Jan 15,2023 11:10

గాయపడ్డ ఆకాశం ఏమీ కోరుకోదు
చంద్రుడు ఎందుకు వెన్నెల ఇవ్వట్లేదని అడగదు
వెతకదు మబ్బుల్లో నీళ్ళు ఏమైనాయని
ముసురుపట్టిన రాత్రుళ్ళని దాచుకొని
గంభీరంగా ప్రపంచాన్ని ప్రేమిస్తుంది
ఎప్పుడో శాంతి నక్షత్రాలు ఆకాశం నుండి తొంగిచూస్తాయి.

పై కవిత, సిరికోన సాహితీ అకాడమీ నిర్వహించిన డయాస్ఫోరా నవలల పోటీలో ఉత్తమ నవలగా పురస్కారమందుకున్న అంతర్హిత నవలలోనిది. కవయిత్రి, రచయిత్రి అయిన శ్రీసుధ మోదుగు మేధోపథం నుంచి జాలువారిన, అందరూ చదవదగిన రచన ఈ అంతర్హిత. ఊహకి రూపవాచకమివ్వడం, వాస్తవికతకి ఊహా ప్రపంచాన్నద్దడం, అధివాస్తవికతని పరిచయం చెయ్యడం, భిన్న కోణాల్ని ఒకచోట సరళీకృతం చెయ్యడం.. రచయిత్రి నైపుణ్యానికి అద్దం పడతాయి. కవి పని కవిది, కథకుని పని కథకునిది అంటారు కదా.. మరి కవయిత్రే కథకురాలు అయితే..? సంక్లిష్ట కథాంశాన్ని అతి సులువుగా నడిపించడం జరుగుతుందా? అంటే అవుననే చెబుతోంది ఈ రచన.
కేవలం 223 పేజీల్లో నాలుగు దేశాల్ని, బహుముఖాల్ని, అందు పట్టిపీడిస్తున్న జాఢ్యాల్నీ విశ్లేషిస్తూ కథ నడిపారు. అది కూడా ఉత్కంఠభరితంగా.. చదువరులని విస్మయపరుస్తూ.. సాగించారు. 1936 - 1996 మధ్యలో జరిగిన భిన్న జీవితాల ప్రస్థానమే ఈ కథ.
ఎవరి గురించి మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, ఎవరెవరు ఎప్పుడొస్తారు, ఎవరికి ఎవరు ఏమవుతారు, చివరికి ఎలా మిగులుతారు, అసలు వీళ్ళంతా.. ఇలా ఎలా అనుసంధానమయ్యారు? మొన్నీమధ్య పొనియన్‌ సెల్వన్‌ చూసి జరిగిన చర్చలా... ఈ అంతర్హిత నిండా ఎన్నో పాత్రలు, ఎన్నో సమస్యలు, మరెన్నో పరిష్కారాలు..
తన మూలాలను వెతుక్కుంటూ అమ్మమ్మ అయిన రోస్మాని గురించి తెలుసుకోవడానికి జమైకా నుంచి ఢిల్లీ యూనివర్శిటీకి చదువు పేరిట ఇండియాకు వచ్చిన అరియా చివరికి తెలుసుకున్న నిజానిజాలేమిటి అన్నది ఈ నవల ఇతివృత్తం. ఈ నవల్లోని మేఫేయిర్‌ లాంటి ప్రేమమయి అయిన నాన్నమ్మ అందరికీ ఉంటే బావుండనిపిస్తుంది. తను అరియాకు రాసిన ఉత్తరంలో రోస్మా ఉంది. మరి రోస్మాలో మిగిలి ఉంది? జార్జెట్‌ లాంటి హృదయ సంపన్నుడు ప్రేమతో రోస్మాని ఎలా కాపాడుకున్నాడు, ఏమేమి చేశాడు? అరియా, అమ్మమ్మ రోస్మా గురించి ఇండియాకి చేసిన ప్రయాణంలో తారసపడ్డ వ్యక్తులెవరు? తెలిసిన రహస్యాలేమిటి? నిజానికి ఈ ప్రయాణం ఒక్క రోస్మా గురించేనా? తనని, తన అమ్మని కూడా తెలుసుకోవటానికా? తన తండ్రిని గురించి వినడమా.. తాతెవరో తెలియడమా.. నేపాల్‌ నుంచి దేవి ఇండియాకి ఎందుకు వచ్చింది? లచ్చిమికి స్నేహితురాలెలా అయ్యింది? లచ్చిమి రోస్మాగా ఎలా మారింది.. దురాచారాలు, క్రూరత్వం ఉన్నచోట.. వాటిని అధిగమించే మానవత్వమూ మిగిలి ఉంటుంది. సామాజిక చైతన్యం ఉండవలసినచోట, దుర్వ్యవస్థ ఉంటే సిగ్గుచేటు. గడీలు ఊళ్ళనేలుతుంటే దొరల కామజ్వాలల్లో మసైన జోగినులు ఎందరో..! ఇలా బహుముఖ అంశాల ఇతివృత్తంగా ఈ నవల్లోని కథ చక్కగా చదివించేలా సాగుతుంది.
