Aug 20,2023 06:45

జాతీయంగా, అంతర్జాతీయంగా దుర్మార్గ రాజకీయాలనూ దుష్ట తంత్రాలను నిక్కచ్చిగా ఎదుర్కొనే వారిపై పాలకుల దాడి కొత్త కాదు. వైర్‌, న్యూస్‌క్లిక్‌ వంటివి అందుకు పదునైన ఆయుధాలుగా వున్నాయి గనకే ఈ దాడి సాగదీస్తున్నారు. తీస్తా సెతల్వాద్‌నూ అలాగే వేటాడటం చూస్తున్నాం. ఆమెతో పాటు గౌతమ్‌ నౌలఖా వంటివారి వివిధ సేవలకు ఈ ఖాతాల నుంచి మొత్తాలు జమపడితే అందులో ఏదో అక్రమం జరిగినట్టు చూపేందుకు అవస్థలు పడుతున్నారు. దేశ సంపదనూ విశాఖ ఉక్కు వంటి మహాసంస్థలనే అదానీలకు అప్పగిస్తూ వారిపై ప్రపంచ స్థాయిలో వచ్చిన తీవ్రారోపణలను, కుంభకోణాలను కప్పిపుచ్చుతున్న మోడీ సర్కారు... ప్రజల కోసం పోరాడే ప్రజాస్వామిక వాదులపైన సంస్థలపైన అభాండాలు వేస్తూ అణచివేయాలనుకోవడం హాస్యాస్పదం.

            మీడియాలో, సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు, విమర్శలు చేసేవారిపై నరేంద్రమోడీ ప్రభుత్వ దాడులు, నిర్బంధాలు కొత్త కాదు గాని ఇటీవలి కాలంలో అందుకోసం అనుసరిస్తున్న పద్ధతులే మరీ ఘోరంగా తయారైనాయి. దేశభక్తి తమ స్వంతమైనట్టు మిగిలినవారంతా దేశ ద్రోహులైనట్టు చిత్రిస్తూ అబద్ధాలు ప్రచారం చేయడం ఒక వ్యూహంగా మారింది. ఇటీవలి రోజులలో న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌పై దారుణ దుష్ప్రచారం అందులో తాజా అధ్యాయం. ఈ దాడిలో అంతర్జాతీయ మీడియా కూడా భాగస్వామి కావడం చూస్తే కుట్రలు ఎంత పకడ్బందీగా నడుస్తాయో అర్థమవుతుంది. ఈ మాయాజాలం లోకి నెమ్మదిగా సిపిఎం నేతలనూ, తర్వాత కాంగ్రెస్‌నూ కూడా కలుపుతూ కేంద్ర మంత్రులే రభస చేయడం, మీడియా దానికి విపరీత ప్రచారం ఇవ్వడం, రాజ్యసభలో హక్కుల నోటీసు ఇచ్చాక చప్పున సర్దుకోవడం గమనించవచ్చు. అయినా వివిధ మీడియాలలో సంఘపరివార్‌కూ సామ్రాజ్యవాదానికి అనుకూలమైన వేదికలలో వాటిని అటూ ఇటూ తిప్పి తిప్పి చూపెడుతూ కొత్త విషయంలా ప్రచారం నడిపిస్తున్నారు. అందుకు దీనిపై నిజానిజాలు చెప్పుకోవలసిన అవసరమేర్పడుతున్నది. ఇంతా చేస్తే వడ్లగింజల్లో బియ్యం గింజలా అందులో వున్నది అచ్చంగా అదే కథ. ఎన్నిసార్లు రాసినా ఎంత చెప్పినా అదే రొద. 2021లో ఇదే న్యూస్‌క్లిక్‌ ఆఫీసుపై దాడి చేసి దిగ్బంధనంతో సిబ్బందిని నిర్బంధం చేసి ఏదో కనిపెట్టినట్టు కథలు వదిలారు. అయితే తర్వాత ఢిల్లీ హైకోర్టు వాటిని నిలిపేసింది. మళ్లీ ఇప్పుడు దేశమంతా మణిపూర్‌ విషయమై ఆందోళన చెందుతున్నప్పుడు ఈ కథ పున:ప్రారంభమైంది. అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ఏదో కథనం ప్రచురించడం ఇందుకు ఆధారమైంది. పోనీ ఆ కథలో అక్రమాలు లేదా చట్ట విరుద్ధమైన దేశ వ్యతిరేకమైన ఆరోపణల ఉదాహరణలు ఏమైనా పేర్కొన్నారా అంటే అదీ లేదు. న్యూస్‌క్లిక్‌ యజమాని, ప్రధాన సంపాదకుడూ అయిన ప్రజావైజ్ఞానిక మేధావి ప్రబీర్‌ పురకాయస్థకు అమెరికాలో సంపన్నుడైన నవెల్లి రారు సింగంకు మధ్య సంబంధాలున్నాయనే ఆరోపణపైనే ఆ కథనం నడిచింది. వారిద్దరూ మాట్లాడుకున్న వాట్సప్‌ చాట్లు ఉదహరించబడ్డాయి. అదే సింగంతో పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకుడైన ప్రకాశ్‌ కరత్‌ సందేశాలుండటం అపరాద óమైనట్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం సాగింది. దీన్ని న్యూస్‌క్లిక్‌, ప్రబీర్‌, ప్రకాశ్‌ కరత్‌, సిపిఎం కూడా ఖండించినా పార్లమెంటులో కూడా ఇదే కథ ఆధారంగా ఆరోపణలు చేసి నాలుక కర్చుకున్నారు. ప్రజానుకూల ప్రత్యామ్నాయ కథనాల తో పరిశోధనాత్మక సమాచారంతో న్యూస్‌క్లిక్‌ సుపరిచితం.
 

