Jan 08,2023 09:01

ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌ అంటే అతిశయోక్తి కాదు. జలపాతాలు, పచ్చని పొలాలు, నదీప్రవాహాలతో అరుణాచల్‌ప్రదేశ్‌లోనే ఎంతో సుందరమైన ప్రాంతం జిరోలోయ. మారుతున్న కాలంలో మానవుడు ప్రకృతికి దూరంగా జీవిస్తున్నాడు. నేటికీ మనిషి పర్యావరణంతో సామరస్య పూర్వకంగా కలిసుండే జీవన సాంస్కృతిక, ప్రకృతి దృశ్యానికి ఉదాహరణ జిరోలోయ. ఇక్కడి గిరిజన పర్యావరణహితమైన జీవనశైలి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ పచ్చందాల, సంస్కృతి సోయగాల గురించే ఈ ప్రత్యేక కథనం..

రుణాచల్‌ప్రదేశ్‌ భౌగోళికంగా పర్వతలోయలు కలిగి భిన్న వాతావరణ పరిస్థితులతో వనాలు, వన్యప్రాణుల పెరుగుదలకు అనువైన ప్రదేశం. అంతరించిపోతున్న జీవజాతులు అక్కడి అరణ్యాల్లో కనిపిస్తాయి. 500 రకాల ఆర్కిడ్‌జాతి పూలమొక్కలకు ప్రసిద్ధి అరుణాచల్‌ప్రదేశ్‌. పకురు, ఈగెల్‌నెస్ట్‌, కనె, మౌలింగ్‌, మహౌ, దిహాంగ్‌ వంటి వైల్డ్‌లైఫ్‌ శాంచురీల్లో వన్యమృగాలను పరిరక్షిస్తున్నారు. దేశంలో మొదట సూర్యోదయమయ్యేది ఈరాష్ట్రంలోనే. వేసవిలో 40 డిగ్రీలు, శీతాకాలంలో సగటు 15 నుంచి 20 డిగ్రీల మధ్య, వర్షాకాలంలో 22 నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది.

