Aug 10,2023 07:02

           వాతావరణ సంక్షోభం తీవ్రంగా ముంచుకొస్తున్న తరుణంలో అమెజాన్‌ అడవుల పరిరక్షణ కోసం దక్షిణ అమెరికా దేశాలు ఒక ఒప్పందానికి రావడం ఆహ్వానించదగిన పరిణామం. బ్రెజిల్‌లోని బెలెమ్‌ నగరంలో సమావేశమైన ఈ దేశాల నేతలు అమెజాన్‌ పరిరక్షణ కోసం ఒక కూటమిగా వ్యవహరించాలని నిర్ణయించడం ఒక ముందడుగుగా చెప్పవచ్చు. నిజానికి అమెజాన్‌ కోపరేషన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (ఎసిటిఓ) పేరుతో ఈ దేశాలు కొన్ని దశాబ్దాల క్రితమే ఒక కార్యాచరణను రూపొందించుకున్నప్పటికీ అడుగుముందుకు పడలేదు. 14 సంవత్సరాలుగా ఈ దేశాలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దీనిని బట్టే అమెజాన్‌ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడు లూలా డసిల్వా చొరవతో జరిగిన తాజా సమావేశంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అమెజాన్‌ అడవుల పరిరక్షణ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం కావడం, దాని కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించడం, ఈ కృషికి కలిసి రావాలని అమెరికాతో సహా ఇతర ధనిక దేశాలను సంయుక్తంగా కోరడం వంటి అంశాలు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో కీలకంగా మారనున్నాయి.
          ఏడాదికి సగటున 3,800 చదరపు మైళ్ల అమెజాన్‌ అడవి విధ్వంసానికి గురవుతోంది. గత శతాబ్ద కాలంలో 20 శాతం ఈ అడవుల విస్తీర్ణం తగ్గింది. ఫలితంగా మూలవాసులైన స్థానిక తెగల ప్రజల ఉనికి సైతం ప్రశ్నార్ధాకంగా మారింది. లూలాకు ముందు బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఉన్న బోల్సనారో కార్పొరేట్‌ శక్తులతో చేతులు కలిపి పెద్ద ఎత్తున అమెజాన్‌ విధ్వంసానికి పాల్పడ్డారు. అభివృద్ధి పేరుతో ఆయన అటవీభూమిలో విచ్చలవిడిగా మైనింగ్‌ కార్యక్రమాలకు అనుమతిచ్చారు. 1970వ దశకం నుండి ఉన్న పర్యావరణ చట్టాలను నీరుగార్చారు. ఆయన నాయకత్వంలోని చివరి ఏడాది (2022)లోనే 50 లక్షల ఎకరాల్లోని అడవులను నరికివేశారంటే ఏ స్థాయిలో విధ్వంసం సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నరికివేత ప్రభావం బ్రెజిల్‌పై తీవ్రంగానే పడింది. అతివృష్టి, అనావృష్టులతో ఆ దేశం అతలాకుతలమైంది. ఈ ఏడాది జనవరిలో అధికారం చేపట్టిన లూలా మైనింగ్‌ను నియంత్రించడంతో పాటు, స్థానిక ప్రజలను చైతన్యం చేయడం ద్వారా నరికివేత వేగానికి కళ్లెం వేయగలిగారు. 2030 నాటికి అమెజాన్‌ నరికివేతను నూరుశాతం అరికట్టాలని లక్ష్యంగా ప్రకటించారు. బెలెమ్‌ నగరంలో జరిగిన దక్షిణ అమెరికా దేశాల సమావేశ ప్రారంభంలో భద్రమైన భవిష్యత్‌కోసం అమెజాన్‌ను కాపాడుకుని తీరాల్సిందేనన్న లూలా ఉద్ఘాటన వాతావరణ మార్పులపై ఆయన నిబద్ధతకు నిలువెత్తు దర్పణం పడుతోంది.
         భూ గోళపు ఊపిరితిత్తులుగా ప్రసిద్ధి కెక్కిన అమెజాన్‌ అడవుల్లో 30 లక్షల రకాల జంతు జాతులు, 2,500 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. భూమి మీద ఉన్న వృక్ష జాతుల్లో మూడవ వంతు ఈ అడవుల్లోనే ఉన్నాయి. 'ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్స్‌ - పాలసీ ప్లాట్‌ఫామ్‌ ఆన్‌ బయో డైవర్సిటీ అండ్‌ ఎకో సిస్టమ్‌ సర్వీసెస్‌ -ఐపిబిఇఎస్‌ ) నివేదిక ప్రకారం అమెజాన్‌ విధ్వంసం కారణంగా పది లక్షల జంతుజాతుల ఉనికి ప్రమాదంలో పడింది. వీటిలో కొన్ని ఇప్పటికే కనపడకుండా పోయాయి. ఈ పరిణామం ఇదే మాదిరి కొనసాగితే భూమిమీద జీవరాశి ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. అందుకే మానవుడితోపాటు సమస్త జీవజాల మనుగడకు అమెజాన్‌ పరిరక్షణ అత్యంత కీలకం. అయితే, లాభాపేక్షతో కార్పొరేట్లు విచ్చలవిడిగా అడవుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. మనుగడ కోసం అమెజాన్‌ అడవులపైనే ఆధారపడిఉన్న దేశాల అంతర్గత వ్యవహారాల్లో తరచూ జోక్యం చేసుకుంటూ, రాజకీయంగా, ఆర్థికంగా పెత్తనం చెలాయించే అమెరికా అడవులను ధ్వంసం చేస్తున్న కార్పొరేట్లకే అండగా నిలుస్తోంది. స్థానిక రాజకీయ నాయకులను లొంగదీసుకుని వారికి అనుకూలంగా చట్టాలు చేయించడంతో పాటు, ఆయుధాలనూ సరఫరా చేస్తోంది. ఇంధన వనరుల అన్వేషణ, వినియోగం వంటి ఒకటి, రెండు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అడవుల పరిరక్షణ విషయంలో దక్షిణ అమెరికా దేశాలు తమ నిర్ణయాన్ని గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు సమావేశం జరిగిన బెలెమ్‌ నగరంలోనే 2025లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై కీలక సమావేశం జరగనుంది. మిగిలిన ప్రపంచదేశాలు తాజా నిర్ణయాల స్ఫూర్తిని అందుకుని ఆ సమావేశంలో ఎలా ప్రతిస్పందించనున్నాయో చూడాల్సిఉంది.