Oct 01,2023 13:21

ఇప్పటి వరకూ ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి. కానీ గుర్తుండిపోయేవి కొన్ని మాత్రమే. అందులో ఎప్పుడు చూసినా మనసుకు హత్తుకునేవి మరికొన్ని. ఆ కోవకే చెందుతుంది 'సప్త సాగరాలు దాటి' చిత్రం. ప్రేమ అంటే రకరకాల అభిప్రాయాలున్న నేపథ్యంలో.. నీతి, నిజాయితీతో కూడిన ప్రేమను తెరపై చూపించారు దర్శకుడు హేమంత్‌. సంగీతంలో ఎన్ని స్వరాలు ఉంటాయో.. వాటిని భావోద్వేగంతో ప్రేమలో పలికించారు. హీరోహీరోయిన్లుగా రక్షిత్‌ శెట్టి, రుక్ష్మిణి వసంత్‌ కొత్తవారైనా.. వారి నటన సినిమాకే ప్రాణం పోసింది. మరి కథ ఎలా ఉందో చూద్దాం.

55

నటీనటులు : రక్షిత్‌ శెట్టి, రుక్మిణి వసంత్‌, పవిత్ర లోకేష్‌, అచ్యుత్‌ కుమార్‌,అవినాష్‌, గోపాల్‌ దేశ్‌ పాండే,
రమేష్‌ ఇందిర తదితరులు
ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి
సంగీతం : చరణ్‌రాజ్‌
దర్శకత్వం : హేమంత్‌ ఎం రావు
నిర్మాత : రక్షిత్‌ శెట్టి

'కాంతార' సినిమా తర్వాత కన్నడ నుంచి వచ్చే సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి, అంచనాలు కనిపిస్తున్నాయి. కన్నడ హీరో రక్షిత్‌శెట్టి ఈ సారి ఓ ప్రేమకథని ఎంచుకుని 'సప్త సాగరదాచే ఎల్లో' అనే కన్నడ సినిమా చేశారు. కవితాత్మకమైన ఈ సినిమా తెలుగులో 'సప్త సాగరాలు దాటి' పేరుతో విడుదలైంది.
           కథలోకి వెళితే.. మను (రక్షిత్‌ శెట్టి) కారు డ్రైవర్‌. శంకర్‌ గౌడ (అవినాష్‌) అనే వ్యాపారవేత్త దగ్గర పనిచేస్తుంటాడు. సింగర్‌ కమ్‌ స్టూడెంట్‌ ప్రియ (రుక్మిణి వసంత్‌) ను ప్రేమిస్తాడు. త్వరలో పెళ్లి చేసుకుని, సెటిల్‌ అవ్వాలనుకుంటారు. ఓ రోజు శంకర్‌గౌడ కొడుకు కారుతో గుద్ది, ఒకరిని చంపేస్తాడు. డబ్బు ఆశ, త్వరగా బెయిల్‌ ఇప్పిస్తానని చెప్పడంతో.. ఆ నేరాన్ని మను తనపై వేసుకుని, జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఓ తప్పుడు నిర్ణయం వల్ల జైలులో మను, బయట ప్రియ ఎలాంటి కష్టాలు అనుభవించారు? చివరకు ఏమైందనేదే 'సప్త సాగరాలు దాటి' అసలు కథ. ప్రేమకి, ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే దర్శకుడు ఈ కథలో సముద్రాన్ని ఎంచుకున్నాడు. సముద్రంలో ఎన్ని ఆటుపోట్లు, అలజడులు ఉంటాయో వీరి ప్రేమలో చూపించారు దర్శకుడు. సినిమా ప్రారంభంలో కారు డ్రైవర్‌గా మను, మధ్యతరగతి అమ్మాయి ప్రియ జీవితాలు ఎలా ఉంటాయో చూపించారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని, కలిసి ఉండేందుకు ఓ ఇల్లు కోసం వెతుకులాట వంటి సీన్స్‌తో మొదటిభాగం సరదాగా నడుస్తుంది. అయితే జీవితంలో సెటిల్‌ కావాలని కలలు కంటున్న మను.. డబ్బుకి ఆశపడి, చేయని నేరాన్ని తనపై వేసుకోవడం, జైలుకెళ్లడంతో ఒక్కసారిగా కథ మలుపు తిరుగుతుంది. అయితే తనని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని మాటిచ్చిన ఓనర్‌ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోవడంతో పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. ఆ తర్వాతే అసలు కథ నడుస్తుంది.
           ప్రేమంటే ఈ తరం వారు ఊహించినట్లుగా కాదని.. కష్టాల్లోనూ ఒకరికొకరు తోడు ఉండటమే అన్న అర్థం చెప్పారు. ఓ మంచి పుస్తకం చదువుతున్నట్లు, ఓ మంచి పాట వింటున్నంత హాయిగా ఉంది. ఇందులో జైలు, అందులో ఖైదీల జీవితం ఎలా ఉంటుందనేది చాలా హృద్యంగా ఆవిష్కరించారు. ద్వితీయార్ధంలో సంఘర్షణ పతాక స్థాయిలో ఉంటుంది. ఎక్కువ భాగం సన్నివేశాలు జైలు, కోర్టు నేపథ్యంలోనే సాగుతుంటాయి. అనుభూతితో కూడిన ఇలాంటి సినిమాను చివరకు పూర్తిచేయకుండా రెండోభాగం తీయబోతున్నట్లు ప్రకటించి ముగించారు. మను, ప్రియ పూర్తికథని చూడాలంటే సైడ్‌-బి పేరుతో విడుదలయ్యే రెండో భాగం సినిమా వరకూ ఎదురు చూడాల్సిందే.
            ఇక రక్షిత్‌ శెట్టి, రుక్మిణి వసంత్‌ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇద్దరూ ఈ సినిమాకి ఆయువుపట్టు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, చిలిపి సంఘటనలు అవన్నీ చాలా సహజంగా ఉంటాయి. రక్షిత్‌శెట్టి మంచి భావోద్వేగాలను పలికించాడు. అలాగే రుక్మిణి వసంత్‌ తన భావాలను ఎక్కువగా కళ్ళతో పలికించింది. పవిత్ర లోకేష్‌ తల్లిగా చేశారు. అలాగే మిగతానటులు అచ్యుత్‌, అవినాష్‌, శరత్‌, రమేష్‌ అందరూ ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. చరణ్‌రాజ్‌ సంగీతం ఈ సినిమాకి ఇంకో బలం.. ప్రతి సన్నివేశాన్ని తన సంగీతంతో ఇంకా బాగా ఫీల్‌ అయ్యేట్టు చేశారు. చివరగా, దర్శకుడు హేమంత్‌ అనుకున్న ఒక అందమైన ప్రేమకథను తెర మీద ఆవిష్కరించారు.