May 06,2023 07:36

ఇటీవలి ఎన్నికల్లో బిజెపి అనుసరించే సాధారణ ఎత్తుగడలు, నినాదాలు పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదని ఇప్పటివరకు సాగిన ఎన్నికల ప్రచారం తెలియచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన తీరును దృష్టిలో పెట్టుకుంటే ''డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌'' అన్న నినాదం పూర్తిగా కుప్పకూలింది. హిందూత్వ తరుపుముక్కకు కూడా కొన్ని పరిమితులు వున్నాయి. ఇప్పటికే మతపరంగా చీలిపోయిన ప్రాంతాల్లో ఇది కొంచెం పని చేసే అవకాశం వుంది కానీ, అసమ్మతి, అసంతృప్తితో రగిలిపోతున్న అనేక వర్గాల ప్రజలను అంతగా ఆకర్షించలేకపోవచ్చు.

బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి గణనీయమైన రాజకీయ, సైద్ధాంతిక ప్రభావాన్ని కలిగివున్న ఏకైక దక్షిణాది రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి హిందూత్వ శక్తులకు పెద్ద ఎదురుదెబ్బ కాగలదు. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి తీవ్రమైన సవాలును విసిరేందుకు లౌకిక, ప్రజాతంత్ర ప్రతిపక్ష ఐక్యతను ఇది మరింత వేగవంతం చేస్తుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దక్షిణాది లోని ఇతర రాష్ట్రాలకు తన ప్రభావాన్ని విస్తరింపజేయాలని, అన్ని చోట్లా రాజకీయ ఆధిపత్యాన్ని చలాయించాలని తహతహలాడుతున్న బిజెపికి ఈ దక్షిణాది రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం అత్యంత కీలకంగా మారింది.
           కర్ణాటక ఎన్నికల ప్రచారం అన్ని విధాల ఉచ్ఛ స్థితికి చేరిన నేపథ్యంలో బిజెపి విస్తృత స్థాయి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. తీవ్రంగా వున్న ప్రభుత్వ వ్యతిరేకత, విశృంఖలమైన అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల దయనీయ పరిస్థితులు వీటన్నింటిపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి ఇందుకు కారణం.
        'ఆపరేషన్‌ కమల్‌' పేరుతో పాలక కూటమి నుండి ఫిరాయింపులకు పాల్పడడం ద్వారా కాంగ్రెస్‌-జె.డి (ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత 2019 జులైలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుండి, గత నాలుగేళ్ళలో, ఇద్దరు ముఖ్యమంత్రులను, ముగ్గురు డిప్యూటీ ముఖ్యమంత్రులను రాష్ట్రం చూసింది. 2021 జులైలో బి.ఎస్‌.యడ్యూరప్ప వైదొలగి ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మైకి అవకాశం కల్పించారు. కానీ, బొమ్మై ప్రభుత్వం పూర్తిగా అవినీతితో నిండిపోయింది. జె.డి (ఎస్‌) నుండి బిజెపికి మారిన బొమ్మై, దూకుడుతో హిందూత్వ మతోన్మాద ఎజెండాను అనుసరించడం ద్వారా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూశారు.