Andala-Arunachal


              26 గిరిజన, 100 ఉపజాతుల సంస్కృతీ సాంప్రదాయాల సమ్మేళనమే అరుణాచల్‌ప్రదేశ్‌. ఆది, అపటనీ, గాలో, నైషి, టాగిన్‌ వంటి ఐదు ప్రధాన తెగలు ఇక్కడ నివసిస్తుంటాయి. ఈ ఐదు 'అబోతాని' వంశానికి చెందినవిగా పరిగణించబడతాయి. గిరిజనుల సంస్కృతి, విశ్వాసాలను వారి నుంచి వేరుచేయలేం. పర్యావరణాన్ని పరిరక్షించడంలో గిరిజనులు ప్రధానపాత్ర పోషిస్తుంటారు. అదే వారి ఆరాధ్యదైవం. ఈ ఆదివాసులు సూర్యచంద్రుల్ని ఆరాధిస్తుంటారు. జీవవైవిధ్య భరితమైన జిరోలోయ ఫొటోగ్రాఫర్లకు, పర్యావరణవేత్తలకు, ట్రెక్కింగ్‌కు ఎంతో అనువైన ప్రదేశమని చెప్పొచ్చు. ఇది 2002లో యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌కు నామినేట్‌ చేయబడింది. ఆదివాసులైన అపటనీ, ఆది జాతులు ఎక్కువగా ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఫేస్‌టాటూలతో అపటనీ మహిళలు మిగిలిన వారికన్నా భిన్నంగా కనిపిస్తుంటారు. వీరు ఎంతో సౌందర్యంగా కనిపిస్తారు. అయితే ఇతర గుంపు పురుషులు వారిని అపహరించకుండా తమను తాము రక్షించుకునేందుకు ముఖాలపై పచ్చబొట్లు, నోస్‌ప్లగ్‌లను వేసుకుని, వారి శోభను తగ్గించుకునేవారట. రానురాను ఫేస్‌టాటూలు వారి తెగ గుర్తింపుగా మారిపోయింది. ఆడపిల్లలకు 10 ఏళ్ల వయస్సులోనే ఈ ఫేస్‌టాటూలను వేయిస్తారు. ప్రస్తుతం జిరోలోయలో ఫేస్‌టాటూలున్న మహిళలంతా 45 సంవత్సరాలు పైబడినవారే. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే మహిళలకు ఈ ఫేస్‌టాటూలు ఇబ్బందికరంగా ఉండటంతో యువతులు వీటిపై అంతగా ఆసక్తి చూపడంలేదు. స్థానిక ప్రభుత్వమూ ఫేస్‌టాటూలను రద్దు చేసింది. పైగా ఒకప్పటికీ ఇప్పటికీ భద్రతలో వచ్చిన మార్పులు కూడా వీటి నిషేధానికి దోహదపడ్డాయి. తమ జాతి గుర్తింపు తగ్గిపోతుందన్న వ్యథ అపటనీ మహిళలకున్నా.. వారు పడిన ఆ బాధను అనుభవించాల్సిన పనిలేదని సంతృప్తి చెందుతున్నారు.
అపటనీయులు క్రమబద్ధమైన భూ వినియోగం, సహజ వనరుల నిర్వహణేకాక పరిరక్షణకు సంబంధించిన గొప్ప సాంప్రదాయ పర్యావరణ పరిజ్ఞానం కలిగినవారు. వివిధ పండుగల్లో వారి సంస్కృతి ఉట్టిపడుతుంది. చేనేత డిజైన్‌లు, చెరకు, వెదురుతో చేసే రకరకాల కళాకృతులు, చేతిపనుల నైపుణ్యాలు, బుల్యాన్‌ అని పిలువబడే సాంప్రదాయ గ్రామసభలతో ఈ తెగ వారి రంగుల సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. అడవుల సంరక్షణలో భాగంగా వెదురు, సింధూర, దేవదారు వృక్షాలే కాక అనేక రకాల మొక్కలను పెంచుతుంటారు. వీటి సేకరణ కోసం ఏటా జిరోలోయ కొండచరియల్లో లభించే చిన్నచిన్న మొక్కలను సేకరించి, వాటిని తమ పరిసరాల్లోనూ ఇటాలిన్‌ ప్రాంతంలో నాటుతారు. దాదాపు ఈ ప్రాంతంలో 16 శాతం వెదురు పొదలు విస్తరించాయి. గృహనిర్మాణానికి వెదురు, కలప వాడతారు. ఈ నిర్మాణాలు జిరోలోయకే ప్రత్యేక ఆకర్షణ.

Andala-Arunachal


                                                                     వరిచేనులో చేపలవేట..

అరుణాచల్‌ప్రదేశ్‌లోని అడవిబిడ్డలు వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి, జీవనం సాగిస్తుంటారు. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా వారి జీవనం సాగుతుంది. జిరోలోయ వాసుల వంటకాలలో చేపలు, మాంసం ప్రధానమైనవి. వ్యాపారమే ప్రధానంగా సాగే ఆధునిక ప్రపంచంలో ప్రతిపదార్థంలోనూ కలుషితం తారసపడుతున్న ఈ రోజుల్లోనూ జిరోలోయ వాసులు వారి పరిసరాల్లో లభించే మొక్కలు, జంతువులనే వంటకు ఉపకరిస్తారు. వరిసాగుతో పాటు సమాంతరంగా చేపల పెంపకం అపటనీయుల ప్రత్యేకత. దీనికోసం వరి నారుమడుల్లోని సన్నని నీటితూముల్లో చేపపిల్లలను వదులుతారు. వరిపంటతో పాటుగా చేపలూ పెరుగుతాయి. చేతులతోనే వీటిని సేకరిస్తారు. నాగాలాండ్‌ యూనివర్శిటీకి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ అంచనా ప్రకారం ఇక్కడి పొలాల్లో హెక్టారుకు 200 నుండి 400 కిలోల చేపలు ఉత్పత్తి చేయవచ్చు. వరి చేను నీటిమడుగుల్లో దిగి, అరచేతులతో చేపలను పట్టుకోవటం పర్యాటకులకు ఓ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

 

Andala-Arunachal


                                                                   ఔట్‌డోర్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌..

