
యుటిఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకునిగా మూడున్నర దశాబ్దాలు అనేక బాధ్యతల్లో పనిచేసిన నాగటి నారాయణ అక్టోబరు 10వ తేదీన తుది శ్వాస విడిచారు. గత కొద్దినెలలుగా అనారోగ్యం నుండి కోలుకొంటుండగా జరిగిన హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధ్యతల నుండి రిలీవ్ అయినా తీరికగా కూర్చునే మనిషి కాదు. నిరంతరం రాతల ద్వారా, మాటల ద్వారా మన మధ్య ఉన్న నాయకుడు ఇంత తొందరగా పోయారనే బాధ. 2014 కారు యాక్సిడెంట్‌లో ఒక గండం గడిచినా ఆ సంతోషం ఎంతోకాలం మిగలలేదు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లోని పెదబీరవల్లి గ్రామం తెలంగాణ రైతాంగ పోరాట కాలం నుంచి కమ్యూనిస్టుల అడ్డా. ఆ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో సుందరమ్మ, సామేలు బిడ్డగా తండ్రి బాటలో నడవడానికి సిద్ధమయ్యాడు నారాయణ. ఆ రకంగా విద్యార్థి, యువజన ఉద్యమాల కార్యక్రమాలలో భాగమయ్యాడు. 1980లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కొలువులో చేరాడో లేదో...గిరిజన బిడ్డల భోజనం నాసిరకంగా ఉందని తిరగబడ్డాడు. ఈ ధిక్కారాన్ని హెచ్.ఎం, డిటిడబ్లుఓ సహించలేక పోయారు. దండకారణ్యానికి బదిలీ చేశారు. సిపియం నాయకులు బత్తుల భీష్మారావు, చంద్రరావుల హెెచ్చరికతో అక్రమ బదిలీ రద్దుచేయబడింది. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమిస్తూ స్థానిక గిరిజనులకు ఉపాధినిచ్చే స్పెషల్ డియస్సీలు, టీచరు పోస్టుల మంజూరు, సబ్‌డైట్ కేంద్రాలు పెట్టించడం, ఈ క్రమంలోనే భద్రాచలం, రంపచోడవరం ఐటిడిఎ సదస్సులు ఆయన ఆలోచనల్లో జరిగాయి. కా||వి.ఎల్.నరసింహారావు సాహచర్యం నన్ను మరింత ముందుకు నడిపించిందని ఆయనే చెప్పారు. యుటిఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా, 1994 నుండి రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర సహాధ్యక్షునిగా వుంటూ...2000లో కాకినాడ రజతోత్సవ మహాసభల్లో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు.
పది డియస్సీల ద్వారా (1994-2012 మధ్య) నియామకమైన సుమారు రెండున్నర లక్షల మంది ఉపాధ్యాయుల అప్రెంటీస్ సెలవులు, స్టైఫండ్ పెంపు, అప్రెంటీస్ సర్వీసుకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేళ్ళకు లెక్కింపు, మధ్యలో అప్రెంటీస్ సర్వీసు నాలుగు సంవత్సరాల పెంపును రెండు సంవత్సరాలకు తగ్గించడం, అప్రెంటీస్ సర్వీసు పెన్షన్‌కు లెక్కింపు, అప్రెంటీస్ సర్వీసుకు నోషనల్ ఇంక్రిమెంట్లు, తుదకు అప్రెంటీస్ రద్దు వరకు జరిగిన పోరాటాలు- పరిష్కారాలను గుర్తుంచుకోవాలి. ఎస్.సి, ఎస్.టి, బి.సి స్పెషల్ విద్యా వాలంటీర్ నియామకాలు, స్టైఫండు చెల్లింపు, ఉచిత శిక్షణ, రెగ్యులర్ స్కేలు మంజూరు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఈ సర్వీసు పెన్షన్ లెక్కింపుతో వీరందరిని పాత పెన్షన్ లోకి తీసుకురావడం విజయాలుగా చెప్పాలి. పాఠశాల విద్యలో తొలిసారిగా ఫిజిక్స్, ఇంగ్లీషు పోస్టుల మంజూరు, గ్రేడ్-2 హెచ్.యం పోస్టుల మంజూరు, వీరికి అధికారాల బదలాయింపు, ఉన్నత పాఠశాలల్లోని సెకండరీగ్రేడ్ పోస్టులన్నిటి అప్‌గ్రెడేషన్, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్, మున్సిపల్ పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఎ పోస్టుల మంజూరు, 86-90 స్పెషల్ టీచర్లకు 8/16 సం||ల స్కేలు వర్తింపు, 50 వేల పోస్టులతో జరిగిన 2008 డియస్సీ నియామకాలకై పోరాటం, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ద్వారా జీతాల చెల్లింపు, పి.ఆర్.సి, ఐ.ఆర్, ఫిట్‌మెంట్లలో పెరుగుదల, గిరిజన సంక్షేమ, మున్సిపల్ ఉపాధ్యాయులకు డిపార్ట్‌మెంట్ సర్వీసు రూల్స్, ఉమ్మడి సర్వీసు రూల్స్...సాధనలో యుటిఎఫ్ కీలక పాత్ర పోషించింది. ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యాచరణ అందుకు దోహదపడింది. ఆ సమయాల్లో నాగటి నారాయణ ముఖ్య పాత్ర పోషించారు. అప్రెంటీస్ రద్దు కోసం 2011లో 8 రోజుల ఆమరణదీక్షలో సైతం పాల్గొన్నారు. యుటిఎఫ్ బ్యానర్ స్లోగన్ అధ్యయనం- అధ్యాపనం-పోరాటం అనే లక్ష్యాలకు అనుగుణంగా విద్యారంగాన్ని, అందులో ఉపాధ్యాయుల సంక్షేమాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ ఉద్యమాన్ని నడిపిన నారాయణకు ఉద్యమ జోహార్లు!
- ఐ. వెంకటేశ్వరరావు,
ఉద్యమ సహచరుడు, ఎమ్మెల్సీ.