Feb 08,2023 07:23

భూములు లీజుకు ఇవ్వడం ద్వారా పావగడ ప్రాంతంలో వచ్చిన మార్పులను అనేక సంస్థలు, వ్యక్తులు పరిశోధించి నివేదికలు ప్రకటించారు. ఈ పద్ధతి వల్ల ఒకవైపు భూస్వాములు, ధనిక రైతులు బాగా లాభపడ్డారు. తమ పొలాలపై పట్టు కొనసాగిస్తూనే బీడు పెట్టిన భూముల నుండి ప్రతి సంవత్సరం నికరమైన ఆదాయం పొందడమే కాక, సోలార్‌ వ్యాపారంలో వాటాదారులుగా మారారు. మరోవైపు కొండలు, గుట్టలు, బీడు భూముల్లో సంచరిస్తున్న తోడేళ్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. పశువులకు గడ్డి, నీళ్లు కరువై కబేళాలకు తరలించారు. వ్యవసాయ కూలీలు ముఖ్యంగా మహిళలు పనులు కోల్పోయారు. వలసలు పెరిగాయనేది ఈ నివేదికల సారాంశం. వీటిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో అదానీ కంపెనీలకు భూములు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

            గుజరాత్‌కు చెందిన గౌతమ్‌ అదానీ అనంతపురం జిల్లా ఆధునిక భూస్వామి కాబోతున్నారు. 'అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌' పేరుతో అనంతపురం జిల్లాలో 18 వేల ఎకరాలు, సత్యసాయి జిల్లాలో మరో 25 వేల ఎకరాలు (ఉమ్మడి అనంతపురం జిల్లాలో) గుర్తించారు. మొత్తం మీద 48 వేల ఎకరాల భూమిని రైతుల నుండి లీజు పద్ధతిలో తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఇడిసిఎపి (న్రెడ్‌ కాప్‌) ద్వారా అదానీ కంపెనీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సోలార్‌ ఎనర్జీ రాజధానిగా అనంతపురం జిల్లా మారబోతున్నదని అధికార పార్టీ నేతలు ఊదరగొట్టారు. ఎలాగూ పంటలు పండడంలేదు కదా. లీజుకు ఇస్తే సంవత్సరానికి కొంత ఆదాయమైనా గ్యారంటీగా వస్తుందని రైతులు సిద్ధమయ్యారు. గౌతమ్‌ అదానీ అసలు రూపాన్ని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ బయటపెట్టడం, ఎల్‌ఐసితో పాటు అనేక బ్యాంకుల్లో ఆయన తీసుకున్న రుణాల సమస్య, అదానీ కంపెనీల షేర్ల పతనం, చివరకు అదానీ గ్రూపుకు అప్పులు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు నిరాకరించడం జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. అదానీ సోలార్‌కు భూములు ఇస్తే తమకు ఇస్తామన్న లీజు ఖచ్చితంగా అందుతుందా? ఎవరు ఇందుకు గ్యారంటీ? అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 