పసిడివర్ణపు పొలాలు, తూర్పు హిమాలయ శ్రేణులు, మోమును తాకే చల్లని గాలులతో, ప్రకృతితో అనుసంధానం చేస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది అరుణాచల్‌ప్రదేశ్‌. అక్టోబరు నుంచి ఏప్రిల్‌ వరకు సందర్శనకు అనుకూల సమయం. ఏటా సెప్టెంబరు 29 నుంచి అక్టోబర్‌ 2 వరకు నాలుగు రోజులపాటు జిరోలోయలో నిర్వహించే 'జిరో మ్యూజిక్‌ ఫెస్టివల్‌' ఆ రాష్ట్రానికే ఓ ప్రత్యేక ఆకర్షణ. జిరోలోయలో నిర్వహించే ఈ పాటల కచేరీకి చేరుకోవాలంటే కొండవాలులు, ఎగుడు దిగుడు దారులు, బురద రోడ్లలో ప్రయాణం సాగుతుంది. బస్సు, రైలు, సౌకర్యాలున్నా, జిరోలోయకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆగుతాయి. అక్కడి నుంచి బురద దారులు కాస్తంత ఇబ్బంది పరిచినా.. కనుచూపు మేరలో ఎటుచూసినా ఆహ్లాదభరితమైన దృశ్యాలు అబ్బురపరుస్తాయి.
              అనుప్‌కుట్టీ, బాబీహనో ఇరువురు కలిసి 2012లో జిరో మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను మొదలుపెట్టారు. అపటనీ తెగకు చెందిన హనో చిన్నచిన్న కచేరీలు నిర్వహిస్తుండేవాడు. ఒకసారి ఇటానగర్‌లో తనకిష్టమైన గిటారిస్ట్‌ అనుప్‌కుట్టి మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే, ప్రభుత్వం రాజధానిలో 48 గంటలు కర్ఫ్యూ విధించడంతో ఆ మ్యూజిక్‌ బృందాన్ని అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిరోలోయకు తీసుకువెళ్లాడు. అక్కడ పరిసరాలను ఆస్వాదించిన అనుప్‌కు ఫెస్టివల్‌ను జిరోలోయలోనే నిర్వహించాలన్న ఆలోచన కలిగిందట. హనోతో కలిసి ఏటా జిరోమ్యూజిక్‌ ఫెస్టివల్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.