                                                                           అంతా చట్టబద్దమే

ఇంతకూ న్యూయార్క్‌ టైమ్స్‌ రాసిందేమిటి? నో కోల్డ్‌వార్‌ (ప్రచ్ఛన్న యుద్ధం వద్దు) గ్రూప్‌ లండన్‌లో చేసిన ప్రదర్శనతో ఈ కథనం మొదలవుతుంది. అమెరికా పౌరుడైన నవెల్లి రారు సింగం మానవ హక్కుల ఉద్యమాలకు, వామపక్ష పోరాటాలకు సహాయం చేస్తుంటాడని పేర్కొంది. ఈయన తండ్రి కూడా ప్రొఫెసర్‌గా వుంటూ ప్రజాస్వామిక వాదులకు సహాయం చేసేవాడు. ఈయన భార్య ఇవెన్‌ కోడ్‌పింక్‌ పేరిట సామాజిక శక్తులకు సహాయపడుతుంటారు. ఆఫ్రికాలోనూ బ్రెజిల్‌, ఇండియాలలోనూ ఉద్యమాలకూ వార్తాసంస్థలకు ఈయన తోడ్పడుతుంటారని టైమ్స్‌ రాసింది. ఈ విరాళాలు ఇవ్వడం అమెరికా చట్టాల ప్రకారం తప్పు కాదని కూడా ఆ కథనంలోనే వుంది. సింగం షాంఘైలో కార్యాలయం కలిగివున్నారని, ఆ భవనంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగం కూడా వుందని తెల్పింది. చైనాలోనూ విదేశాలలోనూ ఆయన మీడియా వ్యాపారంలో వున్నాడని చెబుతూనే ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పినట్టు నడుస్తున్నట్టు ఆరోపించింది. అందుకోసం ఎలాంటి నిర్దిష్టమైన ఆధారాలు చూపిందా అంటే లేదు. ఆయన మరో ఇద్దరు చైనా యూనివర్సిటీతో కలసి వీడియోలు చేస్తుంటారని, వాటికి పెట్టుబడిలో కొంత భాగం చైనా పార్టీ సమకూరుస్తుందని మాత్రమే రాశారు. అంటే అది కూడా పూర్తిగా కాదు. ఈ సందర్భంగా జరిగిన ఒక వర్క్‌షాప్‌లో సింగం పాల్గొనడం కూడా తప్పు లాగా చూపింది. ఎన్నెన్నో పనులు ఔట్‌సోర్సింగ్‌కు, కాంట్రాక్టులకు ఇచ్చే ఈ కాలంలో ఒక యూనివర్సిటీ ఓ విదేశీ మీడియా సంస్థకు వీడియోల తయారీ ఇస్తే అది రాజకీయ సంబంధమై పోతుందా? కొంత పెట్టుబడి చైనా పార్టీ సమకూర్చిందని తాడూ బొంగరం లేని రాత రాస్తే విలువెంత? ఇక వారు చూపించే సందేశాలు కూడా వార్తా ప్రసారాలకు సంబంధించినవే. చైనాలో కరోనాను ఎదుర్కొన్న తీరు గురించి మూడు పరిశోధనాత్మక కథనాలు రాసే విషయమై ప్రబీర్‌ పురకాయస్థ, ప్రకాశ్‌ కరత్‌లతో సింగం సమాచారం పంచుకోవడమే పెద్ద ఆధారంగా ఆ పత్రిక కథనం ప్రచారంలో పెట్టింది. అవైనా ఎంత నిజమనేది చూడవలసిన విషయమే.
 

