చింతాకు, చింత చిగురు ఎలా పిలిచినా.. కూరల్లో ఉపయోగిస్తారు. చింతచిగురును పప్పుతో కలిపి వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. చింత పువ్వులతో పప్పు, చట్నీ చేసుకుంటారు. ఇక చింత చిగురుతో రొయ్యలు, చింత చిగురు చికెన్ కలిపి వండితే ఎంతో రుచిగా ఉంటుంది. చింతచిగురు పొడి వేడి వేడి ఇడ్లీల్లో నంజుకుని తింటే ఆ మజానే వేరు.. నోటికి పుల్లటి రుచి ఇస్తూనే.. తినే కొద్దీ తినాలనిపించే పులుపుతో దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. ఇంకెందుకు ఆలస్యం.. ప్రస్తుతం చింతచిగురు సీజనే కాబట్టి.. ఎలాంటి వెరైటీలు చేసుకోవాలో తెలుసుకుందాం..
బిర్యానీ..
కావాల్సినవి : బాస్మతి బియ్యం- 2 కప్పు, చింతచిగురు- కప్పు, ఉల్లి తరుగు- కప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్- 2 స్పూన్లు, మసాలా దినుసులు- సరిపడినన్ని, పచ్చిమిర్చి- ఐదు, పచ్చికొబ్బరి ముక్కలు-పావు కప్పు, సోంపు- టీస్పూను, ఉప్పు-రుచికి సరిపడా, నూనె- టీస్పూను.
తయారీ : ముందుగా బియ్యాన్ని కడిగి, నీరు ఒంపేసి, మూడు గంటలు నానబెట్టాలి. చింత చిగురుని శుభ్రం చేసి, ఆరబెట్టాలి. దీన్ని స్టవ్‌పై పాన్‌లో కాస్త నూనె పోసి, వేయించాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పచ్చి మిరపకాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చికొబ్బరి, సోంపు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోసి, మసాలా దినుసులు, ఉల్లితరుగు వేయించాలి. ఇందులో చింతచిగురు మిశ్రమాన్ని వేసి, కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసి కలపాలి. రెండు కప్పుల నీరు పోసి, తగినంత ఉప్పువేసి కలపాలి. మూత పెట్టి అన్నం ఉడికే వరకూ ఉంచాలి. దించేముందు ఒకసారి గరిటెతో కలపాలి. అంతే చింతచిగురు బిర్యానీ రెడీ. దీనిలో చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
చికెన్‌తో..
కావాల్సినవి : చికెన్-అరకేజీ, చింతచిగురు- ఒకటిన్నర కప్పు, కొబ్బరితురుము-2 స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద- స్పూన్, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి-మూడు, పసుపు-కొద్దిగా, కారం-2 స్పూన్స్, ధనియాల పొడి, గరంమసాలా- తగినంత, ఉప్పు-తగినంత, నూనె-అరకప్పు.
తయారీ : చింతచిగురు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టౌపై పాన్ పెట్టి, నూనె వేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేయాలి. బాగా వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద వేసి, కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయాలి. ఐదు నిమిషాలయ్యాక పసుపు, తగినంత ఉప్పు వేసి, నీరంతా ఇగరనివ్వాలి. కూర సగం ఉడికాక కారం, ధనియాల పొడి, కొబ్బరి తురుము, గరంమసాలా వేసి కలిపి మూత పెట్టాలి. చికెన్ పూర్తిగా ఉడికాక, చింతచిగురును బాగా నలిపి చల్లుకోవాలి. కొద్దిసేపు సిమ్‌లో పెట్టి, మధ్యమధ్యలో కలపాలి. కూర పొడిపొడిగా అయ్యాక దింపేయాలి.
నిల్వ పద్ధతులు
కావలసినవి : చింత చిగురు - కేజీ, కల్లు ఉప్పు - 200 గ్రాములు, పసుపు - మూడు స్పూన్లు, మెంతిపొడి - 2 స్పూన్లు
తయారీ : చింత చిగురును శుభ్రం చేసుకుని, కల్లు ఉప్పు, పసుపు, మెంతిపొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని మిక్సీ జార్‌లో కచ్చాపచ్చాగా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తడిగానూ, పొడిగానూ నిల్వ చేసుకోవచ్చు. పొడిగా కావాలంటే ఒక పళ్లెంలో ఈ మిశ్రమాన్ని రెండు గంటలు ఆరబెట్టుకోవాలి.
కావలసినవి : చింత చిగురు -అర కేజీ, కల్లు ఉప్పు - 100 గ్రాములు, పసుపు - స్పూను, మెంతిపొడి - స్పూను
తయారీ : చింత చిగురును శుభ్రం చేసుకుని, ఒక మందపాటి గిన్నెలో రెండు గుప్పెళ్లు వేసి, కొద్దిగా కల్లు ఉప్పు వేసి మూతపెట్టి సిమ్‌లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత మరో రెండు గుప్పెళ్లు వేసి, మళ్లీ కొద్దిగా ఉప్పు వేసి, మూతపెట్టి మగ్గనివ్వాలి. చివరిగా మిగిలిన చిగురు, పసుపు, మెంతిపొడి వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి, బాగా కలియబెట్టుకుని, కొద్దిగా నీరుండగానే దింపేసి, చల్లార్చాలి. దీనిని మిక్సీ పట్టుకుని, గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని పప్పులో వేసుకుని వండుకుంటే సహజంగానే ఉంటుంది.