Andala-Arunachal


            పాటల కచేరీలో పర్యాటకులను ఆహ్లాదపరిచేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే గాయకులు, కళాకారులతో పాటు చిరునవ్వులతో ఆహ్వానించే స్థానిక అపటనీ తెగ వారితో ఆహ్లాదభరితంగా ఉంటుందీ ఫెస్టివల్‌. 'బాబా సెహెగల్‌', నేపాలీ సింగర్‌ 'బిపుల్‌ చెట్రీ', మణిపూర్‌ మ్యూజికల్‌ ఐకాన్‌ 'మాంగ్‌క', నాగాలాండ్‌ పాపులర్‌ సింగర్‌ 'అబ్డన్‌ మెక్‌', అరుణాచలీ 'నికోమ్‌ రిబా', గిటారిస్ట్‌ 'కమలా శంకర్‌' వంటి గాయకులు, విద్వాంసులు, ఇతర బృందాలు ఈ జిరో మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో అలరించారు. పర్యాటకులు వెళ్లిపోయిన అనంతరం కుప్పలుగా పేరుకుపోయే ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పచ్చని పరిసరాలు కలుషితమౌతున్నాయని గమనించిన నిర్వాహకులు ప్లాస్టిక్‌ వినియోగం లేకుండా జాగ్రత్తపడు తున్నారు. స్టేజ్‌ మొదలు, కుర్చీలు, టెంట్లు, టిక్కెట్‌ కౌంటర్‌, పర్యాటకుల వసతి గృహాలు, స్టాల్స్‌, బాత్‌రూమ్‌లు ఇలా ప్రతిదాన్నీ కలప, వెదురుతోనే తయారుచేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నిర్మాణాల్లో స్థానిక అపటనీయుల కళానైపుణ్యం ఉట్టిపడుతుంది. ఫెస్టివల్‌ అనంతరం వీటిని తిరిగి ఉపయోగించేలా భద్రపరుస్తారట. ప్లాస్టిక్‌ నిషేధించడంతో ఎవరి వాటర్‌బాటిల్‌ వాళ్లు తెచ్చుకునేలా గైడ్‌ చేస్తారు. వెదురుతో చేసిన గ్లాసులను మాత్రమే వాడుతుంటారు. వినియోగించిన వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఒక ఫ్రేమ్‌లో అమర్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అరుణాచల్‌వాసుల మాతృభాష వారి పరిసరాల్లో తప్ప ఇతర ప్రాంతంలో ఎవరికీ అర్థం కాదు. ప్రతి అపటనీకి హిందీ అవగాహన, యువత హిందీతోపాటుగా ఇంగ్లీషు భాషల్లోనూ ప్రావీణ్యతను కలిగి ఉంటారు. ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో భాష ఏదైనా సంగీతమే ప్రధానంగా, వినసొంపైన స్వరాలతో ఆహ్లాదపరుస్తుంటుంది. రాక్‌-జాజ్‌ నుంచి క్లాసికల్‌-జానపదాల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, ఆర్ట్‌, గిరిజన సాంప్రదాయ కళాఖండాలు, డ్యాన్స్‌, యోగా, మెడిటేషన్‌ మొదలైనవి నిర్వహిస్తారు. పిల్లల కోసం కథలు చెప్పడం, ఆదివాసీ అపటనీయుల నుంచి వరిగడ్డితో ఫ్లూట్‌ తయారీ విధానం వంటివి ఆకట్టుకుంటాయి.

Andala-ArunachalAndala-Arunachal

                                                                        ఆనకట్టలు.. ఆందోళనలు..