                                                                         పరస్పర ఆధార ప్రహసనం

ఇంతకూ ఇక్కడో ట్విస్టు వుంది. న్యూయార్క్‌ టైమ్స్‌ రాసిన కథనాన్ని మన దేశంలో బడా మీడియా వాడుకుంటే ఆ పత్రిక మాత్రం మోడీ ప్రభుత్వం న్యూస్‌క్లిక్‌పై జరిపిన దాడిని, సోదాలను ఆధారాలుగా ప్రస్తావించింది. వాస్తవంగా రాసిన భాష ఇది...''భారతీయ అధికారులు పత్రికలపై దాడిలో భాగంగా సింగంతో ముడిపడిన ఒక వార్తాసంస్థపై దాడి చేశారు. దానికి చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయని ఆరోపించారు గాని ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేక పోయారు''. తాను మొదటిసారిగా ఈ కార్యకలాపాలకు చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలకు ఆధారాలు సంపాదించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ చెప్పుకుంది. అయితే అవన్నీ తాడూ బొంగరం లేనివే. ఫాసిస్టు వ్యతిరేక, శాంతి, మానవ హక్కులు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తాను సాయం చేస్తానని సింగం బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అది కూడా అమెరికా చట్టం నిబంధనలకు లోబడి మాత్రమే. ఆ వివరాలు అందుబాటులోనే వున్నాయి. ఉదాహరణకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సోషలిజానికి మద్దతుగా వీడియోలు, పుస్తకాలు ప్రచురించే ట్రైకాంటినెంటల్‌ బాధ్యుడైన విజయప్రసాద్‌ భారీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ గల ఒక దాత సహకరిస్తుంటారని ట్విటర్‌లోనే పేర్కొన్నారు. కనుక ఇందులో రహస్యం గానీ, పరిశోధించి తేల్చింది గానీ ఏమీ లేదు. ఒక కార్పొరేట్‌ సంస్థగా సింగం నెట్‌వర్క్‌ న్యూస్‌క్లిక్‌కు తోడ్పాటు నివ్వడం కూడా చట్టబద్దమే. తమకు ఏ దేశ ప్రభుత్వంతో గానీ, పార్టీతో గాని సంబంధం లేదని ఎవరి నిధులు తీసుకోవడం జరగలేదని అటు సింగం, ఇటు న్యూస్‌ క్లిక్‌ సంపాదకుడు ప్రబీర్‌ అధికారులకు స్పష్టంగా చెప్పేశారు. మా అభిప్రాయాలు పంచుకునే వారికి సహాయం చేసినా ఎక్కడా నేను వాటిని అదుపు చేయడం లేదని సింగం స్పష్టం చేశారు. 'నా వయసు, నాకున్న అవకాశాల దృష్ట్యా విస్త్రుతంగా సహాయపడాలని నిర్ణయించుకున్నాను' అని ప్రకటించారు. అందులో భాగంగానే తన కంపెనీ థాట్‌వర్క్స్‌ను కూడా అమ్మేశారు. ఆ పత్రాలు, లెక్కలు అన్నీ అందుబాటులోనే వున్నాయి. ఇక్కడ మీడియా వారు చేసిందల్లా అవేవో రహస్య విషయాలుగా చూపడమే. న్యూయార్క్‌ టైమ్స్‌ దృష్టిలో శాంతి, సోషలిజాల కోసం పని చేయడం సహకరించడం మహాపరాధం. ఉదాహరణకు చైనా కమ్యూనిస్టు పార్టీ శ్రామిక వర్గ విప్లవం ఇప్పటికీ ప్రపంచాన్ని ఉత్తేజపరుస్తూనే వుందని న్యూస్‌క్లిక్‌లో రాయడం కూడా చైనా అనుకూలత అట. మన దేశంలోనే గాక ప్రపంచ వ్యాపితంగా రష్యా, చైనా, వియత్నాం విప్లవాలను అభినందించడం మనకు తెలుసు. అలాగే కరోనాకు తొలుత గురైన దేశంగా చైనా ఎలా ఎదుర్కొన్నదనే విషయం చాలా పత్రికలు రాశాయి. చైనా నుంచే కరోనా వైరస్‌ వచ్చిందనే కట్టుకథలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సాధికారికంగా ధృవీకరించలేదు (ఆ మాటకొస్తే ఢిల్లీలోని తబ్లీగే జమాయిత్‌లో ముస్లింలు కావాలని దీన్ని పెంచారని సాగిన కవ్వింపు ప్రచారాలను తర్వాత కాలంలో సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది.).
 

