
ఆయుధ కంపెనీల లాభాలకు ఇప్పటి వరకు స్టార్‌వార్స్‌లో నిమగమైన అమెరికా ఇప్పుడు సముద్ర గర్భాన్ని కూడా అల్లకల్లోలం చేసేందుకు పూనుకుంది. అది కూడా తమకు సుదూరంలో ఉన్న చోటును ఎంచుకుంది. తమ చేతికి మట్టి అంటకుండా ఇటీవల అనేక దేశాల్లో తమ సైనికులను పంపకుండా ఆయుధాలు ఇచ్చి ఇతరులు కొట్టుకు చచ్చేట్లు చూస్తున్నది. దాని కొనసాగింపే తాజా పరిణామం. అమెరికా, బ్రిటన్ దేశాల నుంచి ఆస్ట్రేలియా పదిహేను వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా-ఆస్ట్రేలియా దూరం ఏడున్నరవేల కిలోమీటర్లు. రానున్న మూడు దశాబ్దాల కాలంలో అమెరికా, బ్రిటన్ దేశాలకు ఆస్ట్రేలియా 368 బిలియన్ డాలర్లు సమర్పించుకొని అణుశక్తితో నడిచే కొత్త, పాత జలాంతర్గాముల కొనుగోలు, కొత్తవాటి తయారీకి ఒప్పందం చేసుకుంది. ఎందుకటా? ఈ మూడు దేశాల మీద చైనా గనుక దాడికి దిగితే దాన్ని ఎదుర్కొనేందుకు అని కుంటిసాకులు చెబుతున్నాయి. వీటికి చైనాతో సరిహద్దు తగాదాలేదు. దేశాలను ఆక్రమించుకొనే పంచాయితీ అసలే లేదు. దక్షిణ చైనా సముద్రం మీద పూర్తి ఆధిపత్యం సాధించేందుకు చైనా చూస్తోంది. అదే జరిగితే అంతర్జాతీయ జలాల్లో ఏ దేశ నౌకలైనా తిరగటానికి స్వేచ్ఛ ఉండదు గనుక దాన్ని ఎదుర్కోవాలంటే ఆస్ట్రేలియా-బ్రిటన్-అమెరికా (అకుస్)లతో ఏర్పడిన కూటమి బలపడాలి, అందుకు పావుగా ఉన్న ఆస్ట్రేలియాకు జలాంతర్గాములను అందించి చైనా మీద దాడి చేయించాలి, ఇదీ అమెరికా ఎత్తుగడ. చైనాను బూచిగా చూపి ఆ ప్రాంత దేశాలకు ఎంతగా వీలైతే అన్ని ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనే దురాశ తప్ప అసలది జరిగేదేనా ?
అణుబాంబును కనిపెట్టటం, దాన్ని తొలిసారిగా జపాను మీద వేసి ప్రపంచాన్ని భయపెట్టిన రోజు నుంచి అమెరికా ఆయుధాల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. జనానికి రోజువారీ అవసరమైన వినిమయ వస్తువులను చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని అధిక లాభాలు వచ్చే హైటెక్, మారణాయుధాల మీదనే కేంద్రీకరిస్తోంది. ఎక్కడైనా శాంతి కనిపిస్తే దానికి నిద్ర పట్టటం లేదు, అందుకే కొత్త ఉద్రిక్తతల సృష్టికి చూస్తోంది. స్టాకహేోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (సిప్రి) తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి, ఆర్థిక వడిదుడుకులు దెబ్బతీసినా అమెరికా మారణాయుధాల వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. 2013-22 కాలంలో ప్రపంచ స్థాయిలో ఆయుధాల లావాదేవీలు 5.1 శాతం తగ్గాయి. ఆఫ్రికా దిగుమతులు 40, అమెరికా 21, ఆసియా-ఓషియానా 7.5, మధ్యప్రాచ్యం 8.8 శాతాల చొప్పున తగ్గగా తూర్పు ఆసియా మొత్తంగా 42 శాతం, ఫిలిప్పైన్స్ 64, దక్షిణ కొరియా 61, జపాన్ 171, ఆస్ట్రేలియాకు 21 శాతం పెరిగాయి. ఇతర ప్రాంతాల్లో కొన్ని దేశాల దిగుమతులు భారీగా పెరగ్గా ఐరోపా దేశాలవి 47 శాతం పెరిగాయి. వాటిలో నాటో కూటమి 65 శాతం పెరిగాయి. ఇవన్నీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ప్రపంచానికి శాంతి ప్రవచనాలు వల్లిస్తుండగా జరిగినవే. ప్రపంచ ఆయుధాల