Jul 03,2022 08:25

అల్లూరి గొప్ప ప్రేమికుడు. సామాజిక న్యాయం కోరుకునేవాడు. అందుకే ఆయన దేశం కోసం ప్రాణాలర్పించడానికీ వెనుకాడలేదు. ఆయన ఎంత ప్రేమికుడో తెలియాలంటే.. 'రామరాజు' 'సీతారామరాజు' కావడమే అందుకు నిదర్శనం. ఆయన కాలేజీలో చదువుతున్నప్పుడు సీతా అనే అమ్మాయి రామరాజును ప్రేమించిందనేది ఒక కథనం.. ఆ సీత రామరాజు కోసం ఎంతోకాలం ఎదురుచూసింది. రామరాజు దేశం కోసమే తన జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నాడు. ప్రేమా-విప్లవమా అంటే విప్లవం వైపే మొగ్గు చూపాడు రామరాజు. అదే విషయం సీతకు వివరంగా చెప్పి, నచ్చజెప్పాడు. సీత అతని మాటల్ని అంగీకరిస్తున్నట్లు మౌనంగా ఇంటికి వెనుదిరిగింది. సీత తండ్రి ఆమెకు వివాహం చేయతలపెట్టాడు. ఆ వివాహం సీతకు ఏమాత్రం అంగీకారం కాదు. ఆడపిల్ల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పెళ్లిళ్లు చేస్తే ఏమవుతుందో సీత విషయంలో అదే జరిగింది. పెళ్లి వేదికకు చేరగానే సీత మేనమామలు తీసుకొచ్చిన బుట్టలో తలవాల్చింది. సీత మరణవార్త తెలుసుకున్న రామరాజు ఎంతో దుఃఖిస్తాడు. సీత వెళ్లిపోయిందన్న ఆమె సోదరుడు మాటలకు స్పందిస్తూ.. 'సీత ఎక్కడికీ వెళ్లలేదు. నా గుండెల్లోనే ఉంది. ఈ రోజు నుంచి నా పేరు సీతారామరాజు' అని ప్రకటించిన గొప్ప ప్రేమికుడు ఆయన. ఆనాటి నుండి ఆయన సీతారామరాజుగానే అందరి చేత పిలవబడ్డాడు.
నేడు ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ శక్తులు అల్లూరి తమవాడని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు ప్రేమను, ప్రేమికులను అంగీకరించనివారు గొప్ప ప్రేమికుడైన అల్లూరిని ఎలా తమవాడని చెప్పగలరు. ముందు ప్రేమను, ప్రేమికులను అంగీకరించి, అప్పుడు ఆ మాట మాట్లాడాలి. ఇలాంటి మనువాద భావాలకు తాను వ్యతిరేకమని అల్లూరి ఆచరణలోనే నిరూపించాడు.
గిరిజనుల తెగల్లోనూ చీలికలు తేవాలనుకున్నప్పుడు అడ్డుకుని ఐక్యతను నిలిపినవాడు అల్లూరి. విభజించి పాలించే నీతిని పాటించే బ్రిటీష్‌ వారి కుయుక్తుల్లో తెగల మధ్య తగాదా పెట్టే యత్నాన్ని తిప్పికొట్టినవాడు అల్లూరి. కుల, మతాలకు, తెగలకు మధ్య అంతరాలు లేవనీ, అందరిలో ప్రవహించేది రక్తమేనని.. వారు ఐక్యంగా ఉండేలా చేసినవాడు అల్లూరి. అంతేకాదు వేర్వేరు తెగలకు చెందిన ఇద్దరి ప్రేమను ఆమోదిస్తూ.. వారిని దంపతులుగా ప్రకటించిన గొప్ప సామాజిక స్పృహ ఉన్నవాడు అల్లూరి. నేడు జరుగుతున్న కులదురంహకార హత్యలు, మతోన్మాద హత్యల నేపథ్యంలో అల్లూరి ఎంత గొప్ప మానవతావాదో తెలియజేస్తుంది. అలాంటి మానవతావాదిని తమ వాడని ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ వాదులు అనడం హాస్యాస్పదమైన విషయం.
కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటే అనే భావజాలం ఉన్న అల్లూరికి.. నిత్యం కులతత్వం, మతోన్మాదం, విద్వేషాలు రెచ్చగొట్టి.. ఆవు పేరుతో హత్యలు చేస్తూ.. ఒక మతం వారి పట్ల కుట్రపూరితంగా ఎన్‌ఆర్‌ఎ, సిఎఎ వంటి చట్టాలు తీసుకొచ్చేవారికి నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది.
ప్రకృతిని ప్రేమించే అల్లూరికి.. అక్కడి సంపద గిరిజనులదనే అల్లూరికి.. వాటిని కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలకు పెద్ద అంతరమే ఉంది. అందుకని అల్లూరి ప్రజల మనిషి. ప్రేమికుల మనిషి.. సమాజాభ్యున్నతి కోరుకునేవారికి చెందినవాడు.. సమానతను, ఐక్యతను కోరుకోవడం అంటే అల్లూరిని అభిమానించడమే.

- శాంతిశ్రీ