
అసైన్డ్ చట్టం ప్రకారంగా తిరిగి మా భూములు మాకు కావాలని చాలా చోట్ల పేదలు తిరగబడుతున్నారు. తిరిగి భూములు స్వాధీనం చేసుకోవడానికి ఉద్యమిస్తున్నారు. అంతిమంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అనివార్యంగా అక్రమంగా అనుభవిస్తున్న వారు తిరిగి ఆ భూములను ఇవ్వక తప్పడం లేదు. అక్రమంగా ఆర్జిస్తున్న భూస్వాములు తిరిగి పేదలకు ఇవ్వకుండా ఉండడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిడికి తలొగ్గి అసైన్డ్ చట్టం పీక నొక్కడానికే రాష్ట్ర క్యాబినెట్ చట్ట సవరణకు అంగీకరించింది.
ఆమె పేరు నాగలక్ష్మి. అనంతపురం జిల్లా ముకుందా పురం గ్రామం దళిత మహిళ. 1987లో ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చింది. ఆమె భర్త అదే గ్రామంలోని ఒక భూస్వామి దగ్గర పాలేరుగా పని చేసేవాడు. ఆ సందర్భంగా కొంత అప్పు చేశాడు. అప్పు తీర్చనందుకు ఆ భూమిని భూస్వామి స్వాధీనం చేసుకున్నాడు. అప్పు తీర్చారు, కాని నేటికీ ఆ భూమిని నాగలక్ష్మికి అప్పజెప్పకుండా ఆ భూస్వామే అనుభవిస్తున్నాడు. ఇప్పడు రాష్ట్ర క్యాబినెట్ దళితులను రైతులుగా మారుస్తామంటూ అసైన్డ్ చట్ట సవరణకు అనుమతించింది. దీనిప్రకారం పైన చెప్పుకున్న భూమికి యాజమాన్య హక్కు ఎవరికి కల్పిస్తారో ప్రభుత్వమే చెప్పాలి.
పేదలకు భూ పంపిణీ కోసం అసైన్డ్ భూములపై అధ్యయనం చేయడానికి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో 13 మంది ఎమ్మెల్యేలతో 2022 అక్టోబర్‌లో కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ తమిళనాడు, కర్ణాటకలో అధ్యయనం చేసి 10 నెలల అనంతరం నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఇప్పటికీ బహిరంగ పరచలేదు. 1954 నుండి 2002 మధ్య అసైన్డ్ భూములు పొందిన దళితులు, పేదలకు పూర్తి యాజమాన్యపు హక్కులు కల్పిస్తామని ఈ నెల 12వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ భూమిని ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చన్న చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల 15 లక్షల 21 వేల కుటుంబాల వారు పేదరికం నుండి బైటపడి సంపన్నులుగా మారతారని పాలక వర్గాలు ఊదర కొడుతున్నాయి. ఈ చట్ట సవరణ వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఒకసారి పరిశీలిద్దాం.
స్వాతంత్య్రానంతరం ఉమ్మడి రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఉద్యమ పోరాటాల ఫలితంగా సుమారు 58 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం పేదలకు అసైన్ (ఇచ్చింది) చేసింది. ఈ భూమిలో కొంత పెత్తందార్లు, పలుకుబడి కల్గినవారు దౌర్జన్యంగా పేదల నుండి లాగేసుకోసాగారు. ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ఈ భూమిని తిరిగి పేదలకు చెందేలా 1977లో ఆనాడు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎస్.ఆర్.శంకరన్ ప్రభుత్వాన్ని ఒప్పించి పిఒటి యాక్ట్ 9/77 అసైన్డ్ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం భూమి లేని పేదలు రెండున్నర ఎకరాల మాగాణీ, 5 ఎకరాల మెట్ట పొందవచ్చు. మించి ఉన్నవారు అసైన్డ్ భూములు పొందడానికి అనర్హులు. అసైన్డ్ భూములను పొందిన వారు, వారి వారసులు అనుభవించాలి కాని అమ్మకాలు, కొనుగోలు చేయరాదు. ఎవరైనా బలవంతంగా, దౌర్జన్యంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినా, అన్యాక్రాంతం చేసినా అసైన్డ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం శిక్షార్హులు. తిరిగి మా భూమి మాకు కావాలని భూమిని కోల్పోయిన వారు గాని, వారి వారసులు గాని ప్రభుత్వాన్ని కోరితే తిరిగి అప్పగించాలి. అలా చేయకపోతే చట్టరీత్య శిక్షార్హులు. చివరికి కోర్టుల ద్వారా పేదలు తిరిగి ఆ భూమిని పొందవచ్చు. ఈ భూములు సెక్షన్ 5 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే అసైన్డ్ చట్టం పేదల భూములకు కవచ కుండలం లాంటిది. ఇంతటి ప్రాధాన్యత కల్గిన చట్టాన్ని మరింత బలోపేతం చేసి అమలు చేయాల్సింది పోయి పాలక వర్గాలు భూస్వాముల ఒత్తిడికి తలొగ్గి పేదలకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నాయి.
