Nov 20,2022 08:30

అనేకాంశాలను తీసుకుని 'నాలోని స్వనాలు' అంటూ రచయిత తీసుకొచ్చిన పుస్తకం ఆలోచింప జేసేలా ఉంది. ఇందులో కొన్ని హృద్యంగానూ, సందర్భోచితంగానూ రాశారు. ఇందులో పొందుపరిచిన పద్యాలు అవసరాన్ని నొక్కి చెప్పేలా ఉన్నాయి. అవి కేవలం పిల్లల కోసమే కాదు.. పెద్దలనూ ఆలోచింపజేసేలా ఉన్నాయి. అలాగే కొన్ని యువత కోసం, సామాన్య జనుల కోసం రాసినవీ ఇందులో ఉన్నాయి. వీటిలో సామాజిక సమస్యలపై రచయిత స్పందించి రాశారు. సంతోషాలు, సరాగాలు, హాస్యం అన్నీ సమ్మిళితమై ఇందులో పొందుపరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే కవి తన మదిలో మెదిలిన ప్రతి భావనకు అక్షర రూపం ఇచ్చారు. వాటిని పద్యాల్లో, గేయాల్లో తెచ్చారు. రచయిత ప్రధానంగా ప్రతి ఒక్కరినో ఏదో ఒకటి ఆలోచింపజేయాలనేదే లక్ష్యంగా ఈ పుస్తకం తెచ్చారనిపిస్తోంది. అందుకే ఈ 'నాలోని స్వనాలు' మనం ఎంత వరకు, ఏ మేరకు స్పందించినా ఆ మేరకు రచయిత ప్రయోజనం నెరవేరినట్లే. అందుకు రచయితను అభినందించాల్సిందే.
సహజంగానే కవి తన చుట్టూ జరిగే విషయాలను, తనకు జరిగిన అనుభవాలను, చుట్టూ జరిగే సంభాషణలను తీసుకుని, తను చేయాల్సిన కర్తవ్యాన్ని అక్షరాల్లో ఒలికించి, ప్రవహింపజేస్తాడు. ఆయా సందర్భాలు కవిని ప్రేరేపిస్తాయి. సామాజిక బాధ్యత కలిగిన కవులను మరింతగా స్పందించేలా చేస్తాయి. అలాగే ఈ కవి తెలుగు భాషకు జరిగే అన్యాయం పట్ల ఇలా గజల్‌ రూపాల్లో స్పందించారు.
ఆ.వె. ఉగ్గుపాల నుండి ఊతమిచ్చిన భాష
అమ్మఅక్కునాట లాడుభాష
ఆకలెరుగకుండ కేకలేసిన భాష
తల్లడిల్లె నేడు తల్లిభాష
అని తెలుగు భాషకు పట్టిన దుస్థితికి చింతించారు.
ఆ.వె. ప్రభుత మారవచ్చు ప్రభువు మారగవచ్చు
ప్రజలభాష వాడవలయు ప్రభువు
పాలనంబులోన పరభాష సరిగాదు
తెలిసి మసలవయ్య తెలుగు ప్రభువ.
అంటూ భాషను బతికించడానికి పాలక ప్రభువులు శ్రద్ధ చూపాలని చెప్తారు. వ్యవసాయ పనులలో రచయితకున్న అనుభవం ఈ గేయాల్లో ప్రతిఫలించాయి.
చెమటపట్టి వీపు ఉప్పుదేరిపోగ
ఒంటినంటిన గుడ్డ మట్టిగొట్టుకుపోగ
ఎండమండిన మేను బండబారిపోగ
సాగిన చిరుగాలి సరసమాడింది!
బొరిగిపట్టిన చేయి చెలరేగుతున్నాది
తొంగిచూచిన గరికి తొలగిపోతున్నాది

మండుటెండలోన గొంతెండిపోయినా
పిడుగుపాటుకు వారు పీనుగైపోయినా
వానవెల్లువలోన పట్టుకోల్పోయినా
పనులు చేయగవారు పరుగులెత్తుతారు!
ఇలా శ్రమను ప్రతిబింబించే గేయాలు కవి స్వనాల్లో వినిపిస్తాయి. ఇలా ఎన్నో ఉన్న ఈ పుస్తకాన్ని తప్పక ఆదరించి, కవిని అభినందిద్దాం.
 

నాలోని స్వనాలు
రచయిత : జాగాన సింహాచలం
వెల : 200/-
ప్రతులకోసం : 9440106236
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం.

 

- నవ్యశ్రీ