ప్రజాశక్తి-కాకినాడ : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనం చెల్లిస్తానని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయడమే మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఘనమైన సత్కారమని, అది చేయకుండా దండలేసి సత్కరించడం ద్వారా కార్మికుల కడుపులు నిండవవని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషాబాబ్జి, చెక్కల రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ స్మార్ట్ సిటీ 2022 అవార్డులలో కాకినాడ రెండో స్థానాన్ని సాధించడంలో మున్సిపల్ కార్మికులు కీలకపాత్ర పోషించినందుకు జిల్లా అధికార యంత్రాంగం వారిని సత్కరిస్తూ అభినందన ర్యాలీ జరిపి చేతులు దులుపుకున్నారని, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సమానంగా కనీస వేతనాలను 26 వేల రూపాయలను ప్రతి మున్సిపల్ కార్మికుడికి చెల్లించాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులు, వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్ విభాగాలలో సుమారు 1000 మందికి పైగా కాకినాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్నారని, వీరిలో క్లాబ్ డ్రైవర్లకు 9 వేలు మాత్రమే చెల్లిస్తూ, చట్ట ప్రకారం కనీసం ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ లీవులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ విభాగాలలో కార్మికులకు హెల్త్ అలవెన్సులు ఇవ్వడం లేదని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజేషన్ చేస్తానని జగన్ చెప్పి నేటికీ ఐదేళ్లు గడుస్తున్నా ఒక్క మున్సిపల్ కార్మికుడిని కూడా రెగ్యులరైజ్ చేయకుండా జగన్ ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరి రెగ్యులరైజేషన్ కోసం పోరాటాలకు సిద్ధపడాలని కార్మికులకు పిలుపునిచ్చారు.