అసైన్డ్ చట్టం ఇంత పకడ్బందీగా ఉన్నప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 25 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు 2006లో కోనేరు రంగారావు భూ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ భూములను వారికి తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి 2006 మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ తన తండ్రి రాజారెడ్డి తెలిసో, తెలియకో 300 ఎకరాలు అసైన్డ్ భూములు పొందారని, తక్షణమే ఈ భూములను తిరిగి ఆ పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా నెల్లూరు జిల్లా బాలాయిపాలెం మండలంలో సుమారు 500 ఎకరాలు బినామీ పేర్లతో అనుభవిస్తున్నారని ఇలాంటి అన్యాక్రాంతమైన భూములను గుర్తించి 6 నెలల లోపు తిరిగి కోల్పోయిన పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాలేదు.
1954 నుండి 2002 మధ్య కాలంలో అసైన్డ్ భూములు పొందిన పేదలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని తాజాగా మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం అసైన్డ్ భూములు పొందిన లబ్ధిదార్ల కంటే అక్రమంగా, దౌర్జన్యంగా పొందిన భూస్వాములకే ప్రయోజనం జరుగుతుంది. ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న 13 జిల్లాల్లో 15,21,160 కుటుంబాలకు చెందిన 27,41,697 ఎకరాలకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. మరోపక్క ఆనాడు ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు భూ కమిటి లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని చెప్పింది. నేడు అనేక జిల్లా అధికారులు కూడా అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి యాజమాన్యపు హక్కులను భూమి పొందిన నిజమైన పేదలకు కల్పిస్తారా? లేదా దౌర్జన్యంగా అనుభవిస్తున్న భూస్వాములకు హక్కులు కల్పిస్తారా? ప్రభుత్వం చెప్పాలి. భూమి వివరాలను బహిరంగ పర్చవలసిన అవసరం ఉంది.
రాష్ట్రంలో అనేక జిల్లాల్లో డెల్టా, పారిశ్రామిక, నేషనల్ హైవే, ఎస్‌ఇజెడ్, సముద్రతీర ప్రాంతంలో పేదల నుండి బలవంతంగానూ, పావలో పాతికో ఇచ్చి సారావంతమైన, విలువైన భూములను... భూస్వాములు, రాజకీయంగా పలుకుబడి కల్గినవారు సొంతం చేసుకొని...చేపలు, రొయ్యల చెరువులు, ఫామ్‌హౌస్‌లు కట్టుకొని అనుభవిస్తున్నారు. అసైన్డ్ చట్టం ప్రకారంగా తిరిగి మా భూములు మాకు కావాలని చాలా చోట్ల పేదలు తిరగబడుతున్నారు. తిరిగి భూములు స్వాధీనం చేసుకోవడానికి ఉద్యమిస్తున్నారు. అంతిమంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అనివార్యంగా అక్రమంగా అనుభవిస్తున్న వారు తిరిగి ఆ భూములను ఇవ్వక తప్పడం లేదు. అక్రమంగా ఆర్జిస్తున్న భూస్వాములు తిరిగి పేదలకు ఇవ్వకుండా ఉండడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిడికి తలొగ్గి అసైన్డ్ చట్టం పీక నొక్కడానికే రాష్ట్ర క్యాబినెట్ చట్ట సవరణకు అంగీకరించింది. ఉదాహరణకు ఏలూరు జిల్లా