ప్రకృతితో పెనవేసుకున్న గిరిజనులు నేల, నీటినే ఆరాధిస్తారు. వాటితో ముడిపడివున్న నమ్మకాలతో జీవిస్తుంటారు. అలాంటి విశ్వాసాలతోనే దిబాంగ్‌ నదీలోయలో జీవనం సాగించే తెగ ఇడు మిష్మిస్‌. ఎనిమిది వేల జనాభా. ఇడు మిష్మిస్‌ పెద్దపులులను తమ తోబుట్టువులుగా భావిస్తారు. వారి హక్కుగా కలిగిన భూముల్లో వాటిని సంరక్షిస్తుంటారు. దాదాపు 50 పులులు ఉంటాయి. పెద్దపులులే కాదు కీటకాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు ఇలా ఎన్నో రకాల జీవవైవిధ్యంతో ఉంటుంది దిబాంగ్‌. ఇక్కడ నిర్మించనున్న నీటి ప్రాజెక్టులతో స్థానికుల్లో అలజడి మొదలైంది.
ఎత్తయిన పర్వతాలు, వాటి నడుమ ప్రవహించే జీవనదులతో అరుణాచల్‌ప్రదేశ్‌ జలవిద్యుత్‌ ఉత్పత్తికి అనువైన ప్రదేశం అంటారు. అందుకే ఇది పవర్‌హౌస్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచింది. 2007 నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 140 పెద్ద జలాశయాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడిదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ప్రజల వ్యతిరేకత వల్ల వాటిలో 66 రద్దు చేయబడ్డాయి. దిబాంగ్‌ పరీవాహక ప్రాంతంలో 17 జలవిద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మించాలని యోచిస్తున్నారు. ఆమోదం లభిస్తే సామర్థ్యం పరంగా దేశంలోనే అతిపెద్దది దిబాంగ్‌ 'ఇటాలిన్‌ హైడ్రో ప్రాజెక్టు'. ఈ పెద్దప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయి. దీని నిర్మాణానికి మూడు లక్షలకుపైగా చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలకు, వరదలకు కారణమౌతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తొలుత 2001లో నిర్మించిన 405 మెగావాట్ల రంగనది డ్యామ్‌ అస్సోంలోని లోతట్టు గ్రామాల వరదకు ఓ కారణమైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రాజెక్టు వ్యతిరేక పోరాటాలు కొత్తేమీ కాదు. 2008 నుంచి 2013 వరకు జల విద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. వాస్తవానికి పెద్ద ఆనకట్టలు ప్రమాదకరమైనవని పర్యావరణవేత్తలు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సుబాన్‌సిరి సంఘటన ఓ హెచ్చరిక. అస్సోం-అరుణాచల్‌ సరిహద్దులోని సుబాన్‌సిరి దిగువ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉండగానే అధిక వర్షాలకు దాని రక్షణగోడ కూలిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టు నీటమునిగి పోతుందన్న అనుమానం రేకెత్తింది. జిరోలోయకి దగ్గరలోనున్న తల్లే వన్యప్రాణుల అభయారణ్యంలోని కొంతభాగం ఈ ప్రాజెక్టు కిందకి వెళ్లిపోతుంది. తద్వారా దిగువ డెల్టాలోని చేపల పెరుగుదలపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పర్యావరణ ప్రొఫెసర్‌ మహరాజ్‌ పండిట్‌ అధ్యయనం ప్రకారం ఈశాన్యరాష్ట్రాల్లో ఆనకట్టల వ్యయం అధికమని వెల్లడించారు. తక్కువ జనసాంద్రత కలిగిన అరుణాచల్‌ రాష్ట్ర అవసరాలకు ఉపయోగించగా మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలంటే భౌగోళికంగా పర్వతప్రాంతం కావడంతో పవర్‌గ్రిడ్లు, ఓవర్‌హెడ్‌లైన్స్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు అధికమని అంటున్నారు.

Andala-ArunachalAndala-Arunachal


                                                                        భూకంపాల ప్రమాదం..

హిమాలయ నదులపై ప్రాజెక్టుల నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంపాల ప్రభావం అధికంగా ఉండే ఈ ప్రాంతంలో భౌగోళికంగా హిమాలయ పర్వతాలు పెరుగుతుంటాయి. ఇది కొండచరియలు విరిగిపడేందుకు దారితీసి, వరద ఉధృతిని పెంచుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ వరద 6,000 మంది మృతికి కారణమైంది. రెండు జలవిద్యుత్‌ ప్లాంట్లను నాశనం చేసింది. మనపక్కనున్న బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు 2019లో ఆ దేశంలోనున్న అన్ని నదులను 'జీవం' ఉన్న వ్యక్తులుగా పరిగణించి, న్యాయపరమైన హక్కులను కల్పించింది. జాతీయ నదీ పరిరక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసి.. అక్రమ తవ్వకాలు, నదీకాలుష్యాన్ని అడ్డుకుంటోంది. అదే మన దేశంలో ఒకపక్క నదులను పూజిస్తూ, మరోపక్క వాటి కాలుష్యానికి కారణమౌతున్నా.. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం లేదు సరికదా.. వాళ్లే ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం మరింత విచారకరం.

Andala-Arunachal


         అరుణాచల్‌ప్రదేశ్‌కు మౌలికవసతుల కల్పనలో భాగంగా భారత్‌-చైనా సరిహద్దు వరకు సాగే 2,470 కిలోమీటర్ల హైవే నిర్మాణం జిరోలోయగుండా వెళుతుంది. వరిపొలాల నుండి వెళ్లే ఈ రహదారి మొదట సింగిల్‌లైన్‌ కాస్తా డబుల్‌లైన్‌ అయ్యింది. ఇటీవల ప్రారంభించిన గ్రీన్‌ఫీల్డ్‌ డోనీపోలో విమానాశ్రయం 690 ఎకరాల్లో నిర్మించబడింది. 80 శాతం అడవులు విస్తరించిన రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా అరణ్యాలు తరిగిపోయి, అన్యాక్రాంతమౌతున్నాయి. గిరిజనులకు కావాల్సిన వసతి, విద్య, వైద్యం తప్పక అందించాలి. వారిని చైతన్యవంతులుగా చేయాలి. ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం, పునరావాస కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేతప్ప, వారి మనుగడకు భంగం వాటిల్లకూడదు. నరికివేసిన చెట్లకు ప్రత్యామ్నాయంగా వేరొకచోట వాటిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Andala-Arunachal

