Jan 27,2023 11:13
  • రిపోర్టులకు కట్టుబడి ఉన్నాం
  • కేసు వేస్తే మేము రెడీ 

న్యూఢిల్లీ : గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఎకౌంట్స్‌లోనూ మోసాలు చేస్తోందని తాము ఇచ్చిన రిపోర్టులకు కట్టుబడి ఉన్నామని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ స్పష్టం చేసింది. తమ సంస్థపై ద్వేషంతో ఆధారాలు లేకుండా హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్టాక్‌ ఎక్సేంజీలు, రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టును తప్పుబట్టింది. దీనిపై హిండెన్‌బర్గ్‌ గురువారం ఘాటుగా స్పందించింది. తాము ఇచ్చిన రిపోర్టు సరైనదని.. లేకపోతే ఆ కంపెనీ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అదానీ గ్రూపు చేతనైతే తమపై కోర్టుకెళ్లాలని సవాలు విసిరింది. తమ సంస్థ అమెరికా నుంచి పనిచేస్తోందని.. కాబట్టి అక్కడ దావా వేసుకోవచ్చని సూచించింది. ఒకవేళ ఈ విషయంలో అదానీ గ్రూప్‌ కనుక విఫలమైతే తమ వాదనలు సరైనవిగా భావించాలని సవాల్‌ విసిరింది. అదానీ గ్రూపులో గతంలో పనిచేసిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, వేలాది పత్రాలు, ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థల నిఘా నివేదికలు, అదానీ గ్రూపు కంపెనీల శాఖలు ఉన్న 12కు పైగా దేశాలను పర్యటించి ఈ నివేదికను తయారు చేసినట్టు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తెలిపింది. ''మా రిపోర్టును విడుదల చేసి 36 గంటలు దాటిన ఒక్క అంశాన్ని కూడా అదానీ గ్రూపు స్పష్టంగా లేవనెత్తలేకపోయింది. మేము సూటిగా 88 ప్రశ్నలు వేశాము. ఇందులో అదానీ గ్రూపు ఏ ఒక్క ప్రశ్నకు ఇప్పటికీ బదులు ఇవ్వలేకపోయింది. రెండు ఏళ్లుగా అనేక పరిశోధనలు చేసి 32,000 పదాలతో 106 పేజీల రిపోర్టును రూపొందించాము. ఇందులో ఏ తప్పు ఉన్న మాపై న్యాయ చర్యలు తీసుకోవచ్చు. అదానీ గ్రూపు మా రిపోర్టును తప్పుబడుతూ చర్యలు తీసుకుంటామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాము. మేము ఇచ్చిన రిపోర్టుకు కట్టుబడి ఉన్నాము.'' అని హిండ్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అదానీ గ్రూపు దావా వేస్తే తాము కూడా లీగల్‌గా ఆ కంపెనీ డాక్యూమెంట్లను కోరుతామని స్పష్టం చేసింది.

హిండెన్‌బర్గ్‌ రిపోర్టులోని ప్రధానాంశాలు... ''అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కంపెనీ షేర్లను మానిఫ్యులేషన్‌ చేస్తుంది. ఎకౌంట్స్‌లో మోసాలకు పాల్పడుతుంది. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచింది. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ మోసాల కోసం అనేక అడ్డదారులు తొక్కింది. అప్పుల కోసం మోసాలకు పాల్పడింది. కార్పొరేట్‌ ప్రపంచ చరిత్రలో ఇదో అతిపెద్ద కుట్ర. గౌతమ్‌ అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 120 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9.78 లక్షల కోట్లు)గా ఉంది. మూడేళ్ల క్రితం ఇది 20 బిలియన్‌ డాలర్లు (రూ.1.62 లక్షల కోట్లు)గా ఉండేది. గత మూడేళ్లలోనే తన గ్రూప్‌నకు చెందిన 7 ప్రధాన లిస్టెడ్‌ కంపెనీల ముఖ విలువను ఎక్కువ చేసి, షేర్ల విలువను కత్రిమంగా పెంచి ఆదానీ మోసానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆయా కంపెనీల షేర్‌ విలువ సగటున 819 శాతం పెరిగింది. దీంతో మూడేళ్లలోనే అదానీ సంపద 100 బిలియన్‌ డాలర్లకు పైగా (రూ. 8.1 లక్షల కోట్లు) పెరిగింది. ఈ ఏడు కంపెనీలు 85 శాతం నష్టాలను నమోదు చేశాయి. ఇవి రెడ్‌జోన్‌లో ఉన్న కంపెనీలు. అయినప్పటికీ.. ఆర్థిక అవకతవకలతో ఆయన ఈ కంపెనీల నష్టాలను బయటపెట్టలేదు. నష్టాలతో ట్రేడ్‌ అవుతున్న ఆ కంపెనీల వాటాలను తనఖా పెట్టి అదానీ గ్రూప్‌ భారీగా రుణాలను పొందింది. దీంతో అదానీ కంపెనీ వాటాదార్ల సొమ్మును, గ్రూప్‌ ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలో పడేసినట్టే. అదానీ గ్రూప్‌ మనీలాండరింగ్‌, అవినీతి ఆరోపణలకు గానూ భారీగా డబ్బు వెచ్చించింది. రూ.1.4 లక్షల కోట్ల అవినీతి, మనీలాండరింగ్‌, పన్ను ఎగవేతకు సంబంధించి అదానీ గ్రూప్‌ ఇప్పటికే నాలుగు కేసుల్లో ప్రభుత్వ సంస్థల విచారణను ఎదుర్కొంటుంది.'' అని ఈ రిపోర్టు తెలిపింది.