
తెలుగునాట స్వాతంత్య్ర, కమ్యూనిస్టు ఉద్యమాలు మట్టిలో మాణిక్యాల వంటి ఎందరినో వెలుగులోకి తెచ్చాయి. అలాంటి మణిపూసలలో ఒకరు ఉద్దరాజు మాణిక్యాంబ. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని వన్నెచింతలపూడి గ్రామంలో నడింపల్లి బాపిరాజు, వెంకమ్మల చిన్న కుమార్తె మాణిక్యాంబ. సహజంగానే ఇంట్లో చిన్నవారిని గారాబంగా పెంచుతారు. ఆమెకు పదహారవ ఏట, పద్దెనిమిదేళ్ల ఉద్దరాజు రామం (తరువాత రాష్ట్ర కమ్యూనిస్టు నేతలలో ఒకరుగా మారారు. ఎంపీగా, ఆలిండియా కిసాన్ సభ అధ్యక్షుడిగా పనిచేశారు)తో వివాహం జరిగింది.
మహాత్మాగాంధీ పశ్చిమ గోదావరి జిల్లాలో సత్యాగ్రహ శిబిరాలను సందర్శించినపుడు ఆమె తన వంటి మీద ఉన్న 70 కాసుల బంగారు నగలను విరాళంగా ఇచ్చారు. మరోసారి పసిడిని ధరించను అని వాగ్దానం చేస్తేనే వాటిని స్వీకరిస్తానని గాంధీ అనటంతో ఆ మేరకు ప్రతినబూనిన ఆమె జీవితాంతం దానికి కట్టుబడి ఉన్నారు. తరువాత తల్లి ఇచ్చిన మరో 70 కాసుల బంగారు నగలను కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చివేశారు. అలాంటి ధనిక కుటుంబం నేపథ్యం ఉన్న ఆమె రామంగారితో కలసి విజయవాడలో ఒక చిన్న పూరింటిలో ఉన్నారంటే నమ్మకపోవచ్చుగానీ, అది నిజం. అంతేనా! కమ్యూనిస్టులపై నిర్బంధకాండకు ప్రభుత్వం పూనుకోవటంతో రామం అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. అప్పుడు పిల్లలతో కుటుంబ పోషణకు ఆమె కూడా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. పిల్లి సంసారం అని కొందరు అన్నపుడు కూడా వాటినామె పట్టించుకోలేదు. పోలీసులు ఆమె ఎక్కడ ఉన్నదీ తెలుసుకొని రామం జాడచెప్పాలని వేధించినా, మీ భర్తను కాల్చివేశామని చెప్పి భయపెట్టేందుకు చూసినా జంకని ధైర్యవంతురాలు ఆమె.
రామం దంపతులు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దూకినపుడు లాఠీ దెబ్బలు, నిర్బంధాలు, జైళ్లు తప్ప కనుచూపు మేరలో స్వతంత్ర భారతం వారికి కనిపించలేదు. తరువాత తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చిన ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో కమ్యూనిస్టులను వేధించారు, నిర్బంధ శిబిరాల్లోకి నెట్టారు. స్త్రీ పురుషులను బట్టలిప్పించి గాంధీ విగ్రహాల ముందు నిలబెట్టిన దుర్మార్గాలు ఒకవైపు. అజ్ఞాతవాసంలో ఉన్న వందలాది మందిని కాల్చిచంపిన స్థితి మరోవైపు. మాణిక్యాంబ వంటి వారు ఎందరో అలాంటి స్థితిలో భర్తలకు వెన్నుదన్నుగా నిలిచారు.
ఉన్నంతలోనే కమ్యూనిస్టు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినైనా ఒకే విధంగా చూసిన చైతన్యవంతురాలు మాణిక్యాంబ. చిన్నతనంలో నోములు, పూజలు, పునస్కారాలు, మంగళహారతుల గతం ఉన్న ఆమె...వివాహం తర్వాతి నుంచి మరణించే వరకు వాటి ఊసే లేకుండా గడిపారు. 2008 డిసెంబరు 24న 94వ ఏట ఆమె మరణించారు. వజ్రాలు, మాణిక్యాలకు మరణం ఉండదు. మాణిక్యాంబ జీవితమూ అంతే !
- గాదిరాజు శారద