ఈ నెల 15వ తేదీన అల్ అహ్లి అస్పత్రిపై రాకెట్ దాడి జరిగింది. ఆస్పత్రిపై దాడికి తాము బాధ్యులం కాదంటూ ఇజ్రాయిల్ ఇప్పుడు వాదిస్తోంది. ఇస్లామిక్ జిహాద్ ప్రయోగించిన రాకెట్ గురి తప్పి ఆస్పత్రిపై పడిందని, దాంతో ఈ దాడి చోటు చేసుకుందని చెబుతోంది. అయితే ఇంతటి భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించగలిగేంత శక్తివంతమైన రాకెట్లు గాజా మిలిటెంట్ల వద్ద లేవని సైనిక నిపుణులు, పలువురు మీడియా వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. అటువంటి శక్తివంతమైన బాంబులను కలిగివున్నది ఇజ్రాయిల్ మిలటరీ మాత్రమే. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయిల్ చెబుతున్న కథనాన్ని బైడెన్ కూడా నిస్సిగ్గుగా సమర్ధించారు. 'ప్రత్యర్ధి బృందమే ఈ దాడికి పాల్పడింది' అంటూ ప్రకటించారు. ఆ రకంగా, ఇజ్రాయిల్ పాల్పడిన యుద్ధ నేరాల్లో బైడెన్ కూడా భాగస్వామి అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక రోజు ఇజ్రాయిల్ పర్యటన వల్ల ఏదైనా ఫలితం కనిపించిందీ అంటే అది, సెటిలర్-వలసవాద రాజ్యమైన ఇజ్రాయిల్‌కు నిరంతరం, గుడ్డిగా మద్దతు ఇవ్వడమే. ఈ పర్యటన 1948 నుండి మారని వాస్తవికతను నొక్కి చెప్పింది-పశ్చిమాసియాలో తన ఔట్‌పోస్ట్‌గా ఇజ్రాయిల్‌ను అమెరికా పెంచి పోషిస్తూ వచ్చింది. మంచి పాటవంతో కూడిన సైనిక దండు కలిగిన దేశంగా ఇజ్రాయిల్‌ను మార్చడానికి వందల కోట్ల డాలర్ల విలువైన సాయం, అత్యంత అధునాతనమైన ఆయుధాలు, ఇతర పరికరాలు అమెరికా గుమ్మరించింది.
ఆ రకంగా చేయడం ద్వారా, పాలస్తీనియన్ల అణచివేతను, వారు అనుభవిస్తున్న ఇబ్బందులను, కష్టనష్టాలను, వెస్ట్ బ్యాంక్ వంటి ఆక్రమిత ప్రాంతాల్లో జరుగుతోన్న జాతి ప్రక్షాళన వంటి చర్యలను అమెరికా పట్టించుకోలేదు. అత్యంత సౌకర్యవంతమైన రీతిలో వాటిని విస్మరించింది. 23 లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్న గాజాలో గత 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న అమానవీయ ఆంక్షలను, దిగ్బంధనాన్ని సమర్ధిస్తూ వచ్చింది. ఇటీవలి సంవత్సరాల్లో, వెస్ట్ బ్యాంక్‌లో యూదు ఆవాసాలను విస్తరించడం ద్వారా రెండు దేశాల ఏర్పాటు ఫార్ములాను ఇజ్రాయిల్ చురుకుగా దెబ్బ తీస్తూ, వర్ణ వివక్ష వంటి వ్యవస్థను అమలు చేస్తున్నపుడు, ఈ ద్వంద్వ ప్రణాళికలో అమెరికా, దాని పశ్చిమ మిత్రపక్షాలు కుమ్మక్కయ్యాయి. కానీ, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారం గురించి ఊరికే ప్రచారం చేస్తూ వచ్చాయి. బైడెన్ పర్యటనకు ముందుగా, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయిల్, మరో ఐదు అరబ్ దేశాల్లో పర్యటించారు. గాజాలో పదాతిదళ దాడికి ఇజ్రాయిల్ సన్నద్ధమవుతుంటే, ఈజిప్ట్, జోర్డాన్ వంటి ఇరుగు పొరుగు దేశాలు సహకరించాలని కోరేందుకు ఆయా దేశాల్లో బ్లింకెన్ పర్యటించారు. రాఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్‌లోకి వెళ్ళేందుకు గాజా నుండి పాలస్తీనియన్లను అనుమతించేందుకు ఈజిప్ట్ అధ్యక్షుడిని ఒప్పించడంలో బ్లింకెన్ విఫలమయ్యారు. పాలస్తీనియన్లు ఒకసారి ఈజిప్ట్‌లోకి ప్రవేశిస్తే ఇక వారిని తిరిగి గాజాకు వెళ్ళేందుకు అనుమతించేది లేదని, వారు ఇక ఈజిప్ట్‌లో శాశ్వత శరణార్ధులుగా వుండిపోతారని ఈజిప్ట్ అధ్యక్షుడు సిసి ప్రకటించారు. జోర్డాన్ లోకి పాలస్తీనియన్ల రాకపోకలను జోర్డాన్ కూడా తిరస్కరించింది.
