అమరజ్యోతి కథలతో పరిచయం ఇటీవలిదే కావొచ్చు. కానీ తన కవిత్వంతోనూ, తనతోనూ స్నేహం ఏర్పడి దశాబ్దం దాటింది. ఈ 'సారాంశం' గత దశాబ్ద కాలంగా రాసిన కథల నుంచి కొన్నిటిని ఏరి కూర్చిన సంపుటి. వ్యక్తిగా అమర అత్యంత మృదుస్వభావి. నిరంతరం పెదాలపై చిరునవ్వు తనకి ఆభరణం. ఉత్తరాంధ్రలో అనకాపల్లి వంటి ఒక పట్టణం నుంచి రచయితగా ఎదిగివచ్చిన తన ప్రయాణం అపురూపం.
'హనుమ' కథాస్వరం అలా నిర్ణయం కావడానికి చాలా సాహసవంతమైన ఆలోచనా విధానం ఉండాలి. రాజకీయ నాయకులకి బాడీ గార్డులుగా నియమించబడే వారి జీవితాలని, వారి మథనాన్ని వ్యక్తం చేసిన కథ ఇది. ఇటువంటి కథలు చాలా అరుదు. ఇతరుల పెత్తనాన్ని సహిస్తూ మనసు చంపుకుని ఉద్యోగం చెయ్యడం హనుమలో ఎంతటి ఘర్షణని కలిగిస్తుందో, ఆ ఇగోని చెప్పడానికి ఉద్వేగపూరిత కథనాన్ని ఎంచుకున్నారు. గ్రామ నేపథ్యం ఉన్నవారు పట్టణాల్లో చేసే ఉద్యోగాలకి విసిరి వేసారినపుడల్లా ఊరు వెళ్లి మడిచెక్కని సాగు చేసుకుంటామని అంటూ వుండడం వాస్తవమే. ఆ విధంగా చూసినపుడు హనుమ నిర్ణయంలో అసంబద్ధత కనపడదు.
'స్వయంభువు' కథ కూడా సామాజిక చైతన్యపు కోణం నుంచి రాసిన కథ. అవినీతిలో కూరుకుపోయిన వ్యవస్థలను ప్రశ్నించే 'కమల' నామ వాచకం కాదు. కోట్లాది సామాన్య ప్రజల సర్వనామం. మగవాళ్ళ ప్రపంచంలోకి వెళ్లి మరీ అనేక విషయాలు గ్రహించి, అందులోని అన్యాయా లను, వివక్షలను అర్థం చేసుకుని రాశారు.
ఆగ్రహం, దుఃఖం, కోపం, ద్వేషం, నిస్సహాయత, నిరాశవంటి వాటిని పలికించడంలో అమర ప్రత్యేకశైలిని ఎంచుకుంటారు. ఆయా తామస భావాలన్నీ పాఠకులు కూడా అనుభవానికి తెచ్చుకునేలా అక్షరాలను కదం తొక్కిస్తారు. నలభై అయిదేళ్ళ 'అచల' మనల్ని ఎంతగా చలింపజేస్తుందంటే ఈ భూమిపై స్త్రీల గురించి 'అర్థం కానిది' ఏదుందో దాని అన్వేషణ వెంటనే మొదలు పెట్టాలనిపిస్తుంది. చివరికి మనిషికి, ముఖ్యంగా పురుషులకి, మరీ ముఖ్యంగా భర్త అనే హోదాకి 'స్త్రీల దుఃఖం' అర్థం కాదనే తాత్విక అన్వయంతో కథ ముగుస్తుంది. ఈ కథల్లో చాలామంది స్త్రీలు బడబాగ్నుల్ని దాచుకున్న సముద్రాల వంటివారు. పైకి కనిపించే అలల వంటి వారి నవ్వుల వెనుక అణిచి పెట్టిన తీవ్రమైన వేదనలు ఎన్నో ఉంటాయి. వాటిని అంతే పచ్చిగా యథాతథంగా చెప్తే ఒక గోస మాదిరి ధ్వనించవచ్చు, మొరటుగానూ ఉండొచ్చు. ఈ కథనం వల్ల రచయితలో ఉండే తీవ్రమైన భావోద్వేగాలకి మారురూపం తొడగవచ్చు. ఎంతటి నొప్పినైనా కళాత్మకంగా చెప్పొచ్చు. రచయిత అస్తిత్వం వెనుక ఉన్న స్త్రీ అస్తిత్వాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన సందర్భాలకి ఈ కథనం ఉపకరిస్తుంది.