                                                                       చేరుకోవడం ఎలా..

అరుణాచల్‌ప్రదేశ్‌ చేరుకోవడం అంత సులువైన విషయం కాదు. సమీప ప్రధాన నగరాలు, పట్టణాలకు బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా చేరుకోవచ్చు. రాజధాని ఇటానగర్‌కు సమీపంలోని అస్సోంలోని లిలాబరి, గౌహతి, కోల్‌కతా నుంచి వారంలో నాలుగు రోజులు (ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం) విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి టాక్సీ ద్వారా రెండు గంటల్లో చేరుకోవచ్చు. దీంతోపాటు 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహరియాగున్‌ విమానాశ్రయాన్నీ ఎంచుకోవచ్చు. వీటితోపాటు గౌహతి నుంచి పవన్‌హన్స్‌ హెలీకాఫ్టర్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

Andala-ArunachalAndala-Arunachal


ఇక రైల్వే ద్వారా.. ఢిల్లీ నుంచి నహర్లాగున్‌కు, తవాంగ్‌కు కేవలం రెండు రైళ్లు మాత్రమే నడుస్తాయి. నహర్లగన్‌-గౌహతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ డైలీ సర్వీస్‌ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు 22411/నహర్లగన్‌-న్యూఢిల్లీ ఎసిఎస్‌ఎఫ్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ చేరుకోవచ్చు.
ఇక గౌహతి, జోర్హాట్‌, దిబ్రూఘర్‌, తిన్సుకియా, నాగావ్‌ వంటి పట్టణాల నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు రోడ్డు మార్గాల ద్వారా బస్సుల్లో చేరుకోవచ్చు.

                                                                 వెదురు మొలకల రుచులు..

జిరోలోయలో స్థానిక అపటనీల వంటకాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మాంసాహారం ప్రధానంగా ఉండే ఈ వంటకాల గురించి, వాటి రుచులను చెప్పడం కన్నా, ఆస్వాదించాల్సిందే. ఘాటైన ఎర్రని (భూత్‌జలోకియా రకానికి చెందిన) బొంగు మిరపకాయలతో చేసిన 'హాతీ మిర్చ', కోడిమాంసం, బియ్యపుగంజి, వెదురు మొలకలతో కలిపి చేసిన 'అమీన్‌', పులియబెట్టిన అరటిపువ్వు, వెదురు చిగురు, ఎర్రమిరపతో చేసిన 'పపక్‌', పట్టుపురుగుల ఫ్రై, పోర్క్‌తో చేసిన 'పికేపిల', అరటి బెరడుతో, మూలికలతో తయారుచేసిన వంటకాలను స్థానిక స్టాల్స్‌లో అమ్ముతుంటారు. దేశం నలుమూలల నుంచి వచ్చేవారి కోసం శాకాహార వంటకాలు, ఫ్రైడ్‌రైస్‌, చౌమీన్‌ వంటివి ఆకర్షిస్తాయి. స్థానికంగా వీళ్లు 'మిథున్‌' రకానికి చెందిన పశువులను పోషిస్తారు. అంతరించిపోతున్న పశుజాతుల్లో మిథున్‌ ఒకటి కావడంతో వాటి వధను నిషేధించాలన్న డిమాండ్‌ వినిపిస్తుంది. బీఫ్‌ వారి ఆహారంలో సర్వసాధారణం. అస్సోం నుంచి బీఫ్‌ను దిగుమతి చేసుకుంటారు. అయితే హోటల్స్‌ ముందు 'బీఫ్‌ మాంసం అమ్మ బడును' అనే బోర్డులను తీసేయాలని, స్థానిక బిజెపి ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

http://www.arunachalilp.com/onlineApp.do

                                                                       వసతి సౌకర్యాలు ఇలా..