ఎగుమతుల్లో అమెరికా వాటా 33 నుంచి 40 శాతానికి పెరగ్గా, రష్యా ఎగుమతులు 22 నుంచి 16 శాతానికి తగ్గాయి. రష్యాను బూచిగా చూపి ఐరోపాకు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను అంటగట్టినట్లు స్పష్టం అవుతోంది. ఇతర ప్రాంతాల్లో కూడా అలాంటి ఎత్తుగడలతో లబ్ధి పొందాలన్నదే అమెరికా అసలు ఎత్తుగడ. చైనాను దుష్టశక్తిగా చూపి ఆసియా నాటో ఏర్పాటుకు పావులు కదుపుతోంది. క్వాడ్, అకుస్ దానికి ప్రాతిపదికలే. ప్రపంచంలో ఎక్కడ పచ్చగా కనిపిస్తే అక్కడ చిచ్చు పెట్టటం అమెరికా నిత్యకృత్యంగా ఉంది. ఈ ఒప్పందం ఆస్ట్రేలియా పాలక లేబర్ పార్టీలో ఉన్న విబేధాలను వెల్లడించింది. ఇది తెలివి తక్కువపని, దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని మాజీ ప్రధాని పాల్ కీటింగ్ ధ్వజమెత్తటం గమనించాల్సిన అంశం. అమెరికాతో చేతులు కలుపుతూ చైనాతో స్వయంగా ఆస్ట్రేలియా సమస్యలను సృష్టించుకోవటం తప్ప వేరు కాదని, చైనాతో నిజానికి ఎలాంటి వైరం లేదని, అది ఎలాంటి దాడి తలపెట్టలేదని, ఈ ప్రాంతంలో అమెరికా పెత్తనాన్ని నిలిపేందుకు చేస్తున్న పని తప్ప మరొకటి కాదన్నాడు.
ఆస్ట్రేలియా ఇప్పటి వరకు అణ్వస్త్ర రహిత దేశంగా ఉంది. దానికి అణ్వాయుధాల తయారీకి అనువైన యురేనియంను భారీ మొత్తంలో జలాంతర్గాములతో పాటు అమెరికా అందచేస్తున్నది. ఇది అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందానికి (ఎన్‌పిటి) పూర్తి విరుద్ధం. మరొక అణుశక్తిని తయారు చేసి ప్రపంచం మీదకు వదలటం తప్ప వేరు కాదు. ఒక వైపు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించే పేరుతో ఆంక్షల కత్తి కట్టిన అమెరికా శుద్ధిచేసిన యురేనియంను తన మిత్రదేశానికి అందచేస్తున్నది. చాకును కూరగాయలు తరిగేందుకే అని విక్రేత నిబంధన చెప్పినా కుత్తుకలు కత్తిరించకుండా కొన్నవారిని నిరోధించలేరు. ఇది కూడా అంతే. అందుకే ప్రపంచ శాంతిశక్తులు ఇలాంటి లావాదేవీలను తీవ్రంగా నిరసించాలి, ప్రతిఘటించాలి. ఇది తమను సముద్ర గర్భంలో చుట్టుముట్టే ఎత్తుగడలో భాగమని, దీన్ని ఎదుర్కొనేందుకు తాము కూడా పూనుకుంటామని చైనా చెప్పింది. అంటే మరోసారి ఆయుధ పోటీకి అమెరికా తెర తీసినట్లే. వచ్చిన వార్తల ప్రకారం 2027 నాటికి అమెరికా నుంచి అణుశక్తితో నడిచే నాలుగు, బ్రిటన్ నుంచి ఒక జలాంతర్గామి పశ్చిమ ఆస్ట్రేలియా మిలిటరీ కేంద్రానికి చేరుకుంటాయి. రెండవ దశలో అమెరికా వాడుతున్న వాటి నుంచి మరో మూడు అందచేస్తారు. తరువాత వీటి స్థానంలో బ్రిటన్‌తో కలసి కొత్తవాటిని రూపొందిస్తారు. ఇప్పటికే జపాన్ వద్ద ఉన్న జలాంతర్గాములకు ఇవి తోడైతే చైనాను సమర్ధవంతంగా అడ్డుకోగలమని జనాన్ని నమ్మించ చూస్తున్నారు. వీటన్నింటినీ తట్టుకోవటమే కాదు, అవసరమైతే దాడులకు దిగే విధంగా ఆధునిక వ్యవస్థలను రూపొందించాలని చైనా నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిణామాన్ని చూస్తుంటే ఆసియా-పసిఫిక్ ప్రాంతాన్ని సముద్రగర్భ యుద్ధ కేంద్రంగా మార్చేందుకు అకుస్ కూటమి చూస్తున్నదని చెప్పవచ్చు.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్