పటికీ ఒక్కరికే నగదు బదిలీ అని సవరించారు. అప్పుడే పథకం సగం చిక్కిపోయింది. సర్కారు పెట్టుకొనే నిధులు గణనీయంగా తగ్గాయి. తొట్టతొలిగా వేసిన ఆ షరతుకు కాలక్రమంలో మరెన్నో షరతులొచ్చి చేరి 'అమ్మఒడి' లబ్ధికి తూట్లు పొడుస్తున్నాయి.
'అమ్మఒడి'కి ప్రభుత్వం తతిమ్మా సంక్షేమ పథకాల నిబంధనలను వర్తింపజేసింది. ప్రధానంగా ఆరు అంశాల ప్రాతిపదికన వలంటీర్లను ఒకటికి పదిసార్లు ఇంటింటికీ తిప్పి దుర్భిణీ వేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. అవన్నీ దుర్మార్గమైన ఆంక్షలు. విద్యుత్‌ వినియోగం సగటున నెలకు 300 యూనిట్లు దాటకూడదు. ప్రభుత్వం పలు రూపాల్లో పలుమార్లు కరెంట్‌ ఛార్జీలు పెంచినందున ఆ నిబంధనను పలువురు అనివార్యంగా దాటారు. అంతమాత్రం చేత వారందరూ ధనవంతులు కాలేదు. ప్రభుత్వం నుంచి జీతం పొందేవారికి 'అమ్మఒడి' లేదన్నారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీల వంటి స్కీం వర్కర్లను, కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌, సిబ్బందిని మినహాయించారు. పట్టణాల్లో వంద అడుగుల ఇల్లు ఉండకూడదు. ఇన్‌కంటాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేసి ఉండకూడదు. ఫోర్‌ వీలర్‌ ఉండకూడదు. స్టూడెంట్‌ హాజరు 75 శాతం తప్పనిసరి. ఇవి కాకుండా ఎప్పటికప్పుడు బయోమెట్రిక్‌ అథంటికేషన్‌, ఇ-కెవైసి, ఆధార్‌-బ్యాంక్‌ అకౌంట్‌ అనుసంధానం. ఈ షరతుల వలన గతంలో లబ్ధి పొందిన తల్లులు కూడా ఈ మారు దూరమయ్యారు. సాధారణంగా ఏటికేడు స్కూళ్లకొచ్చే పిల్లలు పెరుగుతారు. ఆ మేరకు లబ్ధిదారులూ పెరగాలి. విరుద్ధంగా లబ్ధిదారులు తగ్గడాన్నిబట్టి ఆంక్షల మాటున ప్రభుత్వ కోతల ఉద్దేశం బహిర్గతమవుతుంది. నిరుడు లబ్ధి పొందిన తల్లుల సంఖ్య 43.95 లక్షలు కాగా ఇప్పుడు 42.61 లక్షలకు తగ్గిపోయింది.
తమది సంక్షేమ రాజ్యమని ఘనంగా చెప్పుకునే ప్రభుత్వం నిబంధనలతో ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేయడం ప్రజలను వంచించడమే. 'అమ్మఒడి'నే తీసుకుంటే ఒక వైపు లబ్ధిదారులను తగ్గిస్తూ మరోవైపు రూ.15 వేలు ఇస్తామని, స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణ పేరిట రూ.2 వేలు కోత పెట్టారు. ఆ వారా నిధులు ఆదా చేసుకున్నారు. 2021లో 6,673 కోట్లు, 2022లో 6,595 కోట్లు జమ చేయగా 2023లో 6,392 కోట్లేనన్నారు. నిధుల తగ్గుదలే పథకం పలచపడడానికి నిదర్శనం. సెకండరీ స్థాయిలో మధ్యలోనే బడి మానేస్తున్న పిల్లల శాతం ఆలిండియా సగటుతో పోల్చితే ఎ.పి.లో చాలా ఎక్కువ. కోవిడ్‌తో విద్యా వ్యవస్థ దెబ్బతింది. పేదరికం వలన బాలలు బడికి దూరం జరిగి పనులు చేసుకుంటూ బాలకార్మికులుగా మారడం సమాజానికి చేటు. ఈ పరిస్థితుల్లో 'అమ్మఒడి' వంటి సర్కారీ సాయాలు పెరగాలేకాని తగ్గకూడదు. విద్య కార్పొరేటీకరణ జరిగి ఎల్‌కెజికి రూ.లక్ష వసూలు చేసే యుగం నడుస్తోంది. ఈ స్థితిని కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానం మరింత పటిష్టం చేస్తోంది. రాష్ట్రం సైతం అదే కోవలో స్కూళ్ల విలీనం, ఎయిడెడ్‌ స్కూళ్ల రద్దు అంటోంది. పేదలకు ఇప్పటికీ ప్రభుత్వ బడులే దిక్కు. ఆ రీత్యా సర్కారీ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. పేదలకు, సామాన్యులకు ఊరటనిచ్చే 'అమ్మఒడి' పథకాలకు సార్వజనీనత కల్పించాలి.