ఒకరి అభీష్టానికి వ్యతిరేకంగా మరొకరు నడుచుకోవడాన్ని, ఒకరు మరొకర్ని శాసించడాన్నీ, బలవంతపు పంజరాల్లో నెట్టడాన్నీ, వావివరసలు లేని వాంఛల్ని, స్త్రీని ఉమ్మడి ఆస్తిగా ప్రకటించడాన్నీ ఏమంటారు?. కుళ్ళిపోయిన వ్యవస్థ అనేగా.. ప్రశ్న నేరమైన చోట, తిరుగుబాటు మొదలవక ఏమవుతుందీ? సమన్యాయం ఉండనిచోట నిరసన జ్వాలలు చెలరేగక మరేమవుతారు..? ఎక్కడి అరియ, ఎక్కడిదాకా వెళ్ళింది. ఎవరెవరిని కలుసుకుంది. ఏమి తెలుసుకుంది. తన అమ్మమ్మ అమ్మ తన మూలాల్నా..? అందులో ఎదుర్కొన్న సవాళ్ళేమిటీ? నికార్సయిన పాత్రికేయ వృత్తిలో వ్యక్తులు నిజాలని ఎలా వెలికితీస్తారు. ప్రజాపక్షాన ఎలా నిలుస్తారు.
ుష్ట్రవ టశీత్‌ీష్ట్ర జూఱశ్రీశ్రీaతీ శీట సవఎశీషతీaషy ఱర ్‌ష్ట్రవ ఎవసఱa అంటారు కదా. అది నూటికి నూరుపాళ్ళు నిజమని వృత్తిపట్ల నిబద్ధత కనబరిచే భార్గవి నిరూపిస్తుంది. అరియకి అండగా నిలబడుతుంది. అసలు భార్గవి ఎవరు? డ్రగ్స్‌ వ్యాపారం, డ్రగ్స్‌కి బానిసలయిన యువత... జమైకాలో చార్లీ అయినా, ఇండియాలోని ఇంకెవరైనా ఒకటే!
నిజానికి 'అంతర్హిత' బహుముఖ ఇతివృత్తం. సంక్లిష్ట కథాంశాన్ని, అందు చిక్కుముడుల్నీ, ఎంతో మెలకువతో అతి సులువుగా, జవాబుదారీతనంతో అవసర సంభాషణలతో నడిపించారు రచయిత్రి. రచన పట్ల ఆసక్తి, భాష పట్ల అనురక్తి, సామాజిక చైతన్యం పట్ల అభిలాష.. ఇవన్నీ ఉన్నప్పుడే ఈ తరహా రచన సాధ్యం. ఇది ఒకసారి చదివేసి పక్కనపెట్టేసే పుస్తకం కాదు. చదివిన ప్రతిసారీ సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే కవిత్వం లాంటి కథన కౌశలం. అనేక వర్తమాన సామాజిక అంశాలను మేళవించిన సృజనాత్మక ప్రయత్నం. ఈ నవలలో సముద్రం ఉంటుంది. అందమైన ఉత్తరమంటి అంతరంగం ఉంటుంది. ప్రేమలుంటారు. సమస్యల్నుంచి పారిపోదామనుకున్న మనుషులుంటారు. కుదుటపడని మనసు నుంచి నిజంవైపు ప్రయాణించే మనుషులూ ఉంటారు. చదవదగ్గ నవల. మనసుకు సంతోషాన్నిచ్చే నవల. ఈ రచయిత్రి నుంచి ఇలాంటి మంచి రచనలు రావాలని ఆశిద్దాం.

- బండి అనూరాధ

'అంతర్హిత'
రచయిత : శ్రీసుధ మోదుగు
పేజీలు : 223
వెల : రూ. 220
ప్రతులకు : అనల్ప బుక్‌ కంపెనీ, సికింద్రాబాద్‌.
ఫోన్‌ నెం : 7093800303
Website: www.analpabooks.com
Amazon.com