Oct 29,2022 06:52

ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇదొక ముసుగు మాత్రమే. గవర్నర్‌ తన ఛాన్సలర్‌ పదవిని దుర్వినియోగం చేయడం కేరళ ఒక్కచోటే కాదు. పలు ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాల వ్యవహారాలకు సంబంధించి గవర్నర్లు జోక్యం చేసుకుంటూనే వున్నారు. వైస్‌ ఛాన్సలర్ల, కీలక సిబ్బంది నియామకంలో అడ్డంకులు సృష్టిస్తూనే వున్నారు.

          అదుపు తప్పిన గవర్నర్‌ ఎలా వ్యవహరిస్తారో కేరళ ప్రస్తుతం చూస్తోంది. ఒకరోజు కేరళ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లందరినీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరో రోజు ప్రభుత్వంలోని ఒక మంత్రి వైఖరి తనకు నచ్చడం లేదు కాబట్టి ఆయనను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు.
         ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేస్తూ వెలువరించిన ఉత్తర్వులను ఉపయోగించుకుని గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లను అక్టోబరు 25న ఉదయం 11.30 గంటలకల్లా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను అక్టోబరు 24న పంపారు. 8 మంది వైస్‌ ఛాన్సలర్లు రాజీనామా చేయడానికి తిరస్కరించారు. గవర్నర్‌ చర్యకు వ్యతిరేకంకగా హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు తీర్పుతో 9వ వైస్‌ఛాన్సలర్‌ను తొలగించారు. కోర్టులో వైస్‌ ఛాన్సలర్ల పిటిషన్‌ విచారించడానికి కొద్ది ముందుగా, గవర్నర్‌ ఒకడుగు వెనక్కు వేసి, వైస్‌ ఛాన్సలర్ల నియామక క్రమంలో అవకతవకలు జరిగినందున వారిని పదవుల నుండి ఎందుకు తొలగించరాదో నవంబరు 3వ తేదీకల్లా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు వైస్‌ ఛాన్సలర్లకు కూడా గవర్నర్‌ ఇదే రీతిలో షోకాజ్‌ నోటీసులు పంపారు. ఇటీవలి కాలంలో వరుసగా తీసుకున్న కొన్ని చర్యల నేపథ్యంలో గవర్నర్‌ తాజా చర్య వెలువడింది. అంతకుముందు, కన్నూర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ నియామక ఉత్తర్వులపై సంతకాలు చేసిన అనంతరం ఆయన పున:నియామకాన్ని గవర్నర్‌ ప్రశ్నించారు. సవాలు చేయబడిన ఈ నియామకాన్ని కేరళ హైకోర్టు ధృవీకరించింది. ఇటీవలి కాలంలోనే, కేరళ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌, సెనెట్‌కు వ్యతిరేకంగా గవర్నర్‌ పోరాటం ప్రారంభించారు. ఖాళీగా వున్న వైస్‌ ఛాన్సలర్‌ ఎంపిక విషయమై సెర్చ్‌ కమిటీ స్వభావానికి సంబంధించి చట్టంలోని నిబంధనలను పక్కకు పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. ఇటువంటి అక్రమ పద్ధతులను సెనెట్‌ ప్రతిఘటించింది. దీంతో సెనెట్‌ లోని 15 మంది సభ్యులను సెనెట్‌ సభ్యత్వం నుండి ఏకపక్షంగా తొలగించారు. వైస్‌ చాన్సలర్లకు వ్యతిరేకంగా తీసుకున్న ప్రస్తుత చర్యలో కూడా, వీరందరినీ ఆయా వర్శిటీల ఛాన్సలర్‌ హోదాలో నియమించింది గవర్నరేనన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నిబంధనలు, చట్టాల కింద, ఛాన్సలర్‌ తన స్వంతంగా వైస్‌ చాన్సలర్‌ను ఆ పదవి నుండి తొలగించలేరు. ఉదాహరణకు, ఆర్థికపరమైన దుర్వినియోగం లేదా తప్పుడు ప్రవర్తన వుంటే అప్పుడు ఆ వైస్‌ చాన్సలర్‌పై చర్య తీసుకోవచ్చని ఈ వర్శిటీల చట్టాలు, నిబంధనలు పేర్కొంటున్నాయి. ఇటువంటి ఆరోపణలు, అభియోగాలపై హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాల్సి వుంటుంది. అందువల్ల, వైస్‌ ఛాన్సలర్లను డిస్మిస్‌ చేస్తామని గవర్నర్‌ బెదిరించడం అక్రమం, నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది.
        ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ వర్శిటీలో జరిగిన నిర్దిష్ట నియామకానికి సంబంధించినది. ఆ కేసులో ఉల్లంఘించిన పద్ధతులకు సంబంధించినది. ఈ తీర్పును ఇతర యూనివర్శిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకాలకు వర్తింప చేయాలన్న గవర్నర్‌ చర్యకు ఎలాంటి న్యాయ ప్రాతిపదిక లేదు. సెర్చ్‌ కమిటీలో యుజిసి నామినీ, యూనివర్శిటీ నామినీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ నామినీకి కూడా కొన్ని యూనివర్శిటీల్లోని నిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే వైఖరిని అనుసరించారు. సెలక్షన్‌ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ నామినీ వుండరాదన్న గవర్నర్‌ వైఖరి సహించరానిది.
