Nov 12,2022 06:56

విభజన చట్టం ప్రకారం కేంద్రం నెరవేర్చవలసినవి బాధ్యతలు. అవి రాష్ట్రానికి కేంద్రం దయదలిచి ఇచ్చే వరాలు కావు. రాష్ట్ర ప్రజలకి సంక్రమించిన హక్కులు. వాటిలో ఏ ఒక్కదానినైనా సవ్యంగా, నిజాయితీగా కేంద్రం అమలు చేసిందా అంటే అదీ లేదు. పోలవరం విషయంలో గాని, రైల్వే జోన్‌ విషయంలోగాని కేంద్రం ఆడుతున్న నాటకం చూస్తూనే వున్నాం. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు పట్టుబట్టి పోరాడి సాధించుకున్న విలువైన సంపదలను కాజేసే పనిలో తలమునకలైవున్నారు. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అదానీ చేతుల్లోకి పోయాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు మీద పడ్డారు. కార్పొరేట్ల దాహానికీ అందు లేదు, మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహానికీ అంతు లేదు.

          సాధారణంగా మనం మన ఇంటికి కొందరు బంధువులు వస్తే బాగుంటుందని అనుకుంటాం. వాళ్ళ రాక మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చేటప్పుడు మనకి ఆనందాన్ని, సౌకర్యాన్ని, సంతృప్తిని కలిగించే విషయాలు ఏమిటి? అన్నది కాస్తంత ముందుగానే ఆలోచించుకుని వస్తారు. వాళ్ళు రాగానే మన ఇంట్లోని పిల్లలు చుట్టూ చేరి ''నాకేం తెచ్చావు మావయ్యా?'' అనో, '' నేను గతంలో చెప్పింది గుర్తుందా బాబారు?'' అనో, ''బలే ! బలే ! మా తాతయ్య నాకు ఫలానా డ్రస్సు తెచ్చాడోచ్‌!'' అనో కేరింతలు కొడుతూ సంబరపడతారు.
         కాని అందరు బంధువుల విషయమూ అటువంటిదిగానే ఉంటుందా? కొందరు మహానుభావులు ఉంటారు. వాళ్ళు మన ఇళ్ళకి రాకుండా ఉంటేనే బాగుంటుందని మనం అనుకుంటూ వుంటాం. మనం పిలవకపోయినా వాళ్ళే వచ్చేస్తూ వుంటారు. ఆ తరహా బంధువులు వచ్చి వెళ్ళాక మన కుటుంబ సభ్యుల్లోనే తగువులు బయలుదేరుతాయి. భార్య మీద భర్తకో, లేకపోతే భర్త మీద భార్యకో, కాకపోతే తండ్రి మీద పిల్ల్లలకో అసంతృప్తులు తలెత్తుతాయి. కాస్తంత తమాయించుకుని, ''ఇన్నాళ్ళూ లేని ఈ తగువులు, అసంతృప్తులు ఇప్పుడే ఎందుకొచ్చాయి?'' అని గనుక ఆలోచించుకుంటే ఆ తగువులకి మూల కారణం మన ఇంటికి వచ్చి వెళ్ళిన మహానుభావుడే అని బోధపడుతుంది.
         ఈ సోది అంతా ఇప్పుడెందుకు చెప్తున్నానంటారా? మన రాష్ట్రం కూడా ఒక కుటుంబం లాంటిదే కదా. మన రాష్ట్రానికి కేంద్రం నుండి అతిథులు రావడం, పోవడం జరుగుతోంది కదా. ఈ మధ్యనే మన ఆడపడుచు (అని మన తెలుగు అన్నలు పార్టీలకు అతీతంగా సంబరపడిపోతూంటారు) నిర్మలమ్మ వచ్చి వెళ్ళారు. ఇప్పుడు అందరికన్నా విశిష్ట అతిథి మోడీజీ విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనగారి విశాఖ పర్యటనను చాలా గొప్పగా నిర్వహించాలని సకల ప్రయత్నాలూ చేయడంలో తలమునకలై వుంది. మరి విశాఖకు వచ్చిన మన విశిష్ట అతిథి ఏకోవకు చెందుతారు? మనం సంబర పడదామా? లేకపోతే జాగ్రత్త పడదామా? ఆయనగారు మన రాష్ట్రానికి ఏదన్నా ఉపకారం చేసే రకమా? లేకపోతే తగువులు రేపెట్టి చంకలు గుద్దుకునే రకమా?
