Jun 27,2023 08:05
  • రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ వెల్లడి

మాస్కో: విఫలమైన తిరుగుబాటు వెనుక అమెరికా పాత్ర ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ చెప్పారు. తనతో విభేదించే దేశాల ప్రభుత్వాలను మార్చేందుకు అమెరికా పన్నని కుట్ర లేదు. తన ప్రపంచాధిపత్యానికి అడ్డంకిగా ఉన్న ప్రభుత్వాలను కూలదోసి, తన ప్రయోజనాలను నెరవేర్చే తొత్తు ప్రభుత్వాలను నెలకొల్పేందుకు అది ఎప్పుడూ కుతంత్రాలు పన్నుతూనే ఉంటుందని సోమవారం ఆర్‌టి చానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
 

                                                                  రష్యాకు చైనా పూర్తి మద్దతు

తిరుగుబాటును భగం చేసి దేశంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పుతిన్‌ చేస్తున్న యత్నాలకు చైనా తన పూర్తి మద్దతు ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసిన ప్రకటనలో రష్యాలో తాజా పరిణామాలపై అధికారికంగా తన వైఖరిని వెల్లడిం చింది. రష్యాలో తిరుగుబాటు యత్నం ఆ దేశ ఆంతరంగిక వ్యవహారమని, అయితే, పొరుగున ఉన్న మిత్ర దేశంగా, కొత్త శకంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉన్న దేశంగా తాము రష్యా సుస్థిరత, అభివృద్ధిని పరిరక్షించేందుకు చేస్తున్న యత్నాలకు పూర్తి మద్దతు ఇస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
 

                                                                     న్యూయార్క్‌ టైమ్స్‌ ఆక్రోశం

రష్యాలో వాగర్‌ తిరుగుబాటు యత్నాన్ని ఉపయోగించుకో వడంలో ఉక్రెయిన్‌ విఫలమైందని అమెరికన్‌ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ఆక్రోశం వెళ్లగక్కింది. ఉక్రెయిన్‌లో రష్యన్‌ బలగాలను వెనక్కి తరిమేందుకు వచ్చిన ఒక అవకాశాన్ని అది చేతులారా జారవిడుచుకుందని టైమ్స్‌ పేర్కొంది. తిరుగుబాటు సమయంలో సైతం రష్యన్‌ బాలగాలు ఉక్రెయిన్‌లోని వివిధ లక్ష్యాలపై క్షిపణి దాడులను సాగించిందని తెలిపింది.
 

                                                              వాగర్‌పై ఆఫ్రికా దేశాలు ఆందోళన

తిరుగుబాటుకు యత్నించి విఫలమైన ప్రైవేట్‌ మిలిటరీ వాగర్‌ గ్రూపు పై రష్యా ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకున్నందున ఇప్పటికే ఆ సంస్థ సేవలను వినియోగించుకునేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్న ఆఫ్రికన్‌ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.కిరాయి సైన్యం వాగర్‌ గ్రూపు సేవలు ఇంతకుముందులాగే ఇప్పుడు అందుబాటులో ఉంటాయా అనేదానిపై రష్యా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ గ్రూపుతో కుదుర్చుకున్న ఒప్పందాలు అనిశ్చితిలో పడ్డాయి.