     గవర్నర్‌ ఖాన్‌ చర్యల వెనుక గల అసలు ఉద్దేశ్యమేంటి? విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించడానికి తాను చర్యలు తీసుకుంటున్నానని ఆయన వాదిస్తున్నారు. పాలక పార్టీ నామినీలను వైస్‌ ఛాన్సలర్‌ కాకుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నానని చెబుతున్నారు.
       ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇదొక ముసుగు మాత్రమే. గవర్నర్‌ తన ఛాన్సలర్‌ పదవిని దుర్వినియోగం చేయడం కేరళ ఒక్కచోటే కాదు. పలు ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాల వ్యవహారాలకు సంబంధించి గవర్నర్లు జోక్యం చేసుకుంటూనే వున్నారు. వైస్‌ ఛాన్సలర్ల, కీలక సిబ్బంది నియామకంలో అడ్డంకులు సృష్టిస్తూనే వున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ పంజాబ్‌లో జరిగింది. ప్రముఖ కార్డియాలజిస్ట్‌ను బాబా ఫరీద్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ వైస్‌ ఛాన్సలర్‌గా నియమించడాన్ని గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ వ్యతిరేకించారు. ఆ తర్వాత, పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ నియామకం అక్రమమంటూ ఆయన్ని ఆ పదవి నుండి తొలగించాలని ముఖ్యమంత్రిని గవర్నర్‌ కోరారు.
       రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో గవర్నర్లు ఈ రీతిన నిరంకుశంగా జోక్యం చేసుకోవడాన్ని నిలువ రించేందుకుగానూ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రస్తుతమున్న చట్టాలకు సవరణలు చేయడాన్ని లేదా కొత్త చట్టాలను రూపొందించడాన్ని తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలు చేపట్టాయి. కేరళలో, ఈ ఏడాది సెప్టెంబరు 1వ తేదీన విశ్వవిద్యాలయాల చట్టాల (సవరణ) బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ సవరణతో, వైస్‌ ఛాన్సలర్‌ పదవులకు నామినీలను ఎంపిక చేసే సెలక్ట్‌ కమిటీ బలాన్ని ప్రస్తుతమున్న మూడు నుండి ఐదుకు పెంచారు. అయితే, గవర్నర్‌ ఈ బిల్లుకు ఆమోదాన్ని తెలియచేయలేదు. అలాగని ప్రశ్నలు లేదా అభ్యంతరాలతో బిల్లును వెనక్కి తిప్పి పంపలేదు.
         అడ్డంకులు సృష్టిస్తున్న తన పాత్ర గురించి విమర్శలను ఎదుర్కొనాల్సి రావడంతో, గవర్నర్‌ ఖాన్‌, తనను విమర్శించేందుకు సాహసించే ఏ మంత్రినైనా అవసరమైతే డిస్మిస్‌ చేయగలనంటూ బెదిరింపులకు దిగారు. ఆర్థిక మంత్రి కె.ఎన్‌. బాలగోపాల్‌ వ్యవహార శైలి తనకు నచ్చడం లేదంటూ ప్రకటించారు. ఆయనను మంత్రి పదవి నుండి తొలగించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. రాజ్యాంగం కింద తనకు సంక్రమించని అధికారాలను ఆయన ఉపయోగించుకోవడం మొదలెట్టారు.
        వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ల జోక్యాన్ని అడ్డుకోవడానికి గల ఏకైక పరిష్కార మార్గం విశ్వవిద్యాలయాల ఛాన్సలర్లుగా గవర్నర్లను చేయకుండా వుండడమే. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై యుపిఎ ప్రభుత్వం నియమించిన ఎం.ఎం.పూంఛీ కమిషన్‌ చేసిన సిఫార్సు ఇదే. గవర్నర్లను విశ్వవిద్యాలయాల ఛాన్సలర్లుగా నియమించే సాంప్రదాయానికి చెక్‌ పెట్టాలని కమిషన్‌ సిఫార్సు చేసింది.
        కేరళ లోని ఉన్నత విద్యా సంస్థల్లో గవర్నర్‌ జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం కీలకమైనది. దేశంలో ఉన్నత విద్యా రంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ డ్రైవ్‌లో భాగంగానే గవర్నర్‌ ఈ రీతిన వ్యవహరిస్తున్నారు. గవర్నర్‌ తీసుకునే ఏకపక్ష చర్యలపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడాల్సిందే. ఈ విషయమై నవంబరు 15న రాజ్‌భవన్‌కు ప్రజా ప్రదర్శన నిర్వహించాల్సిందిగా కేరళలోని ఎల్‌డిఎఫ్‌ పిలుపిచ్చింది. కేరళ ఉన్నత విద్యా వ్యవస్థలో గల లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న యత్నాలను బట్టబయలు చేసేందుకు ప్రచార కార్యక్రమం కూడా చేపట్టింది.

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)