
రాయలసీమ అనగానే కరువే గుర్తుకొస్తుంది. కానీ అక్కడ నేలలు బీటలు వారినా.. ప్రజల మనసులు మాత్రం పచ్చనిపొలాల్లా ఉంటాయి. ఈ విషయాన్నే అనేకమంది రచయితల్లానే ఈ రచయితా పేర్కొన్నారు. 'ఊరిమర్లు' అనే తన మొదటి కథాసంపుటితో రచయిత రాయలసీమ సాహిత్యాన్ని, భాషను సజీవంగా నిలిపే ప్రయత్నం చేశారు. పుస్తక శీర్షికకు తగ్గట్టుగానే ఇందులోని కథలుంటాయి. ఊరిమీద మర్లు (ఆపేక్ష) ఉన్నవాళ్లకెవరికైనా ఈ పుస్తకం నచ్చుతుంది. ఇందులోని ప్రతి కథ, కథలోని పాత్రలు మదిని మెలిపెడతాయి. ఇందులోని కథలన్నీ కూడా 'గువ్వలదొడ్డి' అనే ఊరు, ఆ ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఇతివృత్తాలనే తీసుకుని, రచయిత కథల్ని రాశారు. ఈ పుస్తకంలోని కథలన్నీ చదివించేలా ఉన్నాయి.
వాటిల్లో మొదటి కథ 'నీళ్లింకని నేల' కథలో ఓ తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధం.. నేటి ఉద్యోగ పరిస్థితుల్లో ఎలా కనుమరుగవుతున్నది సోమశేఖర్ పాత్రతో రచయిత స్పష్టంగా చెప్పారు. ఒకవైపు చదువుకున్న యువకుడు ఉద్యోగరీత్యా వలసవెళ్తే.. మరోవైపు చదువు లేని వారు వలసలకు వెళ్లేది ఈ కథలో గమనించవచ్చు. ఇందులో ఒకవైపు తండ్రీ కొడుకుల బంధాన్ని చెబుతూనే, మరోవైపు భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని, దాని విలువను 'గిడ్డయ్య' పాత్రతో రచయిత చెప్పారు. చివరగా పంట పొలాలకు నీరులేక బీటలు వారిపోతే, అక్కడి ప్రజల జీవన పరిస్థితులు ఎలాంటి స్థితికి చేరతాయనేది ఈ కథతో పాఠకులకు తెలిపే ప్రయత్నం చేశారు.
ఇక పుస్తక ప్రధాన శీర్షికకు తగ్గట్టుగా వున్న మరోకథ 'ఊరిమర్లు'. ఇందులో కేవలం వ్యవసాయం మీదే కాదు.. భూమిపై ఆధారపడ్డ ఇతర వృత్తుల వారిని ప్రస్తావించడం జరిగింది. ఇప్పటివరకు మనం ఎవరైనా చదివిన కథల్లో అర్చకుల జీవన పరిస్థితులను తెలియజేసే కథలనే చదివి ఉంటాము. అలాంటిది ఈ కథలో అర్చకులకు సహాయపడేవారిని ఇతివృత్తంగా తీసుకుని, ఈ కథను నడిపించారు. ఒకప్పుడు పంటలు పండి, చేతినిండా డబ్బులు ఉండడంతో ఊరి ప్రజల ముఖాల్లో నవ్వులు విరిసాయి. ఎద్దుల పందేలు.. వాటితో సరదా విన్యాసాలు.. అన్నీ ప్రజలను అబ్బురపరుస్తాయి. పంటలున్నప్పుడు గ్రామ ప్రజలు ఎంత ఆనందంగా ఉంటారో ఎంకటేశులు పాత్రతో కథను ప్రారంభించారు. అలాంటిది సాగునీరు లేక పంటలు పండక.. పెళ్లయ్యి, పిల్లలు పుట్టిన తర్వాత జీవనం కష్టమైన ఎంకటేశుని పరిస్థితిని చూస్తే నేటి రైతును తలపిస్తుంది. ఈ కథ చదువుతున్నప్పుడు ఏదో తెలియని గుబులు ఆవహిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆఖరికి తన భార్య తనని వదిలేసి వెళ్లినా ఎంకటేశులు మాత్రం ఊరిని వదలకుండా అట్టేపెట్టుకుని ఉండడం.. చివరికి అత్యంత దీన పరిస్థితిలో మృతి చెందడం కంటనీరు తెప్పిస్తుంది. 'నా చేయి విడవకయ్యా!' అని అర్చకుని కొడుకు (అనిమేశప్ప) తో ఎంకటేశులు అనే మాటకు.. ఊరును కూడా విడవకూడదు అనేటట్టు అర్థం వచ్చేలా ముగించిన తీరు హృద్యంగా ఉంది.
