తూరుపున తెలతెలవారకనే
ఊరిముందర చేదబావి దగ్గర చేరిన
ఆడోళ్ళు ఆకాశంలోని హరివిల్లులా
పూదోటలోని సీతాకోకచిలుకల్లా
చూపరులకు ఎంత కమనీయమో !
చేంతాడుతో
నీళ్ళు చేదుతుంటే
చేతిలోని గాజుల గలగలలు
గిరగిరా తిరుగుతున్న
రాట్నం సవ్వడులు
కడవల్లోకి పారుతున్న
సెలయేరులాంటి శబ్దాలు
శ్రావ్యమైన సంగీతంలా
శ్రోతలకు ఎంతటి మధురమో !
ఆనందాలను పంచుకుంటూ
పూచే చిరునవ్వుల పూలు
కష్టాలను చెప్పుకుంటూ
కార్చుకొనే కన్నీళ్ళు
ఆత్మీయుల స్పర్శ నుండి
పొందే ఓదార్పులు
బహుదూరపు బాటసారులకూ
దాహం తీర్చిన ఆత్మబంధువు
ఊరందరీ అవసరాలు తీర్చిన
''చేదబావి''
అమృత సింధువు ఆనాడు
ఆకులురాలిన మోడులా ఈనాడు
ఇక చూడలేరేమో భావితరము ఏనాడు!
సురేంద్ర రొడ్డ
94915 23570