          ఆ పెద్దమనిషి తిరుపతి బహిరంగ సభలో 2014 ఎన్నికల సందర్భంలో చాలా గట్టిగా చెప్పిన విషయం ఏమిటి? గుర్తుందా? ''మమ్మల్ని (అంటే బిజెపిని, మిత్రపక్షంగా అప్పుడు ఉండిన టిడిపి ని) గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్‌ కి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తాం'' అన్నారు. ఆ పదేళ్ళూ పూర్తి కావస్తున్నాయే తప్ప ప్రత్యేక హోదా సంగతి ఏమైంది? నీతి ఆయోగ్‌ అడ్డం పడిందని ఒకసారి, ఆంధ్ర ప్రదేశ్‌ కి ఇస్తే ఇంకా చాలా రాష్ట్రాలు అడుగుతాయని ఇంకోసారి, ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని మరోసారి ఇలా నానా రకాలుగా సాకులు చెప్తూ కాలక్షేపం చేస్తున్నారు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను రెండుగా విడగొట్టాలని, ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అని అందరికన్నా మొదట కాకినాడలో తీర్మానం చేసిందే ఈ బిజెపి. అంటే చీలిక తగువు ఆ పార్టీ పుణ్యమే. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి మొర్రో అని మనం ఎంత మొత్తుకున్నా, పార్లమెంటులో విభజన చట్టం ఆమోదం పొందగలిగిందీ అంటే అందుకు బిజెపి ఇచ్చిన పూర్తి మద్దతు కారణం కాదా? ఆ సందర్భంగానే కదా ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చింది? దానిని మొదట రేపింది ఎవరు ? ఈ బిజెపినే కదా ? అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఐదేళ్ళ పాటు ప్రత్యే హోదా ఇస్తామని అంటే ''కాదు, కాదు, పదేళ్ళు ఇవ్వాలని'' పట్టుబట్టింది ఈ బిజెపినే కదా? ఎన్నికల ముందు మరోసారి ఆ విషయంలో హామీ ఇచ్చిందీ బిజెపినే కదా? తీరా గద్దె మీద కూచున్నాక మాట మార్చి మొండి చెయ్యి చూపించిందీ బిజెపినే కదా ?
         విచిత్రం ఏమంటే ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు రెండూ ఆ ఊసు ఎత్తకుండా ''వ్యూహాత్మకంగా'' మౌనం వహిస్తున్నారు. పైగా ఒకరితో మరొకరు పోటీ పడుతూ ఆ బిజెపి పల్లకీ మోయడానికి నానా తంటాలూ పడుతున్నారు. ''సిరి అబ్బలేదు కాని చీడ పట్టుకుంది'' అన్న చందాన మనకి తగువులు మిగిలాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ బిజెపికి మాత్రం వందకి వంద శాతం ఓట్లూ మన రాష్ట్రం నుండి పడ్డాయి.
          మన విశిష్ట అతిథి గారు మళ్ళీ మరోసారి అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వపు బాధ్యత. కాబట్టి శంకుస్థాపన చేయడానికి వచ్చిన పెద్దమనిషి ఆ నిర్మాణబాధ్యత తామే చేపడతామని ప్రకటించి ఎంతో కొంత నిధులను గ్రాంటు చేస్తాడని అందరమూ అనుకున్నాం. కాని అప్పుడేం ఇచ్చాడో మనకి తెలుసు కదా ? ముంతడు నీళ్ళూ, పిడికెడు మట్టీ.
        మళ్ళీ ఇక్కడా విచిత్రమే. మన ఇద్దరు ప్రధాన ప్రాంతీయ వీరులూ విభజన చట్టం ప్రకారం రాజధానిని నిర్మించడానికి బాధ్యత ఎందుకు తీసుకోలేదని కేంద్రాన్ని అడగడం లేదు. విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళపాటూ ఆయన సింగపూర్‌ చుట్టూ, భ్రమరావతి చుట్టూ తన ప్రచారార్భాటాన్నంతా తిప్పారు. ఆ భ్రమల్లో శలభాల్లా చిక్కుకున్న రైతుల నుండి వేలాది ఎకరాలను సేకరించారు. రాజధాని నిర్మాణం పట్ల ప్రధాన బాధ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ హడావుడి జరుగుతున్నంతసేపూ నోరు మెదపనే లేదు.