'కుశలంబే గదా ఆంజనేయం' అనే కథలో శ్రీరామాంజనేయ యుద్ధం నాటకంతో హాస్యాన్ని జోడించారు. ఈ కథ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. అదే సందర్భంలో ఈ కథ మతసామరస్యానికి ప్రతీకగానూ నిలుస్తుంది. వ్యవసాయం బాగంటే రైతులు మాత్రమే కాదు కళను నమ్ముకున్నవారూ బాగుంటారని అర్థం వచ్చేలా రచయిత ఈ కథను రాశారు. టి.వీలు, సెల్‌ఫోన్లు లేనికాలంలో గ్రామాల్లోని ప్రజలు ఎంత ఐకమత్యంగా ఉంటారనేది కూడా ఈ కథ చదివితే తెలుస్తుంది. 'పునరపి' కథలో ప్రాజెక్టులు ఆగిపోవడం వల్ల ఒక్కతరమే కాదు.. భవిష్యత్ తరాలు ఎంతలా నష్టపోతాయనేది సోదాహరణంగా.. ఇప్పటి రాయలసీమ పరిస్థితులకు అద్దంపట్టేలా రచయిత కథను రాశారు. ఇక చివరలో ప్రజలంతా ఐక్యమై పోరాడితేనే ఏదైనా సాధించుకోగలం.. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోగలం.. అన్నట్టే కాక, కథ ముగింపు అభ్యుదయకరంగానూ ఉంది. అలాగే 'కాల్వ' అనే కథలో కూడా నిరుద్యోగాన్ని రచయిత ప్రస్తావించారు.
ఓ మహిళ సాధారణంగా ఎదుర్కొనే సమస్యలనే 'నిర్ణయం' కథలో రచయిత చెప్పారు. పెళ్లి, పిల్లలు.. సంసార జీవితం చూసి.. జీవిత చరమాంకంలో తోడు కోసం కుమారుడు తపన పడడం.. దాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించడం రచయితలోని స్త్రీ కోణాన్ని తెలియజేసింది. మిగిలిన ఒక్కోకథ కూడా ఆద్యంత్యం చదివించేలా ఉన్నాయి. ఈ కథల్ని చదువుతుంటే మన జీవితంలో ఎదురైన సంఘటనలు గుర్తుకొస్తాయి. నేటితరం పిల్లలకు వ్యవసాయం.. ఆవశ్యత గురించి ఈ కథల ద్వారా తెలపాల్సిన బాధ్యత మనపై ఉందనిపిస్తుంది. ఈ పుస్తక రచయిత మారుతి పౌరోహితం గురించి కు.వీ, జి. వెంకటకృష్ణలు ముందుమాటలో చక్కగా వివరించారు. ఈ పుస్తకం పెద్దలు చదివి, పిల్లలతో చదివించాల్సినదిగా ఉంది.
ఎస్. భవాని
81438 3 9975
పుస్తకం : ఊరిమర్లు
రచయిత : మారుతి పౌరోహితం
పేజీలు : 130, వెల : 130
ప్రతులకు : 9440205303
ఇంటి నెం : 78/8-ఎ-12-2-46,
మయూరి రెసిడెన్సీ, విఠల్ నగర్, కర్నూలు