                                                   అదానీ గ్రీన్‌ ఎనర్జీ కోసం 48 వేల ఎకరాల భూమి

అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ద్వారా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయడం కోసం అనంతపురం జిల్లాలోని హీరేహాళ్‌ మండలంలో ఆరు గ్రామాలకు చెందిన 6,660.08 ఎకరాలు, కణేకల్లు మండలంలో మూడు గ్రామాలకు చెందిన 2,711.37 ఎకరాలు, బొమ్మనహళ్‌ మండలంలో మూడు గ్రామాలకు చెందిన 1,343.33 ఎకరాలు, రాయదుర్గం మండలంలో ఒక గ్రామానికి చెందిన 1,117.03 ఎకరాలు మొత్తం 11,831.81 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. మరో మూడు వేల ఎకరాల కోసం సర్వేలు చేస్తున్నారు. అంకెలు మాత్రమే చూస్తే నాలుగు మండలాల్లోని 13 గ్రామాల్లో ఈ భూమిని సేకరిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మొత్తం 15 వేల ఎకరాల భూమి ఒకే చోట కలిసే జంక్షన్‌లో ఈ సోలార్‌ ప్లాంట్‌ పెడుతున్నారు. గతంలో జిల్లాలో ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కంపెనీలన్నీ ప్రభుత్వ సహాయంతో రైతుల నుండి భూమిని కొని ఉత్పత్తి ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం అదానీ కంపెనీ మాత్రం లీజు (గుత్త) పద్ధతిలో రైతుల నుండి భూమిని సేకరిస్తున్నది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం 'భూ సమీకరణ ఏజెన్సీ న్యూ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఎ.పి లిమిటెడ్‌' ద్వారా చేయిస్తుంది. ఈ 13 గ్రామాల్లో గత నాలుగైదు నెలల క్రితం రాయదుర్గం ఎంఎల్‌ఏ, ఎపిఐఐసి ఛైర్మన్‌, తహసీల్దార్‌, అదానీ కంపెనీ ప్రతినిధుల కలిపి సభలు జరిపారు. రైతులు కంపెనీతో 30 సంవత్సరాల లీజు ఒప్పందం చేసుకోవాలి. సంవత్సరానికి ఎకరాకు రూ.30 వేలు, ప్రతి మూడు సంవత్సరాలకు 5 నుండి 8 శాతం లీజు మొత్తం పెరచుతారని, ఈ మొత్తాన్ని ప్రతి సంవత్సరం అదానీ కంపెనీ నేరుగా రైతు అకౌంట్లకు జమ చేస్తుందని అధికారులు చెప్పినట్లు రైతులు చెబుతున్నారు. ఎవరైనా భూమి అమ్ముకోవలసి వస్తే అమ్ముకోవచ్చునని...అయితే ఆ కొన్న వ్యక్తి కూడా తమకే లీజుకు ఇవ్వాల్సి వుంటుందని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు.
            అదానీ ఎనర్జీ కోసం ప్రస్తుతానికి 2,306 మంది రైతుల నుండి 11,831 ఎకరాల భూమి సేకరించారు. ఇందులో అసైన్డ్‌ భూమి 1457.14 ఎకరాలు, ప్రభుత్వ భూమి 557.52 ఎకరాలు, ప్రైవేట్‌ భూములు 9,817.18 ఎకరాలు. భూములు లీజుకు ఇవ్వడంలో అందరికంటే ముందుభాగాన వున్న వారు ధనిక రైతులు. ఉదా: హీరేహాళ్‌ మండలం ఒక్క మురడి గ్రామంలోనే 1406 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. అందులో ఆనందరెడ్డి అనే ధనిక రైతు కుటుంబానికి చెందిన భూమి 95 ఎకరాలు. అలాగే ఉంతకల్లు గ్రామానికి చెందిన ప్రస్తుత ఎపిఐఐసి ఛైర్మన్‌, రాయదుర్గం మాజీ ఎంఎల్‌ఏ మెట్టు గోవిందరెడ్డి కుటుంబానికి చెందిన సుమారు వంద ఎకరాలకు పైగా భూములు వున్నాయి.
 

                                        భూములు ఇవ్వడానికి రైతులు ఎందుకు సిద్ధమయ్యారు ?