         ప్రభుత్వం మారి జగనన్న వచ్చాక రాజధాని సీన్‌ మారిపోయింది. ఒక రాజధాని కాస్తా ఇప్పుడు మూడు రాజధానులైపోయింది! అమరావతే అభివృద్ధికి మార్గం అని టిడిపి, మూడు రాజధానులతోటే అభివృద్ధి అని వైసిపి రాష్ట్రంలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అభివృద్ధేమో అటకెక్కింది. రాజధాని నిర్మాణానికి ప్రధాన బాధ్యత వహించాల్సిన బిజెపి మాత్రం మహదానందంగా, ''రెండు పిల్లులూ-రొట్టె-కోతి'' కథలో కోతి పాత్రను యధోచితంగా పోషిస్తోంది. మోడీ శంకుస్థాపనతో మొదలైన యవ్వారం ఇన్నాళ్ళ తర్వాత ఇక్కడిదాకా తెచ్చింది. శంకుస్థాపన నాడే ''రాజధాని నిర్మాణం బాధ్యత నాది'' అని స్పష్టంగా మోడీ ప్రకటించి, ఆ బాధ్యతను సవ్యంగా నిర్వర్తించివుంటే ఇన్నేళ్ళపాటూ మనకి ఈ తగువులు ఉండేవా?
      విభజన చట్టం ప్రకారం కేంద్రం నెరవేర్చవలసినవి బాధ్యతలు. అవి రాష్ట్రానికి కేంద్రం దయదలిచి ఇచ్చే వరాలు కావు. రాష్ట్ర ప్రజలకి సంక్రమించిన హక్కులు. వాటిలో ఏ ఒక్కదానినైనా సవ్యంగా, నిజాయితీగా కేంద్రం అమలు చేసిందా అంటే అదీ లేదు. పోలవరం విషయంలో గాని, రైల్వే జోన్‌ విషయంలోగాని కేంద్రం ఆడుతున్న నాటకం చూస్తూనే వున్నాం. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు పట్టుబట్టి పోరాడి సాధించుకున్న విలువైన సంపదలను కాజేసే పనిలో తలమునకలైవున్నారు. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అదానీ చేతుల్లోకి పోయాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు మీద పడ్డారు. కార్పొరేట్ల దాహానికీ అందు లేదు, మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహానికీ అంతు లేదు.
        ఇంతకీ ఇప్పుడు మోడీని రాష్ట్రానికి రమ్మనమని ఆహ్వానించింది ఎవరు? మోడీ విశాఖలో ప్రారంభించబోతున్నవన్నీ కేంద్రం పరిధి లోని అంశాలే. మనం అడిగినవి, కోరుకున్నవి ఏవీ వాటిలో లేవు. ''కట్టుకోడానికి గుడ్డలు లేవురా బాబూ'' అంటే ''ముక్కు తుడుచుకోడానికి ఈ పీలిక ఉంచుకో'' అని దానం చేసినట్టు ఉన్నాయి అవి.
        మరి ఈ మాత్రం దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని పర్యటన ఏర్పాట్లలో తలమునకలైపోయి, ఆంధ్రా యూనివర్సిటీలో చెట్లు కూల్చేసి, పెదవాల్తేరు లో అధికారికంగా, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కొనసాగుతున్న చిన్న, చితకా దుకాణాలని కూలగొట్టేసి, నానా హడావుడీ చేయడమెందుకో! మోడీ వస్తున్న సందర్భంగా ఎవరూ ఏవిధమైన నిరసనలూ చేపట్టకూడదని ముందస్తుగా నోటీసులు పంపడం దేనికో! అంటే, మోడీజీకి విశాఖలో ఎదురయేవి నిరసనలే అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే బోధపడిపోయిందన్నమాట.
         సందట్లో సడేమియా అన్నట్టు 'మోడీ విశాఖ వచ్చినంత మాత్రాన మా పార్టీ వైసిపి తో జత కడుతుందని ఎవరూ ఆందోళన పడకండ'ి అంటూ పరోక్షంగా జనసేనానికి, చంద్రబాబుకు సంకేతాలు పంపుతున్నారు రాష్ట్ర బిజెపి నాయకులు.
         ''కనీసం ఇప్పుడైనా విభజన హామీలనన్నింటినీ అమలు చేయడానికి ఆదేశాలు ఇవ్వండి. విశాఖ ఉక్కును అమ్మేది లేదని ప్రకటించండి'' అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక ప్రకటననైనా ఇచ్చే ధైర్యం ఈ జగన్‌ ప్రభుత్వానికి ఉందా? పోనీ, జగన్‌ ప్రభుత్వాన్ని నిత్యం దుమ్మెత్తిపోసే చంద్రబాబు కి కాని, పవన్‌ కల్యాణ్‌ కి కాని ఈ విషయాలపై మోడీని నిలదీసే సత్తా ఉందా?
       జంతుశాస్త్రంలో ''వెన్నెముక లేని జీవుల'' గురించి చదువుకున్నాం. ఇప్పుడు ఆ తరహా జీవులు రాష్ట్ర రాజకీయాల్లో ఆడుతున్న డ్రామాలు చూస్తున్నాం. కనీసం మన వెన్నెముకలనైనా కాస్తంత నిటారుగా నిలబెడదామా ?

సుబ్రమణ్యం