అరుణాచల్‌ప్రదేశ్‌లో బడ్జెట్‌లో హోటళ్ల నుంచి హోమ్‌స్టేలు, సర్క్యూట్‌ హౌస్‌లు ఎన్నో వసతులు అక్కడ స్టే చేయడానికి వీలుగా ఉంటాయి. భలుక్‌పాంగ్‌, బోమ్‌డిలా, తవాంగ్‌, ఇటానగర్‌, జిరో, ఆలో వంటి నగర కేంద్రాల్లో కొన్ని ఇలాంటి హోటళ్లు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. కొన్ని ఏకాంత ప్రదేశాల్లో హోమ్‌స్టేలు, సర్క్యూట్‌ హౌస్‌లు, ఫారెస్ట్‌ లాడ్జీల్లో ఆతిథ్యాన్ని ఆస్వాదించవచ్చు. మరిన్ని వివరాల కోసం టూరిస్ట్‌ వెబ్‌సైట్‌లలో పరిశీలించొచ్చు.

                                                                  అనుమతులు తప్పనిసరి...

నిషేధిత ప్రాంతమైన ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో ప్రయాణించాలంటే భారత ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ప్రయాణపత్రం ముందుగా పొందాలి. ఇందుకుగానూ ప్రాథమికంగా రెండు రకాల అధికారిక అనుమతులు ఉన్నాయి.
1. ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌
2. ప్రొటెక్టెడ్‌ ఏరియా పర్మిట్‌
ముఖ్యంగా భారతీయ యాత్రికులు అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శించే ముందు తప్పనిసరిగా (ఐఎల్‌పి) ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ పొందాలి. ఈ ఐఎల్‌పి పర్మిట్‌తోనే ఏదైనా చెక్‌పోస్టు ద్వారా ఈ రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చు. అయితే ఈ పత్రం కేవలం 15 రోజులు మాత్రమే చెల్లుబాటవుతుంది. దీనిని ఏదైనా టూరిజం లేదా ప్రభుత్వ కార్యాలయాల (రెసిడెంట్‌ కమిషనర్‌) నుంచి పొడిగించుకునే సదుపాయం ఉంటుంది. ఈ పత్రాలు ఢిల్లీ, కోల్‌కతా, తేజ్‌పూర్‌, గౌహతి, షిల్లాంగ్‌, దిబ్రూఘర్‌, లఖింపూర్‌, జోర్హాట్‌లోని అధికారిక కార్యాలయాల్లో వీటిని జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో పర్మిట్‌ ఆన్‌ అరైవల్‌ విధానాన్ని అమలుచేయాలని యోచిస్తోంది. దీని ద్వారా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని యోచిస్తుంది.
 

                                                                        (ఐఎల్‌పి) అర్హతా పత్రాలు..

ఫారమ్‌ పూర్తిచేయడానికి రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఏదైనా గుర్తింపు కార్డు ఫొటో కాపీ (పాన్‌, ఆధార్‌, ఓటర్‌ఐడీ). వీటిని జత చేసిన ఫారంపై సంతకం చేయాలి. ఆ తర్వాత అనుమతిని పొందడానికి అవసరమైన చెల్లింపులతో టూరిజం కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు పత్రాలు అప్‌లోడ్‌ చేసిన తర్వాత అప్లికేషన్‌ ఐడీ రూపొందుతుంది. ఈ ఐడీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా చేరుతుంది. ఇది విమాన, రైల్వే టిక్కెట్‌లోని పిఎన్‌ఆర్‌ నంబర్‌లా పనిచేస్తుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తు : http://www.arunachalilp.com/onlineApp.do 
వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

- కోడే హేమలత

9490099006