Aug 27,2023 09:25

తెల తెలవారుతోంది. పక్షుల కువకువలతో రోజు మొదలవబోతోంది. సూర్యుడు ఠంచనుగా డ్యూటీకి సిద్ధమైపోయాడు. కిటికీలో నుండి సూర్యుడి కిరణాలు చురుక్కుమనటంతో లతకు మెలకువ వచ్చింది. పక్కనే వున్న అలారం వైపు చూస్తే 6:05 చూపిస్తున్న ముల్లు వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. టైం చూస్తూనే ఉలిక్కిపడి లేచింది లత. గత రాత్రి 2, 3 గంటల వరకు నిద్ర పట్టకపోవడంతో ఆలస్యంగా పడుకుందేమో అప్పుడే ఆరయ్యిందని కంగారుగా మంచం దిగింది. మెదడంతా ఆలోచనలు, నిద్రలేమి, టైంకి తినకపోవటంతో తల గిర్రున తిరిగింది. అయినా తమాయించుకొని ఫోన్‌ చేతిలోకి తీసుకొని మరోసారి భర్త శంకర్‌కు కాల్‌ చేసింది. ఎందుకంటే అప్పటికే వారం నుండి ఇదిగో వస్తాను.. అదిగో వస్తానన్న.. శంకర్‌ రాలేదు. కాబట్టి తానే శంకర్‌ దగ్గరకు వెళ్లబోతుంది. టికెట్‌ బుక్‌ చేయమని చెప్దామనుకుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో తన దినసరి పనుల్లోకి దిగిపోయింది. ఈ రోజో రేపో హైదరాబాద్‌ వెళ్లడానికి, కొత్త ఉద్యోగంలో చేరేందుకు కావల్సినవి సర్దుకుంటోంది. మధ్య మధ్యలో ఫోన్‌ ప్రయత్నిస్తున్నా శంకర్‌ ఫోన్‌ ఎత్తట్లేదు. 'ఈ రోజు ఫోన్‌ కూడా ఎత్తటం లేదేంటి?' అన్న ఆలోచనతో అస్థిమితంగానే పదే పదే ప్రయత్నిస్తుంది.
పిల్లలిద్దరినీ హాస్టల్స్‌లో వుంచి, తలా ఒక వైపు అయిన కుటుంబాన్ని, అప్పుల భారంతో శంకర్‌ నిర్లిప్తతను తలచుకొని, బాధపడుతూ పనులు చేసుకోసాగింది. లత ఫ్రెండ్‌ కుమారి ఫోన్‌ చేయటంతో పనులు ఆపి మాట్లాడింది. తన భయాలు, ఆందోళనలు స్నేహితురాలి పలకరింపుతో దు:ఖం ఆగలేదు లతకు. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. కుమారి ధైర్యం చెప్తున్నా లత నెమ్మదించ లేకపోయింది. మళ్లీ చేస్తానని ఫోన్‌ పెట్టేసి, తన అత్తగారు ఈశ్వరమ్మకు ఫోన్‌ చేసింది. శంకర్‌ గురించి అడిగింది. కోడలి ఆందోళనను గమనించిన ఈశ్వరి 'ఏం లేదమ్మా లతా! మొన్న బాబు ఇక్కడికి వచ్చి వెళ్లాడు. బానే వున్నాడులే. శ్రీశైలం వెళ్లొస్తాడంట. కంగారుపడకు నేను చెప్తాలే' అన్నది. శ్రీశైలం వెళ్లాడని తెలిసి, హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఆరోగ్యం బాగోలేదని తనకు చెప్పిన భర్త మాటలు గుర్తొచ్చి లత ఆదుర్దా పెరిగిపోయింది. వెంటనే తన కుటుంబ మిత్రుడు శ్రీశైలంలో ఉన్న సాయిలుకు ఫోన్‌ చేసింది.
'గత రాత్రి శంకర్‌తో 10:30 గంటల వరకు ఉన్నాను. బాగానే వున్నాడు అక్కా.. మీరు కంగారు పడొద్దు. నేను వెళ్లి ఫోన్‌ చేయిస్తా!' అని లతకు చెప్పి, శంకర్‌ బస చేసిన రూమ్‌కు సాయిలు వెళ్లాడు.
