
'శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ'
హేమలత మూడేండ్ల మనవడు తరుణ్‌తో పద్యాన్ని వల్లె వేయిస్తూ వాడి ముద్దు మాటలకు మురిసిపోతోంది.
ఐదేండ్ల మనవరాలు తపస్వి తాతగారు మహేష్‌తో కలిసి వాకింగ్‌కు వెళ్ళింది. కొడుకు వరుణ్‌కు ట్రాన్స్ఫర్ అవడం వల్ల రెండు రోజుల్లో భార్యాబిడ్డలతో కలకత్తాకు వెళ్తున్నాడు. కోడలు వసంత సూట్‌కేస్‌లు సర్దుకుంటూ ఉంది.
వరుణ్ ఆఫీస్ పని చేసుకుంటూ ఉన్నాడు. పిల్లలు దూరంగా వెళ్తున్నారని దిగులుగా వుంటోంది. అయినా కొడుకు ఉద్యోగ రీత్యా తప్పదనుకుంది. అవకాశం ఉన్నప్పుడల్లా రోజూ ఫోన్ మాట్లాడవచ్చు, వీడియోలో చూడవచ్చులే అని మనసుకు సర్ది చెప్పుకున్నారు. చిన్నపిల్లలను వదిలి వుండటం అనే మాట తలచుకుంటూ వుంటేనే నిస్సత్తువగా అనిపిస్తోంది తల్లిదండ్రులకు. ఎందుకంటే వరుణ్ ఒక్కడే కొడుకు వాళ్లకు.
ఇన్ని రోజులూ చదువులూ ఉద్యోగాలయినా వరుణ్ వీకెండ్స్ మాత్రం తప్పకుండా ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఒకవేళ ఫ్యామిలీ చెన్నరు, బెంగళూర్ అయినా రెండువారాలకో, కనీసం నెలకో ఒక్కసారైనా వచ్చిపోతుండేవాళ్ళు.
ఇప్పుడు కలకత్తా అనేసరికి హేమలత దంపతుల గుండెల్లో రాయి పడ్డట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే కలకత్తా దూరంగా ఉండటం వల్ల. అంతదూరం కాబట్టే కనీసం ఆరు నెలలకుగానీ రాలేరు. అందుకే పెద్దవాళ్ళు దిగులుపడుతున్నారు.
కొడుకు, కోడలు హేమలత దంపతులను కూడా తమతో తీసుకెళ్తాం, రమ్మన్నారు. అయితే వీరికి మాత్రం సొంతూరుని వదిలి ఉండలేక, పైగా దగ్గరగా వుండే బంధువులు, బాడుగలకు ఇచ్చిన అపార్ట్మెంట్లు, బట్టల షాప్‌లో కొంత షేర్ వుంది. ఆ బిజినెస్ చూసుకోవడం వున్నాయి. కనుక తరువాత ఎప్పుడైనా చూడటానికి వస్తామని చెప్పారు.
వారం నుంచీ వాళ్ళకు కావలసిన తినుబండారాలను సిద్ధం చేస్తున్నారు పెద్దవాళ్లు. కొడుకూ కొడలేమో.. వాళ్లకు కావలసిన చిన్న చిన్న వస్తువులను కొనుక్కొచ్చుకునేందుకు షాంపింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఫ్రెండ్స్ సహాయంతో అక్కడ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నారు.
అన్నీ సర్దుకుని లగేజ్ బుక్ చేసుకొని, వీళ్ళు ట్రైన్‌లో వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత వరుసగా రెండు రోజులు ఫోన్ చేసి, వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ తరువాత పిల్లలను స్కూల్స్‌లో చేర్పించేందుకు వెళ్ళడం.. కొత్త ప్రాంతంలో ఉద్యోగం.. ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకోవడం వగైరా పనులవల్ల ఎక్కువ ఫోన్ చెయ్యలేక ఆదివారం మాత్రమే చేసే వాళ్ళు.
వాళ్ళు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా అని వీళ్ళు ఫోన్‌లను ఎదురుగా పెట్టుకొని, చూసుకుంటూ వుండేవాళ్ళు.
పిల్లలు ఫోన్ చెయ్యగానే చాటంత మొహాలు చేసుకుని, ఆనందంతో వాళ్ళతో మాట్లాడేవాళ్ళు.
ఫోన్ మాట్లాడటం అవ్వగానే నీరసించిపోయేవాళ్లు.. ఇంక మళ్ళీ ఎప్పుడు చేస్తారో అనుకుంటూ ఎదురుచూస్తూ కాలం గడిపేవాళ్ళు. పిల్లల ముద్దు మాటలు వింటూ, ఆ విన్నవన్నీ స్నేహితులతో చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు.
పని ఒత్తిడితోనో.. మరో కారణంతోనో ఒక్కోసారి వాళ్ళు వారానికి కూడా ఫోన్ చేయకుంటే, వాళ్ళు ఫోన్ చేయకపోతే మనమే చేద్దాము అనుకొని మొదట్లో మాట్లాడాలని అనిపించినప్పుడు వీళ్లే చేసేవారు కొన్ని సార్లు.
కానీ అలా చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు.
'పిల్లలను పార్క్‌కు తీసుకెళ్లాలి. ఆఫీస్ మీటింగ్ వుంది. ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు మళ్ళీ చేస్తాం' ఇలా మాట్లాడేవాడు కొడుకు.
వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు ఫోను చేసి, ఇబ్బంది పెడ్తున్నట్లుగా అనుకుంటున్నారేమో అనిపించేది. ఆ టైంలో వీడియో కాల్ చేస్తే వాళ్ళ మొహాల్లో కొంచెం విసుగు కూడా కనిపించినట్లుగా అనిపించింది వీళ్ళకు.
ఒక్కోసారి వాళ్ళే 'మళ్ళీ చేస్తాం' అని పెట్టేసే వాళ్ళు. దాంతో ఇక వీళ్ళు ఫోన్ చెయ్యలేక వాళ్ళు ఫోన్ చేసినప్పుడే మాట్లాడటం మంచిదనుకున్నారు. వాళ్ళు ఆదివారాలు కూడా ఎక్కడైనా వేరే ప్రదేశాలు చూడటానికి వెళ్ళడం వల్ల చెయ్యలేదని చెప్పేవాళ్ళు. రెండువారాల కొకసారి మాత్రమే ఫోను చేసి, కొడుకు రెండు నిముషాలు మాట్లాడి పెట్టేసేవాడు.
ఇక వాళ్ళు చేసేదేమీ లేక, బిక్కమొహం వేసుకునేవారు. ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలు రోజూ ఫోన్ చేస్తున్నారా అని అడిగితే 'ఆ..ఆ.. రోజూ చేస్తున్నారు' అని చెప్పేవాళ్ళు.
ఫోన్ చెయ్యడం లేదేమని అడిగితే బాధ పడతారేమోనని భావించి, వీళ్ళు కూడా అడగలేకపోయే వాళ్ళు. అలా కొద్దిరోజులు గడిచిన తరువాత ఉండబట్టలేక ఒకరోజు హేమలత 'వరుణ్, రెండ్రోజులకు ఒకసారైనా ఫోన్ చెయ్యొచ్చు కదా!.. మాట్లాడాలని అనిపిస్తుందిరా..' అని అడిగింది. 'అలాగే. కానీ టైం వుండటం లేదమ్మా,' అన్నాడు. ఆ మాట అడిగిన రెండు మూడు సార్లు మాత్రం వరుస పెట్టి చేశాడు. కానీ రెండు వారాల తర్వాత మళ్ళీ మామూలే.
దీంతో చేసేదేమీ లేక హేమలత దంపతులు నిరాశగా వుండిపోయ్యే వాళ్ళు. అమ్మా, నాన్నలతో రెండు రోజులకొకసారి మాట్లాడటానికి టైం లేదిప్పుడు. రేపు తల్లితండ్రులు పైకి వెళ్ళిపోయ్యిన తరువాత మాట్లాడదామని అనుకున్నా వీలవదని వాళ్ళకెలా చెప్పడం? అలా అంటే మళ్ళీ 'మీరు విపరీతంగా ఆలోచిస్తున్నారు' అని అంటారేమో.
మగ పిల్లలకు పెళ్ళి చెయ్యడం అంటే, ఇదో రకమైన ఇల్లరికం లాగానే ఉంది అనిపించింది వాళ్ళకు.
పెళ్లయినప్పటి నుంచీ 'తారే జమీన్ పర్' సినిమాలో లాగా నెమ్మది నెమ్మదిగా తల్లితండ్రులకు దూరం అవుతున్నాడు.
రెక్కలు వచ్చి, పిల్లలు వెళ్ళారు. వాళ్ళను మాతో గడపండి అంటే టైం లేదంటున్నారు. తమ వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు కొంచెం టైంకూడా అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఫోన్ చెయ్యమని బ్రతిమిలాడినా చేయలేకపోతున్నారు. తప్పు పూర్తిగా వాళ్ళది కూడా కాదు. ఇప్పటి జీవన సరళి అలా వుంది. అలాంటప్పుడు పిల్లలను నిందించలేము అనుకున్నారు మనసులోనే.
ఓ రోజు అపార్ట్మెంట్ మీటింగ్స్‌లో వీళ్ళ మొహాల్లో తేడాను ఎన్నారై పేరెంట్స్ అయిన మనోహనరావు, శ్రీలలిత దంపతులు గమనించారు.
వాళ్ళ పిల్లలు కెనడాలో ఉన్నారు. ఆ తరువాత వీళ్ళింట్లో ఆదివారం కలిసినప్పుడు ఇలా చెప్పుకొచ్చారు.
'లోపం లేనివాడు లోకంలోనే వుండడు అంటారు. అలాగే వీళ్ళు కూడా. మనం వాళ్ళ వెంటపడి వేధించకుండా వాళ్ళు చల్లగా హాయిగా, మన మీద ఆధారపడకుండా ఉన్నందుకు సంతోషిస్తూ మనం సమయం గడవలేదనుకోకుండా చూసుకుందాం.
రోజూ బైటికి వెళ్ళడం మంచి అలవాటు. ఎక్కడా బైట ఆహారం తినకుండా జాగ్రత్త పడుతూ రోజూ ఒకే చోటుకు కాకుండా గుడికి, లైబ్రరీకి, ఓల్టేజ్ హోమ్‌కు, స్నేహితుల ఇళ్ళకు, చిల్డ్రన్‌హోమ్‌కు, నెలలో రెండు రోజులు దగ్గరలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలకు అంటే బీచ్, ప్యాలెస్‌లు, చారిత్రక కట్టడాలకు వెళ్ళడం, ప్రవచనాలకు వెళ్ళి వినడం లాంటివి చేయవచ్చు.
మనం పాటలు పాడగలిగితే గుళ్ళో కానీ, సాయంత్రం అపార్ట్మెంట్‌లో కానీ పాటలు పాడవచ్చు. చిన్న కారు కొనుక్కోండి. మీరే సరదాగా డ్రైవ్‌కు వెళ్ళవచ్చు. ఒకటని కాదు మన ఆలోచన సాగినట్లు చెయ్యొచ్చు.
'మేము మిమ్ములను చూశాము కదా. మీరు మమ్ములను చూడటం లేదు' అని వాళ్ళను అనడం భావ్యం కాదు.
ఒక విధంగా మనమే వాళ్ళను విదేశాలకు పంపించి, దూరం చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళకు మనం ఒక విధంగా బరువే. కానీ వాళ్ళకు మనం కావాలి. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడటానికి. ఇండియాకు రావడానికి.
అందువల్ల చాలా మంది పిల్లల్లాగా మనను వాళ్ళు ఓల్టేజ్ హోంలో ఉంచలేదు. మనకు డబ్బు ఇబ్బంది తేలేదు.
కాకపోతే 'మాకు మేమే' అన్నట్లుగా వున్నారు. ఎందులోనూ మన సలహా సంప్రదింపులూ వాళ్ళకు ఇష్టం లేనట్లుగా మనకు అనిపిస్తుంది. కాలంతో పాటు వచ్చే మార్పులు మనకు తెలియదు. మనమే సర్దుకోవాలి. వాళ్ళు ఏదైనా అడిగితే చెప్పడం. వాళ్ళు ఇక్కడికి వస్తే ఆ నాలుగు రోజులు సంతోషంగా గడపడమే మనం చెయ్యాలి ఇప్పుడు.'
వింటూ ఉన్న హేమలత, మహేష్‌లకు వాళ్ళు చెప్తున్నవన్నీ నిజమే కదా అనిపిస్తున్నాయి. కానీ తొందరగా మనసు సర్దుకోవడం లేదు. ఒక విధంగా అమ్మా నాన్నా అనే పదవుల నుంచి మనం విరమించుకోవడమేగా అనుకున్నారు.
కొద్ది రోజుల తరువాత చిన్న కార్‌లో జొన్నవాడ వెళ్ళి వస్తూ 'ఏమిటో, టైం సరిపోవడం లేదు. ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. రోజులు త్వరగా గడిచి పోతున్నాయి' అని హేమలత అంటూ వుంటే మహేష్ కూడా 'నిజమే కదా, ఇలాగే దిగులు లేకుండా గడిచిపోతే బాగుంటుంది' అనుకున్నాడు.
వారిప్పుడు పిల్లల గురించి అదేపనిగా అలోచించడంలేదు. పిల్లల యోగక్షేమాలు స్నేహితులలాగా అప్పుడప్పుడూ తెలుస్తున్నాయి.. వీళ్ళకేం కావాలో వీళ్ళు ఆలోచించుకొని చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.
కొన్ని పనులు ఇప్పుడిప్పుడే నేర్చుకొని, చేసుకుంటూ వున్నారు. లాప్టాప్ యూజ్ చెయ్యడం నేర్చుకున్నారు.
బంధువులందరితో ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతూ, వాళ్ళ ఇళ్ళకెళ్తూ అందరితో ఎక్కువగా కలవడం చేస్తున్నారు.
అందువల్ల ఇప్పుడు వారి మనసులు 'పిల్లలూ, పిల్లలూ' అని పరితపించడం లేదు. టైం ఇంతకు ముందులా నత్తనడక నడవడం లేదు. పరిగెడుతున్నట్లు వుంది. మనసులో దిగులు లేదు.. ఎదిగి స్థిరపడిన పిల్లలకు అమ్మానాన్న లాగా వుండే కంటే స్నేహితులుగా వుండటమే ఎంతో సంతోషంగా ఉందనిపిస్తోంది వారికిప్పుడు.
శైలజ కరణం
94402 68953