దోసపాడు, అనంతపురం జిల్లా ముకుందాపురం, కృష్ణా జిల్లా ఇలపర్రు, కడప జిల్లా కాశినాయనా గ్రామాలకు చెందిన అసైన్డ్ భూములను విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు చెందిన భూస్వాములు వందలాది ఎకరాలు అక్రమంగా అనుభవిస్తున్నారు. మరి ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి ఆ పేదలకు ఇచ్చి యాజమాన్యపు హక్కులు కల్పిస్తుందా? బినామీ పేర్లతో అనుభవిస్తున్న ఆ భూస్వాములకే కట్టబెడతారా? వాన్‌పిక్ కు ఇచ్చిన 13 వేల ఎకరాల అసైన్డ్ భూములను, అమరావతిలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అక్రమంగా అనుభవిస్తున్న 2 వేల ఎకరాల అసైన్డ్ భూములు తిరిగి పేదలకు ఇస్తారా? లేదా వారికే కట్టబెడతారా? అనేది ప్రశ్నార్థకం. కాని 2006లో నాటి ప్రభుత్వం ఏ రకంగా అయితే భూములను ఆక్రమించుకున్న పెద్దలకే అసైన్డ్ చట్టాన్ని సవరించిమరీ కట్టబెట్టిందో ప్రస్తుతం జరిగేది కూడా అంతే.
ప్రభుత్వం చెప్తున్న మాటలు నమ్మి మా భూములకు హక్కులు రావడంతో మేము అమ్ముకోవచ్చు. కోటీశ్వరులు కావచ్చు అని నమ్మేవారు ఉన్నారు. ఇది పచ్చి దగా, మోసం. ఎందుకంటే అసైన్డ్ చట్టం అమలులో ఉండగానే పెత్తందార్లు పేదల భూములను అనుభవిస్తున్నారు. భూములు కోల్పోయిన దళితులు, చైతన్య వంతమైన వారి వారసులు ఈ చట్టం ఉంది కాబట్టే పోరాడి తిరిగి సాధించుకుంటున్నారు, భూములను రక్షించుకుంటున్నారు. రేపు ఈ చట్ట సవరణ అమలులోకి వస్తే ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడి చేతిలో చారెడు భూమి కూడా మిగలదు.
కాబట్టి మన రాష్ట్రంలో కోనేరు రంగారావు భూ కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా, ప్రభుత్వ లెక్కలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు చెబుతున్న లెక్కల ప్రకారం సుమారు 15 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తుంది. ముందు ఈ వివరాలను బయట పెట్టాలి. చట్టానికి విరుద్ధంగా రెండున్నర ఎకరాల మాగాణీ, 5 ఎకరాలకు పైగా మెట్ట భూమిని అక్రమంగా అనుభవిస్తున్న వారి నుండి తిరిగి తీసుకోవాలి. ఒక వేళ అసైన్డ్ భూమి పొందిన దళితులు, బలహీన వర్గాలకు చెందిన పేదలు తమ అవసరాల కోసం అమ్ముకుంటే అటువంటి భూమిని ప్రభుత్వమే భూ కొనుగోలు పథకం కింద కొని అదే గ్రామంలో భూమి లేని పేదలకు పంచాలి. ఇది చెయ్యకుండా కూలీలను రైతులుగా మారుస్తానని చెప్పి తడి గుడ్డతో గొంతు కోసినట్లు చట్టాన్ని సవరించి అక్రమంగా అనుభవిస్తున్న వారికి యాజమాన్యపు హక్కులు కల్పించడం దళిత, బలహీన వర్గాల కుటుంబాలకు తీవ్రమైన ద్రోహం చేయడమే. కాబట్టి ప్రభుత్వం చెబుతున్న అసైన్డ్ చట్ట సవరణ వల్ల ఆక్రమణదారులకే ఎక్కువ మేలు జరిగి పేదలకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ సవరణలను ఉపసంహరించక పోతే పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుంది.
/ వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
సెల్: 94900 98980 /
వి.వెంకటేశ్వర్లు