జిల్లాలో గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయం క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. రాష్ట్రంలోనే అత్యధిక సాగయ్యే వేరుశనగ పంటసాగు గణనీయంగా తగ్గిపోయింది. వర్షాలు సకాలంలో రాకపోవడం, వ్యవసాయంలో వచ్చిన మార్పుల వల్ల నగదు వుంటేనే వ్యవసాయం చేసే పరిస్థితి ఏర్పడడం, విత్తనాలు, ఎరువుల ధరలు భారీగా పెరుగుతుండడం, పండించిన పంటలు గిట్టుబాటు కాకపోవడం రైతులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనుచేశాయి. వీటి నుండి ఆదుకోవలసిన ప్రభుత్వాలు వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అరకొర పంట నష్టపరిహారం ఇవ్వడంతో సరిపెడుతున్నారు. తాము ఎలాగూ వ్యవసాయం చేసి బాగుపడేది లేదని పేద రైతులు, పట్టణాల్లో వుండి గ్రామాల్లో పంటలు పెట్టి వ్యవసాయం చేయడం కష్టమని ధనిక రైతులు భావిస్తున్నారు. భూముల మీద ధనిక రైతాంగం పట్టు కొనసాగిస్తూనే ఆదాయం వచ్చే వనరుగా లీజు పద్ధతి వారికి తోడ్పడుతుంది. అందుకే అదానీ కంపెనీలకు భూములను లీజుకు ఇవ్వడంలో ధనిక రైతాంగం ముందు భాగాన వుంది. పేద, మధ్యతరగతి రైతాంగం ప్రభుత్వాలపై విశ్వాసాన్ని కోల్పోయి లీజుకు అంగీకరిస్తున్నారు.అనంతపురం జిల్లాలోని వాతావరణ పరిస్థితులు కూడా ఇందుకు అదనంగా తోడయ్యాయి. వేసవి కాలం మార్చి నుండి మే నెల వరకూ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు. కనిష్టం 28 నుండి 33 డిగ్రీలు. జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకూ గరిష్టం 35 నుండి 40 డిగ్రీలు. కనిష్టం 24 నుండి 28 వరకూ. నవంబర్‌ నుండి జనవరి వరకూ గరిష్టం 25 నుండి 28 వరకూ. కనిష్టం 14 నుండి 20 డిగ్రీల ఉష్ణోగ్రత వుంటుంది. అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో అత్యధిక మండలాల్లో సంవత్సరంలో తొమ్మిది నెలలు 35 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత వుంటుంది. వర్షాలు లేకపోవడంతో భూమి వేడి కూడా ఎక్కువగా వుంటుంది. అందువల్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఇక్కడ ఎక్కువ అవకాశాలు వున్నాయి. పంటలు పండకపోవడానికి ఈ వాతావరణ పరిస్థితులు కూడా కారణం. ఈ అంశాలన్నీ కలిసి అదానీ లాంటి కంపెనీలకు చౌకగా, ఏ ప్రతిఘటన లేకుండా భూములు ఇచ్చే పరిస్థితిని సృష్టించాయి.
 

                                                                కర్ణాటక అనుభవం ఏమిటి ?

కర్ణాటక రాష్ట్రంలో బాగా వెనుకబడిన పావగడ తాలుకా తిరుమణి పంచాయితీ లోని ఐదు గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల నుండి 2,050 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం 13,000 ఎకరాల భూమిని కర్ణాటక సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా సేకరించారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద సోలార్‌ పార్క్‌లలో ఒకటైన 'శక్తి స్థల' లేదా 'పవర్‌ ప్లేస్‌' పేరుతో 2018లో ప్రారంభించారు. 2013 భూసేకరణ చట్టాన్ని, పర్యావరణ అనుమతులు లేదా పబ్లిక్‌ విచారణలు ఏవీ పాటించకుండా నేరుగా ఈ భూమిని సేకరించారు. రైతుల నుండి 28 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు.
         మొదటి ఐదు సంవత్సరాలకు 5 శాతం పెంపుదల ఆ తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పెంపుదల జరుగుతుంది. భూములు లీజుకు ఇవ్వడం ద్వారా పావగడ ప్రాంతంలో వచ్చిన మార్పులను అనేక సంస్థలు, వ్యక్తులు పరిశోధించి నివేదికలు ప్రకటించారు. ఈ పద్ధతి వల్ల ఒకవైపు భూస్వాములు, ధనిక రైతులు బాగా లాభపడ్డారు. తమ పొలాలపై పట్టు కొనసాగిస్తూనే బీడు పెట్టిన భూముల నుండి ప్రతి సంవత్సరం నికరమైన ఆదాయం పొందడమే కాక, సోలార్‌ వ్యాపారంలో వాటాదారులుగా మారారు. మరోవైపు కొండలు, గుట్టలు, బీడు భూముల్లో సంచరిస్తున్న తోడేళ్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. పశువులకు గడ్డి, నీళ్లు కరువై కబేళాలకు తరలించారు. వ్యవసాయ కూలీలు ముఖ్యంగా మహిళలు పనులు కోల్పోయారు. వలసలు పెరిగాయనేది ఈ నివేదికల సారాంశం. వీటిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో అదానీ కంపెనీలకు భూములు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
 