భార్యాభర్తలు లోకం దృష్టిలో ఏకస్తులుగా ఉన్నప్పటికీ ప్రేమ అవగాహనల రాహిత్యమో, ఆధిపత్యాల దాష్టీకాలో ఎదురైనపుడు ఒకరికొకరు పరాయివారవుతారు. ఆ పరాయితనం గుండెని ఎంత చేటు కోసేస్తుందో అనుభవం కానివారు చాలా తక్కువ. ఆ ఖాళీని పూరించడానికి ఇంట్లో పెరిగే కోడిపిల్లలు అచలకి తోడుగా నిలిస్తే, ఆమె భర్తకి అవి 'డర్టీ చిక్స్'. నిస్సహాయ జీవులపై బలవంతమైన జీవులు దాడి చేస్తూనే ఉంటాయి. మనుషులలోని అంతరాలకి, జంతువులలోని అంతరాలతో పోల్చి ప్రత్యేక కథనంతో ఒప్పించారు రచయిత్రి. నల్ల ఖాళీసీసా కథ ఈ సంకలనంలో ప్రత్యేకమైనది.
గిరిజనాభివృద్ధి పేరిట ప్రభుత్వం పెడుతున్న పధకాలలోని డొల్లతనాన్ని అడవి చెట్టు కథ చెపుతుంది. ఈ కథ ఆదర్శాలను అమాయకంగా ప్రకటిస్తుంది. కానీ వాస్తవాలు చేదుగా ఉంటాయి. అనేకమందికి మేలు జరగడం కోసం కొన్ని పరిమితులను అర్థం చేసుకోవడం అవసరం. మనుషులు కష్టపడి ఎదగాలనుకోవడం, ఆత్మగౌరవంతో బతకాలనుకోవడం సబబే. కష్టపడటానికి కూడా సమాన అవకాశాలు ఉండవని తెలుసు కోవడం ఒక ఎరుక. మూల కారణాల అన్వేషణ వల్లనే పరిమితుల పట్ల సహనం వస్తుంది. పీడితుల పట్ల రచయిత్రి స్వరం చాలా ప్రేమగా ఉంటుంది. వారి బాధని తన బాధగా చేసుకోవడం వల్లనే ఇది ఒక ఆదర్శ వంతమైన కథ.ఈ సంపుటి అంతా రకరకాల విలయాల, విషాదాల, బాధల వలయం. చదవడం మొదలుపెట్టాక అందులో చిక్కుకుని బైట పడటం అసాధ్యమవుతుంది.
కొన్నికథల్లో తాత్వికమైన ప్రశ్నలు, వాటి అన్వేషణ కనపడుతుంది. ఉదాహరణకి 'నిమిత్తమాత్రులు' కథ ఎత్తుగడే ఇటువంటి ప్రశ్నతో. 'తేజస్సు, వర్చస్సు ఒకటేనా?' అంటూ ఆగ్రహం కూడా చాలా పదునుగా దూకుతుంది. 'బోగన్ విలియా' కథలో భర్తను తలచుకునే కమల 'కుక్క అన్నం కుండని పగలగొట్టి పోయినట్లు మొగుడు తన జీవితంలోకి వచ్చిపోయాడు' అనుకుంటుంది. కొడుకు అప్రయోజకత్వం చూసి, 'ఎవరో తన గుండెని పెకలించి మిక్సీలో వేసి, స్టార్ట్ బటన్ ఆన్ చేసినట్లు' విలవిలలాడుతుంది. ఇంతటి పెయిన్‌ని రాయడానికి రచయిత్రి ఇంకెంత ఆవాహన చేసుకుని ఉంటుందో కదా అన్న వూహ వస్తుంది. ఈ కథలన్నీ నిస్సహాయుల దుఃఖాన్ని పరిచయం చేస్తాయి. చదువుతున్నపుడు మనల్ని దుఃఖపెడతాయి. కొన్ని ఆదర్శాలను కలలు కంటాయి. అవి తీరతాయో లేదోనని అనుమానపడతాయి. స్త్రీల అంతరంగాలని శోధించమంటాయి. అక్కడ ఒలికిపోయిన జీవితాల సంగతి ఏమిటని నిలదీస్తాయి. ఈ కథల గురించి ఒకటే మాట చెప్తాను. వస్తువుని కాదు, శిల్పాన్ని కాదు, 'ఎందుకంత గుండెలు పగిలే ఆవేదన!?' అని రచయిత్రిని గుండెకి హత్తుకోవాలనిపిస్తుంది.
- కె. ఎన్. మల్లీశ్వరి