Feb 03,2023 07:24

     పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, కార్పొరేట్ల కొమ్ముకాసింది. మాంద్యం ముప్పు పొంచి ఉందంటూ ఆర్థిక సర్వేనే హెచ్చరించిన వేళ ముంచుకొచ్చే అధిక ధరలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుంచించుకుపోవడం, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోవడం వంటి కీలకమైన సమస్యలకు పరిష్కారం చూపడంలో విఫలమైంది. బడ్జెట్‌ అంటేనే రాబోయే ఏడాది కాలం పాటు వివిధ రంగాల్లో అవసరాలను అంచనా వేసి ఆ మేరకు కేటాయింపులు చేస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే ప్రక్రియ. ఇంత కీలకమైన కసరత్తులో సామాన్యులను విస్మరించిన తరువాత ఇక చెప్పుకునేదేముంది? ప్రజా వ్యతిరేకమని తప్ప! దీనిని కప్పిపుచ్చడానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ఎన్నో విన్యాసాలు చేశారు. సప్తర్షుల మార్గమని, అమృతకాలమని, ప్రజల్ని కేంద్రంగా చేసుకున్నామని చెప్పారు. 'తిండి కలిగితే కండ గలదోరు..కండగలవాడేను మనిషోరు' అని మహాకవి గురజాడ చెప్పారు. ఆ స్ఫూర్తి బడ్జెట్‌లో మచ్చుకైనా కానరాదు.
        నలభైఐదు లక్షల కోట్ల రూపాయల పై చిలుకు బడ్జెట్‌లో అన్ని రంగాలకు కేటాయింపులు ఉండవా అంటే ఉంటాయి. అయితే ఆ కేటాయింపుల్లో సింహభాగం దక్కింది ఎవరికి? కోతలు పడిందెవరికి? ప్రయోజనాలు పొందేదెవ్వరు? నష్టపోయేదెవరన్నవి కీలక ప్రశ్నలు. మాంద్యం ప్రభావంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు అడుగంటుతున్నాయి. మన దేశంలోనూ దాని ప్రకంపనలు కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా పడుతుందన్నది ఆర్థిక సర్వే హెచ్చరిక. అటువంటి ప్రమాదమే ముంచుకొస్తే గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ఒత్తిడి పడుతుందన్నది కరోనా కష్టకాలంలో దేశం అనుభవం. దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉపాధి హామీ పథకానికి ఏకంగా 30 వేల కోట్ల రూపాయలు కోత పెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? పోనీ పట్టణ ప్రాంతాల్లో కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు బడ్జెట్‌లో ఏమైనా ప్రతిపాదించారా అంటే అదీ లేదు. పెట్టుబడి వ్యయం పెంచామంటూ మాటలు చెప్పడం తప్ప! పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే పెంచినదెంత? దానిలో నిరుద్యోగులకు, ఉపాధి కోల్పోయే వారికి దక్కేదెంత? వ్యవసాయం, ఎరువులు, ధాన్యం సేకరణ, చివరకు రేషన్‌ కార్డుల మీద తక్కువ ధరకు పేదలకిచ్చే బియ్యం, గోధుమలు తదితర తిండిగింజల మీద సబ్సిడీలోనూ వేల కోట్ల రూపాయలు దిగ్గోశారు. పోనీ, పెరిగే ధరలను అదుపు చేయనున్నారా అంటే బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. పైగా పెట్రోలియంపై ఇచ్చే అరకొర సబ్సిడీల్లోనూ కోత పెట్టారు. మైనార్టీల సంక్షేమానికి, వారి పిల్లల చదువుకు స్కాలర్‌షిప్‌లకు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు గత ఏడాదితో పోలిస్తే 38 శాతం కోత పెట్టి బడ్జెట్‌కు మతం రంగు పులిమిన ఘనతను మోడీ సర్కారు మూటగట్టుకుంది. ఇన్ని కోతలు పెట్టిన తరువాత దీనిని ప్రజాకేంద్ర బడ్జెట్‌గా అభివర్ణించారంటే అసలు వారి దృష్టిలో ప్రజలంటే ఎవరో ?
       ఇక రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల్లోనూ వివక్షే! బిజెపి ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు ఉదారంగా కేటాయింపులు జరపగా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు వరాల జల్లు కురిపించడాన్ని ఏమనాలి? సరళీకరణ విధానాల అమలులో భాగంగా రాష్ట్రాలు చేసే వ్యయంపై ఆంక్షలు, అప్పులు తెచ్చుకోవాలన్నా తప్పనిసరిగా మారిన షరతులు సరేసరే! ఇక మన రాష్ట్రంపై చూపిన సవతి తల్లి ప్రేమ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రత్యేక హోదా నుండి విశాఖ రైల్వే జోన్‌ వరకు ప్రజలు ఆశించేవేవీ బడ్జెట్‌లో లేవు. అయినా, రాష్ట్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌ బావుందని కొనియాడితే, అధికార పార్టీకే చెందిన ఎంపి నిరాశజనకమంటూ పెదవి విరిచారు. కళ్ల ముందు కనపడుతున్న అన్యాయంపై కూడా అధికార పార్టీకి ఇంత అయోమయం ఏమిటో? ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత రాష్ట్రానికి నిధులు కేటాయించని బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం మాని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. ఇటువంటి రాజకీయ విన్యాసాల వల్ల ప్రయోజనం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరానికి నిధులు వంటి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఐక్యంగా ఉద్యమించాలి. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను జనం నిరసించాలి.