                                                           లక్షల ఎకరాలు సోలార్‌ కంపెనీల పరం

గత ఎనిమిది సంవత్సరాల్లో రాయలసీమ జిల్లాల్లో లక్షల ఎకరాల భూమి సోలార్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్లింది. ప్రవేట్‌ సోలార్‌ కంపెనీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎపిఎస్‌పిసిఎల్‌) ద్వారా రాయలసీమ వ్యాప్తంగా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. 'అనంతపురం అల్ట్రా మెగా సోలార్‌ ప్రాజెక్టు' 1500 మెగావాట్లు, 'కర్నూలు అల్ట్రా మెగా సోలార్‌ ప్రాజెక్టు' 1000 మెగావాట్లు, 'కడప అల్ట్రా మెగా సోలార్‌ ప్రాజెక్టు' 1000 మెగావాట్ల ఉత్పత్తి కోసం మొదట్లో 47 వేల ఎకరాల భూమిని సేకరించారు. తర్వాత దాన్ని విస్తరిస్తూ పోతున్నారు. సత్యసాయి జిల్లాలో ఎన్‌.పి కుంట మండలంలో 1500 మెగావాట్ల ఉత్పత్తి కోసం 8 వేల ఎకరాల భూమిని రైతుల నుండి నామమాత్రపు పరిహారం చెల్లించి తీసుకున్నారు. ఇదే జిల్లాలో చిన్న, మధ్యతరహా ప్రైవేట్‌ సోలార్‌ కంపెనీలు సుమారు 72 వేల ఎకరాల భూమిని సేకరించాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ కోసం అనంతపురం జిల్లాలో 18 వేల ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 25 వేల ఎకరాలు, ఇది కాకుండా అనంతపురం జిల్లా లోని కంబదూరు మండలంలో ఆరు గ్రామాల నుండి రాళ్ల అనంతపురం సోలార్‌ ప్లాంట్‌ కోసం 45,085 ఎకరాలు, సత్యసాయి జిల్లా కదిరి సోలార్‌ ప్లాంట్‌ కోసం తలుపుల మండలంలో ఏడు గ్రామాలకు చెందిన 61,941 ఎకరాలు, ఓడిసి సోలార్‌ ప్లాంట్‌ కోసం ఓబుళదేవచెరువు మండలంలోని 14 గ్రామాలకు చెందిన 64,343 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో చట్ట ప్రకారం భూమిని సేకరించడం పెట్టుబడిదారులకు ఇబ్బంది కాబట్టి లీజు పద్ధతి ద్వారా రైతులను మభ్యపెట్టి చట్టాలను తుంగలో తొక్కి వేల ఎకరాల భూములు సేకరిస్తున్నారు. ఇందుకు భూస్వామ్య, ధనిక వర్గాల మద్దతు, పాలక వర్గ పార్టీల నేతల అండ పుష్కలంగా వుండడం, రైతుల దీన పరిస్థితులు అదానీ లాంటి ప్రైవేట్‌ కంపెనీలకు కలిసి వస్తున్నాయి.
 

                                                                 అదానీ వ్యవహారంతో ఆందోళన

అదానీ కంపెనీ డొల్లతనం గురించి ప్రపంచవ్యాప్త చర్చ జరుగుతుండడంతో అదానీ గ్రీన్‌ ఎనర్జీ కోసం భూములు ఇవ్వడానికి సిద్ధమైన రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎల్‌ఐసి, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో అక్రమాలకు పాల్పడిన అదానీ తమకు మాత్రం లీజు మొత్తం ఇస్తాడా? ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి? అసలు ఒప్పంద పత్రాల్లో ఏముంది? అని అధికారులను, ప్రజాప్రతినిధులను రైతులు ప్రశ్నిస్తున్నారు. 'డబ్బు చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా కంపెనీలకు రైతులను బలిపెట్టే విధానం మాకొద్దం'టున్నారు. మొన్నటి వరకు భూముల సేకరణ కోసం గ్రామాల వెంట తిరిగిన అధికారులు, అధికారపార్టీ నాయకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