                                                                             అబద్ధాలు అభాసుపాలు

అమెరికా మార్క్‌ కమ్యూనిస్టు వ్యతిరేకతతో వండి వార్చిన ఈ కథనమే పెద్ద సాకుగా తలపోశారు బిజెపి పాలకులు. అంతేగాని ఇక్కడ వారు పరిశోధనాత్మక జర్నలిజంతో కనిపెట్టింది శూన్యం. దుష్ప్రచారమే కనిపెట్టారు. బిజెపి ఎం.పి నిశికాంత్‌ దూబే, మంత్రులు అనురాగ్‌ ఠాగూర్‌, పీయుష్‌ గోయల్‌లు పార్లమెంటులోనూ బయిటా కూడా తలా తోక లేని ఈ కథనం బట్టుకుని సిపిఎం పైన, కాంగ్రెస్‌ పైన విషం కక్కారు (ఒకప్పుడు తమ హయాంలో సిపిఎం ఏర్పడుతున్న దశలోనే చైనా అనుకూల ముద్ర వేసి వేల మందిని అరెస్టులు చేసిన కాంగ్రెస్‌కు కూడా అదే అనుభవంలోకి వచ్చి వుండాలి). ఈ దేశద్రోహ ప్రచారంపై పార్లమెంటులో తీవ్ర నిరసనతో పాటు సభా హక్కుల నోటీసు కూడా ఇచ్చాక పీయుష్‌ గోయల్‌ వంటివారు తోకముడిచారు. ప్రకాశ్‌ కరత్‌పై అభాండాలను సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. సభలో సభ్యుడు కాని వారిపై ఆరోపణలు చేయరాదనే ప్రాథమిక మర్యాదను, సంప్రదాయాన్ని కూడా బిజెపి మంట కలిపిందని పేర్కొంది. తన హిందూత్వ మతోన్మాద రాజకీయాలపై వామపక్షాలు గట్టిగా పోరాడుతున్నాయి గనకే ఈ విధమైన అసత్య ప్రచారాలకు దిగినట్టు స్పష్టం చేసింది. న్యూస్‌క్లిక్‌ తరపున ప్రబీర్‌ పురకాయస్త కూడా సూటిగా సమాధానమిచ్చారు. కొందరు రాజకీయ పాత్రధారులు, కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి వాస్తవాలు, చట్టబద్దత లేకుండా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. తమ మలి విడత దుష్ప్రచారం తేలిపోవడంతో ఇప్పుడు మరోసారి ఇ.డి ని రంగంలోకి దించి ప్రబీర్‌ ఇంటిని స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వదులుతున్నారు. వాటిపై ఆ సంస్థ పోరాటం సాగిస్తున్నది కూడా. ఇందుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశించినట్టు కూడా అదేపనిగా వార్తలు ఇస్తున్నారు. రాష్ట్ర పరిధిలో అవసరమైన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వారు ఎన్నడూ నిరాకరించింది లేదు. ఆ అవసరం అంతకన్నా వుండదు. ఎటొచ్చి జాతీయంగా, అంతర్జాతీయంగా దుర్మార్గ రాజకీయాలనూ దుష్ట తంత్రాలను నిక్కచ్చిగా ఎదుర్కొనే వారిపై పాలకుల దాడి కొత్త కాదు. వైర్‌, న్యూస్‌క్లిక్‌ వంటివి అందుకు పదునైన ఆయుధాలుగా వున్నాయి గనకే ఈ దాడి సాగదీస్తున్నారు. తీస్తా సెతల్వాద్‌నూ అలాగే వేటాడటం చూస్తున్నాం. ఆమెతో పాటు గౌతమ్‌ నౌలఖా వంటివారి వివిధ సేవలకు ఈ ఖాతాల నుంచి మొత్తాలు జమపడితే అందులో ఏదో అక్రమం జరిగినట్టు చూపేందుకు అవస్థలు పడుతున్నారు. దేశ సంపదనూ విశాఖ ఉక్కు వంటి మహాసంస్థలనే అదానీలకు అప్పగిస్తూ వారిపై ప్రపంచ స్థాయిలో వచ్చిన తీవ్రారోపణలను, కుంభకోణాలను కప్పిపుచ్చుతున్న మోడీ సర్కారు...ప్రజల కోసం పోరాడే ప్రజాస్వామిక వాదులపైన, సంస్థలపైన అభాండాలు వేస్తూ అణచివేయాలనుకోవడం హాస్యాస్పదం. పలు మీడియా సంస్థలూ మేధావులు న్యూస్‌క్లిక్‌పై దాడిని ఖండిస్తూ ముందుకు రావడం హర్షణీయం.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి