Jul 17,2022 15:46

భిన్నమైన ఆకారం, విభిన్నమైన రంగు, వినూత్న రుచి ఆవకాడో సొంతం. ఎన్నో పోషకాలు, మరెన్నో ఔషధాలున్న ఈ విశిష్ట మొక్క అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసింది.ఇప్పుడు కడియం నర్సరీల్లో ఈ విదేశీ వనాలు సరికొత్త మొలకలతో వన ప్రియులకు అందుబాటులోకి వస్తున్నాయి.

1


ఆవకాడో అనేది అమెరికా, మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఫలవృక్షం. దీని శాస్త్రీయ నామం పెర్సీయ అమెరికాన. పుష్పించే తరగతికి సంబంధించిన ఈ చెట్టు లారేసి కుటుంబానికి చెందినది. ఈ పండు లోపల గుజ్జు వెన్నలాగా ఉండడంతో దీన్ని వెన్నపండు చెట్లు అని కూడా పిలుస్తారు.
సాగు
వెన్నపండు చెట్టు సుమారు 20 మీటర్లు ఎత్తు వరకూ ఎదుగుతుంది. ఆకులు సన్నగాద పొడవుగా ఉంటాయి. కాయలు కాసే ముందు పువ్వులు పూస్తాయి. ఒక్కొక్క కాయ నాలుగు నుంచి ఏడు అంగుళాల పొడవు ఉంటుంది. దాల్చినచెక్క, కర్పూర చెట్టులను పోలి ఉంటుంది. అవకాడో పండు లోపల మధ్య భాగంలో ఒకే ఒక విత్తనాన్ని కలిగి ఉంటుంది. ఈ చెట్టు పండు ఒకవైపు సన్నగా మరొకవైపు లావుగా బేరిపండు వలె, అండాకారంగాను, మరికొన్ని గోళాకారంగానూ ఉంటాయి.
అవకాడో తొక్క ముదురు నారింజ రంగులో ఉంటుంది. మరికొన్ని రకం అవకాడోలు ముక్కుపొడెం రంగులో ఉండి, కాయలు కాస్త రౌండుగా ఉంటాయ. అన్ని శీతోష్ణ, సమశీతోష్ణ మండలాలలో ఈ చెట్లు పెరుగుతున్నాయి.
మే నుంచి జులై వరకూ చెట్టు ఫలసాయం అందిస్తుంది. ఎర్ర మట్టి, నల్ల రేగడి, ఇసుక పర్రు వంటి నేలలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. పెద్దగా ఎలాంటి తెగుళ్లు ఈ మొక్కను ఆశించవు. సేంద్రీయ ఎరువులు వేస్తే సరిపోతుంది. వారానికి ఒకసారి తడి పెడితే బాగుంటుంది. మొక్క నాటిన నాలుగు సంవత్సరాల నుంచి కాపు అందుకుంటుంది.
హైబ్రీడ్‌ మొక్కలు..

2


ఆవకాడో మొక్కలు చాలా ఎత్తు వరకూ పెరుగుతాయి. కానీ నాటిన నాలుగో ఏట ఐదు అడుగుల ఎత్తులోనే వస్తూ ఉంటాయి. ఈ చెట్టు పదేళ్ల వరకూ పెరుగుతూనే ఉంటుంది. ఇటీవల సరికొత్త హైబ్రీడ్‌ రకాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. రెండు అడుగుల ఎత్తులోనే ఏడాది కాలంలోనే చకచకా కాసేస్తున్నాయి.
ఇప్పటివరకూ ఆవకాడో మొక్కలు మనదేశంలో లేనప్పటికీ విదేశాల నుంచి భారీ ఎత్తున మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఫేస్‌ క్రీములు, ఫేస్‌ వాష్‌లు, టూత్‌పేస్ట్‌లు సబ్బులు, జల్‌ తయారీలో ఆవకాడోలను విరివిగా వినియోగిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకుని, తింటూ ఉంటారని బుర్రిలంక సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు తెలిపారు. మొక్కలు అందుబాటు లోకి వచ్చాయి కనుక, ఇక్కడ రైతులు కూడా తోటలు వేసి, విరివిగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. పండ్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయనీ, రైతులు మంచి లాభాలు పొందొచ్చనీ అంటున్నారు. జామ మొక్కలాగా పెరట్లో కూడా వేసి, పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.
ఈ వెన్నపండులో ఎన్నో పోషక ఔషధాలు ఉన్నాయి. అధిక శాతం కొవ్వు ఉంటుంది. అందుచేత విదేశాల్లో వెన్నపండు గుజ్జును హోటళ్లలో చికెన్‌, ఫిష్‌, మటన్‌ కూరల్లో, సాండ్‌ విచెస్‌, సలాడ్లలోను ఉపయోగిస్తారు. వెన్నకు ప్రత్యామ్నాయంగా పిల్లలకు వెన్నపండు గుజ్జుని తినిపిస్తుంటారు. ఐస్‌ క్రీముల్లో, డెస్సర్ట్స్‌లో ఈ పళ్లను వాడతారు. వెన్నపండు గుజ్జును పంచదార కలిపిన పాలల్లోగానీ, పంచదార కలిపిన నీటిలోగానీ కలిపి, జ్యూస్‌గా తీసుకుంటారు. వెన్నపండు గుజ్జు ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. క్యాన్సర్‌, మధుమేహం, హైపర్‌ టెన్షన్స్‌ను అదుపు చేసే లక్షణం కూడా వెన్న పండుకు ఉందట. ఆవకాడో అధిక స్థాయిలో పొటాషియం కలిగి ఉంటుంది. ఇది రక్త పీడనం సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వెన్నపండు నుంచి లభించే శక్తి 75 శాతం కొవ్వు నుండే లభిస్తుంది. 100 గ్రాముల వెన్నపండు గుజ్జులో 160 కిలో కేలరీల శక్తి ఉంటుంది. 485 మిల్లీ గ్రాముల పొటాషియం లభిస్తుంది. బి, ఇ, కే విటమిన్లు కూడా లభిస్తాయి. పీచు పదార్థం 75 శాతం, 25 శాతం సాల్యుబుల్‌ ఫైబర్‌ ఉంటుంది. అవకాడోలు ఫోలిక్‌ ఆమ్లం కూడా కలిగి ఉంటాయి. గర్భవతులు ఇది తినడం వల్ల పుట్టుకతో వచ్చే స్పైనా బిఫిడా అండ్‌ న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్స్‌ నిరోధిస్తుంది.
వెన్నపండ్లు సాధారణంగా చెట్టున ఉన్నప్పుడే మగ్గుతాయి. కానీ మగ్గడానికి ఎక్కువ రోజులు పడుతుంది. వాణిజ్యంగా పండించేవారు వీటిని పచ్చిగా ఉన్నప్పుడు కోసేసి, 3.3 నుండి 5.6 సెంటీగ్రేడ్ల వద్ద ఉంచి కృత్రిమ పద్ధతుల్లో మగ్గబెడతారు. వెన్నపండు కొంచెం తీపి, కొంచెం పులుపు, కొంచెం చేదు, కొంచెం వగర ఉండే గమ్మత్తయిన రుచిగల పండు. ఇరవై రోజుల వరకూ పాడవకుండా నిలువ ఉంటుంది. మొదట్లో తిన్నప్పుడు ఆవకాడో కొందరికి వాంతులు, దురదలు లాంటివి సంభవించవచ్చు. వీటి ఆకులు తిన్న పశువులకు అలర్జీలు సంభవిస్తుంటాయి.

- చిలుకూరు శ్రీనివాసరావు
8985945506