సాయిలు ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్న లత మనసు పరిపరివిధాల పోతుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గతంలో ఒకసారి వారం, పది రోజులు ఫోన్‌ ఎత్తకుండా అందరికీ దూరంగా వున్న శంకర్‌ మళ్లీ పూర్వస్థితికి చేరాడేమోనని దిగులు కమ్మేసింది. నిముషమొక యుగంలా గడిపింది. సాయిలు ఫోన్‌ మోగటంతో కంగారుగా ఫోన్‌ ఎత్తింది. 'అక్కా! కంగారు లేదు. భయపడొద్దు. సార్‌కు కాస్త ఆరోగ్యం బావున్నట్లు లేదు. మీరు బయల్దేరి, శ్రీశైలం రండి' అనడంతో గుండెల్లో బండ పడినట్లుంది.
'ఏమైంది...ఏమైంది?' అని అడుగుతున్నా..
సాయిలు 'ఏం లేదక్కా, మీరు రండి!' అని ఫోన్‌ పెట్టేశాడు.
దిక్కుతోచని స్థితిలో పడిపోయింది లత. నిన్ననే పాపను హాస్టల్లో దింపి వచ్చింది. బాబు దూరంగా హాస్టల్లో వున్నాడు. సాయిలు అందరినీ బయలుదేరమంటున్నాడు. ఏం చేయాలో, ఏం జరిగిందో తెలీక బెంబేలు పడిపోయింది.
ఇంతలో హైదరాబాద్‌ వెళ్లిపోతున్నారని లతను పలకరించాలని ఫోన్‌ చేసింది తన చిన్నత్తయ్య. ఆమె పలకరించగానే, అప్పటిదాకా బిగపెట్టుకున్న దు:ఖం కట్టలు తెంచుకుంది. ఆమె విషయం చెప్పింది. లతకు ధైర్యం చెప్పి, సాయిలు నెంబర్‌ తీసుకొంది.
ఆమె సాయిలుకు ఫోన్‌ చేసింది. తొమ్మిదింటికే తన పెదబిడ్డలాంటి శంకర్‌ ఉరి వేసుకొని, చనిపోయిన వార్త తెలుసుకుంది. ఈ విషయం లతతో ఎలా చెప్పాలో తెలియక కొంచెం సేపు ఆమె సతమతమైంది. చివరకు ధైర్యంచేసి లతకు విషయం చెప్పి, బిడ్డలను తీసుకుని బయల్దేరమని చెప్పింది. దగ్గరలో వున్న తాను శ్రీశైలం వెళ్లి, విషయం కనుక్కొంటానని ఓదార్చి, తన బాధ్యతను నిర్వర్తించింది.
ఆ మాటలు విన్న లత తానేమి విన్నదో, ఎక్కడ ఉన్నదో ఏం జరుగుతున్నదో కాసేపు అర్థం కాలేదు. గరళం లాంటి నిజాన్ని నమ్మలేక, ఏమి చేయాలో పాలుపోక అయోమయస్థితిలో పడిపోయింది. కొద్దిసేపటికి తేరుకుంది. తను చేయ్యాల్సిన పనులు ఆలోచించింది. 'నాన్నకు బాగోలేదు. మనం నానమ్మ ఊరు వెళ్లాలి!' అని పాపకు ఫోన్‌ చేసి, రమ్మని చెప్పింది. దూరంగా ఉన్న బాబుకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మిత్రుడు కంటే ఎక్కవైన తండ్రి మరణం వాడెలా జీర్ణించుకుంటాడో అర్థం కాలేదు. వాడు రావాలంటే.. కనీసం 18 గంటల వ్యవధి కావాలి. అలాంటిది ఈ నిజం తెలిసి అంతసేపు ఒంటిరిగా ఎలా ఉంటాడు? బిడ్డ సున్నితత్వం గుర్తొచ్చి, గుండె పిండినట్లైంది. తనను తాను సంభాళించుకొని, బాబుకు ఫోన్‌ చేసి 'నాన్నకు ఆరోగ్యం బాలేదు. హాస్పిటల్లో వున్నాడు. మన సహాయం కావాలి. రావటానికి వీలవుతుందా బాబూ?' అనడిగింది.
'అమ్మా! ఇప్పుడు బయల్దేరినా రాత్రి 2,3 అవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు బయల్దేరినా తెల్లవారి 5 గంటలకు అక్కడ వుంటానమ్మా! అర్జెంట్‌ అంటే ఇప్పుడే బయల్దేరతా. లేదంటే సాయంత్రం బయల్దేరతా!' అన్నాడు. రెండు నిమిషాలు ఏం మాట్లాడాలో తెలియలేదు..'సరే..సాయంత్రం బయల్దేరు బాబూ! టెన్షన్‌ ఏం లేదు!' అంటూ సర్దిచెప్పి, కూలబడింది. తన పర్సులో మూడు వేలు తప్ప, డబ్బులు కూడా లేవు. ఆఫీసు డబ్బులు ఇరవై వేలు ఉన్నా, తాకే ధైర్యం లేదు. ఊరిలో ఉన్న ఆప్తులు అమన్‌, జ్యోతికి ఫోన్‌ చేసి కారు తీసుకురమ్మని, అర్జంటుగా శ్రీశైలం వెళ్లాలని చెప్పింది. అమన్‌ 'సరే అక్కా! విషయం ఏమిటి?' అని అడిగాడు. శంకర్‌కు బాగోని విషయం చెప్పి, రెండు రోజులుండేలా బయల్దేరమని చెప్పింది. పదిహేను గంటల కారు ప్రయాణం కాబట్టి అమన్‌ తనకు తోడుగా నర్సింగ్‌ను తీసుకొచ్చాడు. ఈ లోపు గబగబా బట్టలు కుక్కుకొని, తాళం వేసి అప్పుడే హాస్టలు నుండి వచ్చిన పాపతో రోడ్డుపై నిలబడింది లత.
నిముషమొక యుగంలా కారు కోసం ఎదురుచూస్తుంది. తన జీవితం రోడ్డున పడిందనే దానికి తార్కాణంలా వుంది అనిపించింది లతకి. మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో లతకి ఎడతెగని ఫోన్లు. విచారింపులు, పలకరింపులు. తండ్రి, తమ్ముడు, అక్క, చెల్లికి కూడా స్వయంగా చెప్పలేని స్థితి లతది.. వాళ్లకు విషయం తెల్సి, ఫోన్‌ చేస్తే లతకి ఎత్తక తప్పలేదు. లేని ధైర్యం నటిస్తూ లత పాపతో బయల్దేరినట్లు తెలియజేసింది. అరగంటలో అమన్‌, నర్సింగ్‌ వచ్చారు. పది గంటలకు కారు బయల్దేరింది. కారులో అందరి మధ్య మౌనం. ఏమి జరిగిందో తెలీదు. జరిగింది నిజమని నమ్మలేని స్థితి. ఎదుటివారికి ఏమి తెలుసో ఏమిటో తెలియదు. ఎవర్ని కదిలించినా ఆగని దు:ఖం. అలాగే ప్రయాణం సాగించింది. కాసేపట్లోనే వస్తున్న ఫోన్లు, లత విచారం చూసి, జరగరానిది ఏదో జరిగిందని పాప అర్థం చేసుకుంది.
పద్దెనిమిదేళ్లకే అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో తెలీదు. పాప తల్లిని ఓదార్చింది. అన్నకు అనుమానం రాకుండా ఫోన్‌ మాట్లాడింది. వరసగా వస్తున్న ఫోన్లు అమ్మకు ఇవ్వకుండా తనే సమాధానం ఇస్తుంది. ఇవన్నీ గమనిస్తూ ఆశ్చర్యపోవడం లత వంతైంది. ఇక అప్పటి నుండి ఏమి జరిగిందో, ఎలా జరిగిందో ప్రయాణం..
ొొొ
అతి కష్టం మీద రాత్రి పదకొండు గంటలకు తన అత్తింట మోయలేని దు:ఖంతో అడుగు పెట్టింది లత. వయసు మళ్లిన తల్లిని, వయసొచ్చిన బిడ్డను, ఆప్తుడైన కొడుకును, చివరివరకూ తోడుండాల్సిన భార్యను అందరినీ వదిలి వెళ్లిన భర్తను తలచుకొని లత శోకానికి మారుపేరైంది. ఏమి చేశామని తమందరికీ ఇంత శిక్ష వేశాడో తెలీని భర్తను వేల వేల ప్రశ్నలతో లత మనసులోనే ప్రశ్నించుకుంది. గతమంతా గుర్తొచ్చి, వేదనతో కుమిలిపోయింది. ఉదయమే వచ్చే కొడుకునెలా ఓదార్చాలో అర్థంకాక పరిపరివిధాలా లత తల్లిడిల్లిపోయింది. భారంగా రాత్రి గడిచింది.
అన్నింటికీ అతీతంగా కాలం తన పని తాను చేసుకుపోతుంది. రెండవరోజు శనివారం, గుడిసత్రంలో ఆత్మహత్య చేసుకోవటంతో పోస్టుమార్టం ఆరోజు కాలేదు. కనుక మరునాడు మధ్యాహ్నానికి ప్రాణం లేని శంకర్‌ను ఇంటికి తీసుకొస్తారని తెలిసి, నిర్లిప్తంగా కూర్చుంది లత. ఏమీ తెలియని నంగనాచిలా మరో ఉదయం భళ్లున తెల్లారింది. కొడుకు వచ్చాడు. ప్రయాణంలోనే తండ్రి మరణం గురించి తెలుసుకుని, నిర్ఘాంతపోయాడు. కన్నీరైన పెట్టకుండా వచ్చి, తల్లి ముందు నిలబడ్డాడు. లత బద్ధలవుతున్న తన గుండెను అదిమిపెట్టుకొని, బిడ్డలిద్దరినీ అక్కున చేర్చుకొని, విషయం చెప్పి బోరుమంది. తండ్రి మరణమే జీర్ణించుకోలేనివాడు, బలన్మరణం పొందాడని తెలిసి లత కొడుకు నిశ్చేష్టుడయ్యాడు. బహుశా వాడి తలలో వెయ్యి విస్ఫోటనాలు జరిగి ఉంటాయని అనుకుంది లత. తనను అనుక్షణం వేలుపట్టి నడిపి, ఎన్నో జీవిత పాఠాలు నేర్పిన తండ్రి, గురువు, తన ప్రాణం, సర్వస్వం ఇలా ఎలా అయ్యాడో అర్థంకాక, బయటకు చెప్పలేక లత కొడుకు అలా కూలబడిపోయాడు.
చివరకు శంకర్‌ వచ్చాడు నిర్జీవంగా. బాక్సులో వున్న శరీరం. తాకటానికి లేదు. అస్పష్టమైన చివరిచూపు. అయినా సరే కొడుకు తండ్రి శంకర్‌ను కడసారిగా రెండున్నర గంటలపాటు అలా నిలబడి మొహంలోకే సూటిగా చూస్తూ నిలబడే ఉన్నాడు. 'బహుశా ఇలా ఎలా ఎందుకు చేశావు నాన్నా?' అని ప్రశ్నిస్తున్నాడేమో అనుకుంది లత కొడుకునే చూస్తూ.
'ముప్పైఆరు గంటల ఎదురుచూపు తర్వాత నిర్జీవ శంకరాన్ని కేవలం రెండు గంటలు ఉంచి, తీసుకెళ్లిపోయారు. అన్ని తంతులూ యాంత్రికంగా జరుగుతున్నాయి. మా మెదళ్లు, గుండెలు, మనసులు మాత్రం అలమటిస్తున్నాయి. ఘట్టం ముగిసింది. జీవితంలో కొడుకు, భర్త, తండ్రి పాత్రలు పోషిస్తూ.. పోరాడే శక్తి లేక చేతులెత్తేసి అందరికీ ఎన్నో ప్రశ్నలు వదిలేసి, ముగించుకుని వెళ్లిపోయాడు శంకర్‌!' నిర్లిప్తగా తనలో తానే అనుకుంటోంది లత.
లత ప్రమేయం లేకుండానే మరునాటి కార్యక్రమాలు.. బంధుజనం, స్నేహితులు వస్తూ పోతూ ఉన్నారు. అందరూ ఓదారుస్తూ ధైర్యం చెప్తున్నారు. అయినా జనం అనుకుంటున్న మాటలు లత చెవులకు తాకుతూనే వున్నాయి. అవన్నీ వినాలనో, వినొద్దు అనో కానీ నిరభ్యంతరంగా, నిస్సిగ్గుగా, కాస్తంత మానవత్వమైన లేకుండా అనేస్తున్నారని లత మనసు బాధపడింది.
'శంకర్‌ ఎంత మేధావో! ఎంత నిరాడంబరుడో! చదువులో ఎంత చురుకో! కుటుంబం పట్ల ఎంత ప్రేమ, ఆపేక్ష చూపుతాడో!' ఇలా అతని గురించి చెప్పింది చెప్పకుండా చెప్తున్నారు. 'ఆర్థిక సమస్యలతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఆశ్చర్యపోతున్నాం. అన్ని అప్పులెలా అయ్యాయో!' అసలేమీ తెలీనివారు విచక్షణ మరిచి మరీ అనేస్తున్నారు. లతకు ఒక్కోటి బాణంలా తాకుతున్నా.. మౌనంగా రోదిస్తూ నిస్సహాయంగా ఉంది. అన్నీ తెలిసినా సమాధానం చెప్పలేని స్థితిలో కుటుంబ సభ్యులున్నారు.
ఇంకొందరు మరో ఆకు ఎక్కువ తిన్నట్టున్నారు.. అన్నీ దగ్గరుండి చూసినట్లు.. 'షేర్లు, బెట్టింగ్‌లు అంట.. తాగుడు, గుప్త నిధుల కోసమే వెళ్లాడంట..' ఇలా పొంతన లేని మాటలతో చనిపోయిన వ్యక్తిని పదేపదే చంపేస్తున్నారు. అవన్నీ వినలేక.. విన్నా చేసేదేమీ లేక లత మరింతగా కుంగిపోయింది. కార్యక్రమాలు ముగిసి, అందరూ వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ తమ శక్తి మేర బాధిత కుటుంబంపై అపవాద బండలు వేసి, చక్కాపోయారు. ఇక అప్పులవాళ్లు ఒక్కొక్కరూ బయటకు రాసాగారు. ఒక్కరికీ పత్రం లేదు.. నమ్మకంపై ఇచ్చామంటున్నారు. 'పదేళ్ల నుండి వడ్డీలు కట్టాడు, రెండేళ్ల నుండి వడ్డీ లేదు, అసలు లేదు' అని చెప్పటం మొదలెట్టారు. ఏవి నిజాలో, ఏమి అబద్ధాలో అర్థంకాక ఉన్న ఆస్తులకు, అప్పులకు పొంతన కుదరక లత తల బద్దలైపోతుంది. మానసిక కుంగుబాటులో ఉన్న భర్తను కాపాడుకోలేక పోయినందుకు బాధపడాలో, ఈ అప్పులోళ్లని చూసి, ఈ స్థితికి తెచ్చినందుకు శంకర్‌ను ఏమనాలో లతకు తెలీలేదు. లతకి గతమంతా కళ్ల ముందు కదలాడింది.
ొొొ
లతది దిగువ మధ్య తరగతి కుటుంబం. చిన్నపాటి వ్యవసాయం, స్వంతంగా చిన్న వ్యాపారం ఉన్న రంగయ్య, రాధమ్మ దంపతులకు ఐదుగురు పిల్లలు. అంచెలంచెలుగా ఎదుగుతూ తమకంటూ సమాజంలో ఒక స్థాయిని తెచ్చుకుని, పిల్లల్ని తీర్చిదిద్దారు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థంచేసుకుని, వీలైనంత తోడ్పడుతూ పెరిగింది లత. అక్క, అన్న, తమ్ముడు, చెల్లికి భిన్నంగా ఉండే వ్యక్తిత్వంతో తనకు నచ్చిన పంథాలో స్వేచ్ఛగా ఎదిగింది లత. అక్క, అన్నకున్న బాధ్యతలు, తమ్ముడు, చెల్లికి వున్న బంధాలు లతకు మాత్రం ఎప్పుడూ ఆటంకాలుగా మారలేదు. ఎన్‌సిసిలో పని చేసింది. చదువుకుంటూనే వ్యాపార బాధ్యతలతో స్వతంత్రంగా ఎదిగింది. డిగ్రీ, పీజీ అయ్యేటప్పటికే సౌత్‌, నార్త్‌ ఇండియా చుట్టేసింది. దాంతో పెళ్లి పట్ల ప్రత్యేక ఆలోచనలు, అభిప్రాయాలు లేకపోవడంతో తన సహవిద్యార్థులు, ఎవరైనా వివాహ ప్రతిపాదనలు తెచ్చినా అంగీకరించలేదు. ఒక రకంగా లత ఫైర్‌బ్రాండ్‌లానే ఉండేది.
తల్లి స్వయంగా వరుడ్ని ఎన్నిక చేసినా, అప్పటికే అక్క వివాహ ఒడిదుడుకులు చూసి, కాదనలేకపోయింది. పైగా ఎవ్వరితోనైనా సర్దుకుపోగల, అవసరమైతే మార్చుకోగల సత్తా వుందనే ఆత్మ విశ్వాసంతో శంకర్‌తో పెళ్లికి అంగీకరించింది. 20 రోజుల్లో పెళ్లి అనగా తండ్రి.. 'నీకు వేరే అభిప్రాయముంటే చెప్పమ్మా!' అని అడిగినా 'మీకిష్టమైతే నాకిష్టమే!' అందరి ఆడపిల్లల్లానే బదులిచ్చింది. ఫలితంగా శంకర్‌తో వివాహమైపోయింది.
ఇక శంకర్‌ కుటుంబ నేపథ్యం చూస్తే.. భూస్వామ్య కుటుంబం.. ఒక్కడే కొడుకు.. అల్లారుముద్దుగా పెరిగాడు. చదువులో చురుకుగా వుంటూ డబ్బుకు మాత్రం కొదవ లేకుండా ఏ బాదరబందీని దరికి రానివ్వకుండా ఆనందంగా చదువు కొనసాగించాడు. ఇంటర్‌ స్థాయి నుండి ఇంటికి దూరంగా ఉండటంతో ఇంట్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు అతనికి తెలిసేవి కాదు. దాంతో అతనికి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరమూ రాలేదు. ఇంట్లో కుటుంబసభ్యుల ప్రేమాభిమానాలు ఎక్కువ పొందింది శంకరనే చెప్పాలి. పూర్తి దృష్టి చదువుపైనే పెట్టి, టాపర్‌గా ఉండేవాడు. మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా, సరైన గైడెన్స్‌ లేక స్థిరపడలేదు. తనకున్న తెలివితేటలు చూసి అన్నీ అతనికే తెలుసనే నమ్మకంతో తల్లిదండ్రులూ ఒత్తిడి తేలేదు. దాంతో చూస్తుండగానే వివాహ వయస్సుకు వచ్చాడు. బంధువుల మధ్యవర్తిత్వంతో వచ్చిన సంబంధాన్ని ఒప్పుకుని చేసుకున్నాడు. సహజంగా నిరాడంబరుడు, అతిశయం లాంటివి లేకపోవడంతో కట్నకానుకల చర్చలు పెద్దగా జరగలేదు. అదేంటో లత కూడా ఏమీ ఆశించలేదు. పెళ్లప్పటికీ స్థిరమైన ఆదాయం వచ్చే ఉద్యోగం లేకపోయినా తగిన అర్హతలున్నాయంటూ.. లత తల్లిదండ్రులు అభ్యంతర పెట్టలేదు. వివాహ అనంతరం లతకు, శంకర్‌కు విభిన్న కుటుంబ నేపథ్యాలు.. బిన్న మనస్థత్వాల రీత్యా సర్దుకుపోవటానికే కొంత కాలం పట్టింది. వడ్డించిన విస్తరి జీవితం శంకర్‌ది.. కష్టపడి పైకొచ్చిన కుటుంబం లతది. కానీ ఇద్దరికీ కుటుంబం పట్ల ఉన్న ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయేలా చేసింది. పెళ్లయిన నాలుగేళ్లకు బాబు, ఏడేళ్లకు పాప పుట్టారు. వాళ్లకు పదేళ్లు వచ్చే వరకు సంసారం సాఫీగానే సాగింది. ఈ కాలంలో శంకర్‌ స్థిరంగా ఒక ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ చేయలేదు. లత కొంతకాలం రకరకాల ఉద్యోగాలు చేసినా పిల్లలకు ఐదారేళ్లు వచ్చే వరకూ గృహిణిగా ఉండిపోయింది. ఈ క్రమంలో శంకర్‌ చిన్న చిన్న ఆదాయమార్గాలు చూశాడు. లతకు తల్లిదండ్రులు ఇచ్చిన స్థలం, పొలం కరిగిపోయాయి. కొడుక్కి పదకొండేళ్ల వయస్సులో శంకర్‌ పెద్ద పొరపాటు చేశాడు. లత తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు తనూ కోర్టు బోను ఎక్కాల్సి వచ్చింది. దాదాపు ఆరేళ్లు సివిల్‌ కేసు నడిచింది. ఆర్థికంగా చితికిపోయారు. ఆర్థికంగా తేరుకోవడం కోసం ఊరికి దూరంగా వెళ్లి, తన బంధువులతో కలిసి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు శంకర్‌. శంకర్‌ స్వతహాగా బిడియస్తుడు, అంతర్ముఖుడు అవ్వడం వల్ల, లౌక్యం లేకపోవడంతో ఆ వ్యాపారంలో సరిగా స్థిరపడ లేకపోయాడు. పిల్లలు ఎదుగుతున్నారు. ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో, ఇంట్లో లతతో కూడా చెప్పకుండా శంకర్‌ అప్పులు తెచ్చి, కుటుంబం నడపటం ప్రారంభించాడు. ఎవరి దగ్గర తక్కువ కాకూడదనీ ఎవరితోనూ చెప్పకుండా కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాడు శంకర్‌. లత ప్రశ్నించినప్పుడల్లా శంకర్‌ కోప్పడి, ఆమె నోరు మూయించేవాడు. లతకు ఏమి జరుగుతుందో అర్థమయ్యీ, కాక.. ఎవ్వరికీ చెప్పుకోలేక తనలో తనే మదనపడుతూ ఉండేది. ఎదిగే పిల్లల ముందు ఘర్షణ పడటం ఇష్టంలేక సర్దుకుపోవటం.. చేతనైన సహాయం చేయటం ప్రారంభించింది లత. లత పేరనున్న మరొక ఖరీదైన ఎకరం అమ్మకం కూడా జరిగిపోయింది. హైదరాబాద్‌ కేసు నుండి బయటపడి, ఊపిరి పీల్చుకునేలోపు మరొక సివిల్‌ కేసులో ఇరుక్కున్నాడు శంకర్‌. అది నాలుగేళ్లు నడిచింది. వరుస నష్టాలు, అప్పులు పెరిగాయి. లతకు తెలిసి చేసిన అప్పులు కొన్ని, తెలియక చేసిన అప్పులు మరికొన్ని తడిసి మోపెడయ్యాయి. శంకర్‌ శక్తి మేరకు వడ్డీలు కట్టుకుంటూ వచ్చాడు. అయితే ఈ లావాదేవీలేవీ ఎవరితోనూ, ఏనాడూ శంకర్‌ పంచుకోలేదు. ఆ బాధలన్నీ తనే పడ్డాడు..
అన్నింటికీ డబ్బే పరిష్కారం అనుకున్నాడు శంకర్‌. తన వల్ల కుటుంబంలో కలతలు పెరుగుతున్నా సంపాదనే మార్గమని భావించాడు. ఆ వయసులో ఎక్కడా ఉద్యోగం రాదు, వచ్చినా సరిపోదు. అప్పుడే శంకర్‌ని షేర్‌ మార్కెట్‌ ఆకర్షించింది. పెట్టుబడి కొంచెంగా పెట్టి, కొంత లాభాలు చవి చూసేటప్పటికే శంకర్‌కి దానిపై మరింత నమ్మకం పెరిగింది. దీంతో శంకర్‌ విపరీతంగా అప్పులు తెచ్చి, పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయాడు. లతకు చెప్తే భరించలేదని దాచిపెట్టి, మరోసారి అప్పుల మార్గం పట్టాడు. లతకు మాత్రం లాభాలు చూపిస్తూ, నమ్మిస్తూ కొంతకాలం విశ్వ ప్రయత్నాలు చేశాడు.
షేర్‌ మార్కెట్‌లో అనుభవం ఉన్న తన బాబాయి సహాయంతో శంకర్‌ మరోసారి షేర్‌ బిజినెస్‌ మొదలుపెట్టారు. ఆయన గైడెన్స్‌లో కొంతకాలం సవ్యంగా సాగింది. ఇంతలో మరో కుదుపు.. కరోనా రూపంలో వచ్చిపడింది. దాంతో బిజినెస్‌ మళ్లీ తలకిందులైంది. ఓటమి తప్ప, గెలుపు రుచి చూడకపోవడంతో శంకర్‌లో ఆత్మవిశ్వాసం దెబ్బతింది. దాంతో శంకర్‌ మానసికంగా బాగా కుంగిపోయాడు. ఆ పరిస్థితుల్లో శంకర్‌ అందరికీ దూరంగా కొంతకాలం ఒంటరిగా గడిపాడు. లత వెంటనే కొడుకుని శంకర్‌ వద్దే ఉండేలా చేసింది. అలా కొడుకు వెన్నంటి ఉండడంతో శంకర్‌ కొంత కోలుకుని, మామూలు స్థితికి వచ్చాడు. కానీ శంకర్‌లో ఏదో తెలియని బాధ, ఒకరకమైన అపరాధభావం కనబడేది. లత అర్థం చేసుకొని, కూర్చోబెట్టి ఎంత మాట్లాడినా శంకర్‌లో మార్పు కనిపించలేదు. దాంతో శంకర్‌ బాబాయిని పిలిపించి, లత పరిస్థితి ఆయనకు వివరించింది. ఆయన 'ఆస్తులు, పొలాలు అమ్మి, అప్పులు తీర్చుకుని, హాయిగా జీవించు!' అని శంకర్‌కి సలహా ఇచ్చాడు. కానీ శంకర్‌ మాత్రం అప్పుడు కూడా తనకున్న అప్పులు ఏమిటో పూర్తిగా బయటపెట్టలేదు. లత కూడా ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గించి, శంకర్‌కు తోడుగా నిలచింది. చిన్న ఉద్యోగంలో చేరి, కుటుంబపోషణకు బాసటగా నిలిచింది. శంకర్‌ తనకున్న పొలం అమ్మడంలో సమస్యలు ఎదురయ్యాయి. దాంతో కాలం గడుస్తున్నకొద్దీ వడ్డీలు పెరిగిపోయాయి. ఈ లోపు శంకర్‌ తన వద్ద ఉన్న కొద్ది డబ్బూ షేర్స్‌లో పెట్టి, పోగొట్టుకున్నాడు. దాంతో శంకర్‌ పూర్తిగా కుంగిపోయాడు. లతా, పిల్లలకు శంకర్‌ దూరంగా ఉన్నాడు. శంకర్‌ తన తల్లి దగ్గరే మూడు నెలలు ఉన్నాడు. ఊరిలో అందరితో గడిపాడు. బహుశా అప్పటికే శంకర్‌ జీవితంపై విరక్తి పెచుకున్నాడేమోనని లతకు ఇప్పుడు అనుమానం వస్తోంది.
కొడుకు బతిమాలినా, లత చెప్పినా 'ఇదిగో వస్తా, అదిగో వస్తా!' అంటూ శంకర్‌ దాటేశాడు. కుటుంబం తప్ప మరో ప్రపంచంలేని శంకర్‌ అలా ఉండటం చూసి, లత కంగారు పడుతూనే ఉంది. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆమెది. శంకర్‌ని కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసి, విఫలమైంది. శంకర్‌లో ఆధ్యాత్మిక చింతన పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో లతకు ఏమి చెయ్యాలో అర్థంకాక, పిల్లల కోసం తనే ఏదైనా చేయాలని.. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చివరికి లతకు హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. ఈ విషయమే శంకర్‌కు చెప్పి, తనకు తోడుగా రమ్మని కోరింది. శంకర్‌ ఊరి నుంచి వచ్చాడు. 'నిన్ను బాధపెట్టినందుకు క్షమించు!' అని కోరాడు. 'అయ్యిందేదో అయిపోయింది. మళ్లీ కొత్త జీవితం మొదలుపెడదాం. పొలాలు అమ్మి, అప్పులు తీర్చుకుందాం. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. మూడేళ్లలో స్థిరపడతారు. ఇక ఇబ్బందులేమీ వుండవులే!' అని లత శంకర్‌ని ఓదార్చింది. శంకర్‌ కూడా సరే అన్నాడు. తానూ ఏదో ఒక పని చూసుకుంటానని చెప్పాడు. మళ్లీ ఊరు వెళ్లాడు. వారం ఎదురుచూసింది. అయినా రాలేదు. సరే హైదరాబాద్‌ వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేయమని శంకర్‌ను అడిగేందుకు పదే పదే ఫోన్‌ చేస్తూనే ఉంది. కానీ శంకర్‌ నుంచి ఎలాంటి స్పందనా లేదు. చివరకు లత జీవితం నుంచి శంకర్‌ శాశ్వతంగా నిష్క్రమించాడు.

చదువులో ఎన్ని తెలివితేటలున్నా, కుటుంబం పట్ల ఎంత ప్రేమ ఉన్నా ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళిక లేకపోవడంతో శంకర్‌ జీవితం అలా ముగిసిపోయింది. తాను చేసిన తప్పొప్పులు సహచరితో చర్చించ లేకపోవడం.. సమాజంలో లౌక్యంగా మెలగలేకపోవడం.. ఎవ్వరితో చొరవగా మాట్లాడి సహాయసహకారాలు పొందలేకపోవడం.. ఒకరకంగా చేతకాని ఒంటరి పోరాటం చేసి, శంకర్‌ ఓడిపోయాడు. చివరికి బలవన్మరణం పొందాడు. అయినా పోరాడి, గెలవాలి అనుకోలేదు. ఫలితం సమాజానికి ఎన్నో అపోహలు, నిందలు వేసే అవకాశం ఇచ్చాడు. తనకున్న మంచి గుణాలన్నీ వృథా అయిపోయాయి. తను ఎంతో ప్రేమించే తల్లి, భార్య, పిల్లలకు పెద్ద శిక్ష వేశాడు. లత తను చేయని తప్పుకు ఎందరికి సమాధానం చెప్పుకోవాలో.. ఇక ముందు ఈ కథ ఎలాంటి మలుపు తిరగనున్నదో కాలమే చెప్పాలి. మన చుట్టూ ఇలాంటి చాలా మంది శంకర్‌లు ఉన్నారు. గమనించి, వెంటపడి వేధించకండి. వీలైతే ఆ మనోదౌర్భల్యం నుండి బయటపడటానికి మీ వంతు సహకరించండి. ఇప్పుడు లత సర్వశక్తులూ కూడదీసుకుని, తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం మొదలుపెట్టింది.

జనిత
9490099006