ఆత్మ రక్షణ కోసం గాజాపై దండెత్తడానికి ఇజ్రాయిల్‌కు హక్కు వుందంటూ అమెరికా పూర్తిగా సమర్ధించింది. మరోవైపు రాబోయే మానవ విపత్తును తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
టెల్ అవీవ్‌కు రావడానికి ముందు రోజు రాత్రి దక్షిణ గాజా లోని అల్ అహ్లి ఆస్పత్రిపై బాంబు దాడితో భయంకరమైన రీతిలో మారణకాండ చోటు చేసుకుంది. ఇప్పటివరకు 471 మంది మరణించినట్లు వెల్లడైంది. 24 గంటల్లోగా రోగులు, సిబ్బంది అందరూ ఖాళీ చేయాలని లేనిపక్షంలో పర్యవసానాలను ఎదుర్కొనాల్సి వుందంటూ ఉత్తర గాజాలోని 22 ఆస్పత్రులను ఇజ్రాయిల్ మిలటరీ ఆదేశించిన నేపథ్యంలో ఈ దారుణమైన దాడి జరిగింది. అక్టోబరు 12 సాయంత్రం ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 15వ తేదీన అల్ అహ్లి అస్పత్రిపై రాకెట్ దాడి జరిగింది. ఆస్పత్రిపై దాడికి తాము బాధ్యులం కాదంటూ ఇజ్రాయిల్ ఇప్పుడు వాదిస్తోంది. ఇస్లామిక్ జిహాద్ ప్రయోగించిన రాకెట్ గురి తప్పి ఆస్పత్రిపై పడిందని, దాంతో ఈ దాడి చోటు చేసుకుందని చెబుతోంది. అయితే ఇంతటి భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించగలిగేంత శక్తివంతమైన రాకెట్లు గాజా మిలిటెంట్ల వద్ద లేవని సైనిక నిపుణులు, పలువురు మీడియా వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. అటువంటి శక్తివంతమైన బాంబులను కలిగివున్నది ఇజ్రాయిల్ మిలటరీ మాత్రమే. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయిల్ చెబుతున్న కథనాన్ని బైడెన్ కూడా నిస్సిగ్గుగా సమర్ధించారు. 'ప్రత్యర్ధి బృందమే ఈ దాడికి పాల్పడింది' అంటూ ప్రకటించారు. ఆ రకంగా, ఇజ్రాయిల్ పాల్పడిన యుద్ధ నేరాల్లో బైడెన్ కూడా భాగస్వామి అయ్యారు. అమ్మాన్‌లో జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా అథారిటీ నేతలతో జరగాల్సిన సమావేశాల రద్దు గురించి అస్సలేమీ మాట్లాడకుండా మౌనం పాటించారు. ఈ భయంకరమైన నేరానికి ఇజ్రాయిల్ పాల్పడిన సమయంలో ఏ అరబ్ నేత కూడా చివరకు అమెరికా మిత్రపక్షాలు కూడా బైడెన్‌తో సమావేశమవలేదు.
ఇజ్రాయిల్‌కు రక్షణగా నిలబడేందుకు అమెరికా ఎంతకైనా తెగిస్తుందనే విషయం బైడెన్ ఇజ్రాయిల్‌కు వచ్చిన మొదటి రోజే స్పష్టమైంది. గాజాలోకి ప్రాణాధార ఔషధాలు, ఇతర సరఫరాలు అనుమతించేందుకు వీలుగా మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయాలని పిలుపిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బ్రెజిల్ ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. గాజాలోకి మానవతా సాయం వెళ్లనివ్వకుండా ఆ ప్రతిపాదనను వీటో చేయడం ద్వారా గాజాలో ప్రజలు ఆహారం, మందులు లేక కరువుబారిన పడేందుకు అమెరికా అనుమతించినట్టు అయింది.
పైగా ఇజ్రాయిల్‌లో పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత బైడెన్ మాట్లాడుతూ, రాఫా క్రాసింగ్ ద్వారా గాజాలోకి మానవతా సాయం అందించేందుకు అనుమతించాలంటూ ఇజ్రాయిల్ యుద్ధ కేబినెట్‌ను కోరినట్లు తెలిపారు. ఫలితంగా, అక్టోబరు 20న రాఫా క్రాసింగ్‌ను దాటేందుకు 20 ట్రక్కులను అనుమతించనున్నారు. ఇజ్రాయిల్ బాంబు దాడుల్లో ధ్వంసమైన క్రాసింగ్ వద్ద రోడ్లను ఈజిప్ట్ మరమ్మత్తులు చేస్తేనే ఇదైనా జరుగుతుంది. గాజా ప్రజలకు కాస్తయినా ఉపశమనం కలగాలంటే రోజూ కనీసం వంద ట్రక్కుల వరకు సాయం అందాల్సి వుంటుందని ఐక్యరాజ్య సమితి సహాయ సంస్థ తెలిపింది.
గాజాపై ఇజ్రాయిల్ పదాతి దాడికి పాల్పడినట్లైతే ఈ ప్రాంతంలో ఘర్షణ ఇంకా విస్తృతమవుతుంది. ఒకవేళ అటువంటి దాడి జరిగినట్లైతే తాము చూస్తూ ఊరుకోబోమని ఇప్పటికే లెబనాన్‌లో హిజ్బుల్లా ప్రకటించింది. అరబ్ ప్రపంచవ్యాప్తంగా, పశ్చిమాసియాలో ప్రజలు గాజాలో ఇజ్రాయిల్ కిరాతక దాడులను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పటికి యుద్ధం ప్రారంభమై 11 రోజులు గడిచింది. ఇప్పటివరకు 1100 మంది చిన్నారులతో సహా 3 వేల మందికి పైగా మరణించారు. ఇజ్రాయిల్‌కు రాజకీయ, సైనిక తోడ్పాటు అందించడం ద్వారా అమెరికా ఇస్తున్న మద్దతు ప్రపంచ దేశాల దృష్టిలో ఖండించదగ్గది.
( 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం )