Sep 10,2023 13:37

పొద్దుని పొడుస్తూ.. గోరువెచ్చని సూరీడు
తన లేలేత కిరణాలను ప్రసరిస్తూ
పారిశుద్ధ్య కార్మికులను
ఆప్యాయంగా పలకరిస్తూ..
వాకింగ్‌ ప్రియులను అలరిస్తూ..
భళ్ళున తెల్లవారినా.. భయంలేని బతుకులను..
గవాక్షాల ఊచలను చీల్చుకుంటూ..
దర్వాజాల తెరచాటులను
తోసుకుంటూ.. తట్టిలేపుతూ...
ఈ మనుషులెప్పుడూ ఇంతే!
నాలా సమయపాలన లేదని తిట్టుకుంటూ...
తల్లులను ఇంటి పనికి..
పిల్లలను బడులకు..
తండ్రులను ఆఫీస్‌ పనికి నెట్టేసి..
నడినెత్తి మీదకు చేరుకొని
కోపంతో విలయతాండవం చేస్తూ
వాడి వేడి కిరణాలను కొరడాల్లా
ఝళిపిస్తూ.. కోపంతో రగిలినా..
మళ్ళీ.. బడిగంట కొట్టగానే
కర్తవ్యం గుర్తొచ్చి చల్లబడుతూ
పిల్లలను, ఉద్యోగులను ఇంటికి చేర్చుతూ..
పొద్దు గూకే వేళకు వీడ్కోలు పలుకుతూ..
ఆవల ఉన్న మరో సమూహాన్ని
తట్టి లేపడానికి సిద్దమవుతూ
మన సూరీడు.. సుక్కెదురు లేని
సువిశాల సృష్టికి ఆదిమూలం..
అవిరామం.. అజరామరం !!!
 

న్యాలకంటి నారాయణ
9550833490