
గ్రామీణ భారతావనికి బతుకుపై భరోసా ఇస్తూ కల్పతరువుగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా దాడులకు దిగుతోంది. ఉపాధి హామీ పథకంలో చేరిన ప్రతి కార్మికుడికి ఏడాదికి 100 రోజుల పని దినాలును గ్యారెంటీ చేయగా.. మోడీ సర్కార్ ఏలుబడిలో ఏడాదికి పని దినాలు సగటున 47కు మించడం లేదు. ఆధార్ అనుసంధానం, ఫేసియల్ రికగ్నైజేషన్ యాప్ ఆధారిత హాజరు వంటి డిజిటల్ అడ్డంకులు, వేతనాల చెల్లింపునకు సామాజిక తరగతిని ముడిపెట్టడం వంటి ఆంక్షలు గ్రామీణ పేదలకు 'ఉపాధి'ని దూరం చేస్తాయి. ప్రతియేటా వేసవిలో ఉపాధి వేతనానికి అదనంగా చెల్లించే బోనస్ సొమ్మును కేంద్రం ఈ ఏడాది రద్దు చేయడం ముమ్మాటికీ ఆక్షేపణీయం. వేసవి వేళ ఉపాధి పని ప్రదేశాల్లో షామియానాలు వేయడం, తాగునీరు, మజ్జిగ అందించడం వంటి కనీస సదుపాయాలు కల్పించడం మానేసి ..రెండు పూటలా పని చేయాలన్న నిబంధన పెట్టడం, ఫేసియల్ యాప్ ఆధారిత హాజరు తప్పనిసరి చేయడం, యాంత్రీకరణ వంటి దుర్మార్గమైన షరతులు పెట్టడం గ్రామీణ పేదలంటే బిజెపికి ఎంత ఖాతరులేని తనమో అర్థమవుతుంది.
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 'ఉపాధి' గొంతు నులిమేందుకు ఏదో రకంగా ప్రయత్నిస్తూనే వుంది. బడ్జెట్‌లో కేటాయింపులకు యేటికేడూ తెగ్గోస్తూ వస్తోంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే పేరుతో నివారించే పేరిట నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ (ఎన్‌ఎంఎంఎస్) అనే కొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చి ఉపాధి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఉపాధ్యాయలు వంటి వారే మొబైల్ యాప్ ఆధారిత హాజరుతో లబోదిబో అంటుంటే గ్రామీణ పేదలు ఇంకెన్ని ఇక్కట్లు పడాల్సివస్తోందో వేరే చెప్పక్కర్లేదు. ఇంటర్‌నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం కూడా యాప్ ఆధారిత హాజరు నమోదు పెద్ద ప్రహసనంగా మారుతోంది. హాజరు పడకపోతే, ఆ రోజు వరకు ప్రభుత్వానికి ఉచిత సేవ చేసినట్లే. వేతనం పడదు. ఇచ్చే అరకొర వేతనాలకు కూడా అనేక చిక్కు ముడులు వేసి..కక్ష సాధించడం గ్రామీణ పేదల పొట్ట కొట్టడం కాదా? ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ ఇలాంటి డిజిటల్ అడ్డంకులు విధించడం వల్లే కోట్లాది మంది ప్రజలు తిండి గింజలకు కూడా నోచుకోవడం లేదు. పేదలకు వెచ్చించే ఖర్చును తగ్గించుకునే నయా ఉదారవాద కుయుక్తుల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇన్ని వంచనలకు పాల్పడుతోంది.
కేంద్రం విధించిన ఈ ఆంక్షలను, ఆటంకాలను అధిగమించి చెమటోడ్చి పని చేసిన ఉపాధి కార్మికులకు వేతనాలను ఇవ్వడంలోనూ ప్రభుత్వం పితలాటకమాడుతోంది. ఉపాధి చట్టం అనుమతించిన వెసులుబాటు రోజులకు మించి వేతనాలను కేంద్రం తన వద్దే ఉంచుకుంటోంది. ఇప్పటికీ రూ.1000 కోట్లకు పైగానే కార్మికులకు వేతనాలు బకాయి పడింది. ప్రస్తుత వేసవిలో కొలుతల ప్రామాణికాల ఆధారిత పని స్థానంలో రెండు పూటలా పని చేయాలనే నిబంధన తీసుకురావడంతో ఉపాధి కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలోనూ అనేక చోట్ల ఉపాధి కార్మికులు వడదెబ్బకు గురై చనిపోతున్నారు. కాలువల పూడిక తీత, చెరువుల నిర్మాణం వంటి అనేక జాతి సంపద నిర్మాణ పనుల్లో చెమటోడ్చి ఎండ వేడిమి తాళలేక బలైపోతున్న ఉపాధి కార్మికులను పరిహారం అందించేందుకు పాలకులు మీనమేషాలు లెక్కిస్తుండటం అమానవీయం.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు రూ.880 కోట్లు రావాల్సివుందని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అధికారులు విన్నవించారు. ఏపిలో రూ.8,800 కోట్ల ఖర్చుతో 1,500 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సెలవిచ్చారు. నిధుల కొరతతో ఉపాధి ఉసురు తీయకుండా కేంద్రం మెడలు వంచి నిధులు రాబట్టుకునే చర్యలకు ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం పూనుకోవాలి. ఇందుకోసం అన్ని భాగస్వామ్య పక్షాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు నడుంబిగించాలి. రాష్ట్రంలో ఉపాధి కార్మికులందరికీ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి. యాప్ ఆధారిత హాజరు మినహాయించి ఇతర డిజిటల్ అవరోధాలను తొలగించాలి. యాంత్రీకరణ తగ్గించి కార్మికులకు పని దినాలు పెంచాలి. పని ప్రదేశాల్లో నీడ ఏర్పాటు, తాగునీరు, మజ్జిగ వంటి కనీస సదుపాయాలు కల్పించాలి. సమ్మర్ అలవెన్స్ పునరుద్దరించాలి. వడదెబ్బకు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలి.