ఊహలన్నీ కొండెక్కి కూర్చొని
గాలితో గుసగుసలాడుతున్నాయి.
మనసులో నిండిన దుఃఖమంతా..
మోసం చేసిన మనుషులను..
మదిలో నింపుకొని తూకం వేస్తున్నాయి.
కళ్ళన్నీ అమయాకపు చూపులను..
చూస్తూ కాలాన్ని నిలదీస్తున్నాయి.
జ్ఞాపకాలన్నీ హృదయపు గదిలోని అల్మారాలో..
నిండుకొని భద్రంగా తాళం వేసుకున్నాయి.
ఆశలన్నీ మంచుతెరల్లా కళ్ళముందు..
తడిమి చూస్తే అంతా మాయే.
నిద్రిస్తున్న కళ్ళలో కలలన్నీ..
సంతోషాల పూలై పూస్తున్నాయి.
మెలుకువ వచ్చిన వేళ అదో భ్రమ.
ఏకాంతాన కూర్చొని ఉన్నచోట..
ఏవో కొన్ని ప్రేమ పలుకుల చప్పుళ్ళు.
చెవి నిండా విందామంటే అంతా నిశ్శబ్దం.
గమ్యం దారిలో పయనిస్తూ ఉంటే..
ప్రమిదల కాంతులన్నీ కనిపిస్తూ ఉన్నా..
ఎదలో మాత్రం చీకటి మేఘాలు.
ఎన్నో బతుకులు ఒంటరి తీగలమీద..
తలకిందులై వేలాడుతున్నాయి.
రెక్కల తెగిపడిన పక్షులన్నీ గాయాల గానాన్ని..
ఆలపిస్తూ బతుకువేటని సాగిస్తున్నాయి.
అమాయకపు చూపులను చూస్తూ..
మంచి మనసులు అనే చెట్టుకుపూసే
మానవత్వపు మనుషుల పలకరింపు
కోసం ఎదురుచూస్తున్నాయి.
అశోక్ గోనె
94413 17361..