Apr 06,2023 16:48

ఇంటర్నెట్‌డెస్క్‌ : టెక్‌ దిగ్గజం అమెజాన్‌ ఉద్యోగుల ఉద్వాసన పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ కంపెనీ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గతేడాది 9 వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వంద మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. తాజాగా తొలగించిన వంద మంది ఉద్యోగులు గేమింగ్‌ విభాగంలోని వారని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక తెలిపింది. ఈ ప్రభావం ప్రైమ్‌ గేమింగ్‌, గేమ్‌ గ్రోత్‌, శాన్‌ డియాగో స్టూడియోలలో పనిచేస్తున్న ఉద్యోగులపైనా పడనుంది. ఈ సమాచారాన్ని ఉద్యోగులకు తెలియజేసినట్లు అమెజాన్‌ గేమ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టోఫ్‌ హార్ట్‌మన్‌ వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా క్రిస్టోఫ్‌ హార్ట్‌మన్‌ మాట్లాడుతూ... 'మా కంపెనీ అంతర్గత అభివృద్ధికి దోహదపడేలా మేము పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాం. ప్రస్తుతం మాకున్న వనరులు కంటెంట్‌పై దృష్టిపెట్టేందుకు మద్దతు ఇచ్చేలా సహాయపడతాయి. రాబోయే రోజుల్లో మా ప్రాజెక్టులు పురోగమిస్తున్నకొద్దీ మా బృందాలు కూడా పెరుగుతూనే ఉంటాయి' అని అన్నారు.
కాగా ఈ గేమ్‌ స్టూడియోస్‌ బాస్‌ మైక్‌ ఫ్రాజినీ గత సంవత్సరమే ఈ కంపెనీ నుంచి వైదొలిగారు. ఇక శాన్‌ డియాగో స్డూడియో ఆఫీస్‌ని నిర్వహణలో కీలకంగా ఉన్న గేమింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాన్‌ స్మెడ్లీ ఈ ఏడాది జనవరిలోనే ఈ కంపెనీ నుంచి వెళుతున్నట్లు ప్రకటించారని క్రిస్టోఫ్‌ హార్ట్‌మన్‌ పేర్కొన్నారు.