          గో వధపై కఠోరమైన నిషేధం విధించడం, ప్రధానంగా ముస్లింలు సాగించే మాంసం వ్యాపారానికి ఆటంకం కలిగించడం వంటి చర్యలతో బొమ్మై ప్రభుత్వం మెజారిటీవాదుల మనోభావాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకునేందుకు నగంగా ప్రయత్నిస్తున్నది. క్రైస్తవులకు వ్యతిరేకంగా నిరంకుశమైన మత మార్పిడి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్లస్‌ టూ చదివే విద్యార్థులు హిజాబ్‌ ధరించడంపై నిషేధం విధించింది. ఒబిసి కేటగిరీలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసింది. టిప్పు సుల్తాన్‌ను చంపింది బ్రిటీష్‌ వారు కాదని, వొక్కలిగ పురాణ పురుషులు ఇద్దరు చంపేశారనే అర్ధం లేని కథనాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ఆయనపై బురద చల్లే యత్నం చేసింది. మైనారిటీ వ్యతిరేక ఎజెండాను అమలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూస్తుంటే హిందూత్వను గౌరవించే వారి జాబితాలో అగ్ర స్థానానికి చేరేందుకు గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లతో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, మతోన్మాద పోకడలకు మరింత పదును పెట్టడం, మెజారిటీవాదుల మనోభావాలను రెచ్చగొట్టి తనవైపు తిప్పుకోవడానికి యత్నించడం ద్వారా...రికార్డు స్థాయిలో అవినీతి, కార్పొరేట్‌ అనుకూల, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చాలని చూస్తున్నది. 40 శాతం కమిషన్‌ని ముడుపులుగా తీసుకుని బొమ్మై ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారింది. వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలకు చెందిన బిల్లులు ఆమోదం పొందాలంటే మొత్తం బిల్లులో 40 శాతం చొప్పున చెల్లించాల్సి వుందంటూ రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ చేసిన విమర్శే ఇది. ముడుపులు కావాలని డిమాండ్‌ చేశారంటూ ఆరోపించి కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యకు పాల్పడడంతో మంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో, ముడుపులు కావాలని డిమాండ్‌ చేసినందుకు బిజెపి ఎంఎల్‌ఎ, ఆయన కుమారుడిని అరెస్టు చేశారు. వారి ఇళ్ళ నుండి విజిలెన్స్‌ బ్యూరో అధికారులు రూ.8.1 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
           వ్యవస్థీకృతమైన అవినీతి ద్వారా ఇలా బహిరంగంగా దోపిడీ చేయడంతోబాటు రైతాంగ వ్యతిరేక విధానాలకు కూడా ప్రభుత్వం పాల్పడింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్చేందుకు అనుమతించేలా భూ సంస్కరణల చట్టాన్ని సవరించింది. పార్లమెంట్‌ ఆమోదించిన వ్యవసాయ బిల్లుకు అనుగుణంగా వ్యవసాయ వాణిజ్యంలోకి కార్పొరేట్ల ప్రవేశాన్ని అనుమతించేందుకు ఎపిఎంసి యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసింది. నిత్యావసర ఆహార పదార్ధాలు, వంటనూనెల ధరల పెరుగుదల అనేది నిరుపేద వర్గాలకు అతి పెద్ద సమస్యగా మారిందని తాజా సర్వేల్లో వెల్లడైంది. అవినీతి, ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగం కూడా ప్రధాన సమస్యగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత బాగా బలంగా వుందని స్పష్టంగా గ్రహించిన బిజెపి కేంద్ర నాయకత్వం హిందూత్వ విభిజన ఎజెండాను ప్రముఖంగా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రచారానికి స్వయంగా అమిత్‌ షా, నరేంద్ర మోడీ నాయకత్వ బాధ్యతలు నెత్తినేసుకున్నారు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్‌ రద్దు చేస్తామని అమిత్‌ షా ప్రకటించారు. ఒకవేళ కాంగ్రెస్‌ గెలుపొందితే, కర్ణాటకలో అల్లర్లు చెలరేగుతాయని ఆయన బెదిరించారు. తీవ్రవాదులను రక్షించేవారిగా, బుజ్జగింపు మాస్టర్లుగా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని నరేంద్ర మోడీ చిత్రీకరిస్తున్నారు. బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఉమ్మడి పౌర స్మృతి, జాతీయ పౌర పట్టికలను ప్రవేశపెట్టారు. ఆలయాల చుట్టూ స్థానిక వ్యాపారాలను క్రమబద్ధీకరించడం గురించి కూడా ఆ ఎన్నికల మేనిఫెస్టో మాట్లాడుతోంది. అంటే ఆలయాల చుట్టుపక్కల ముస్లింలు దుకాణాలు ఏర్పాటు చేసుకోకుండా నిషేధించారని అర్ధం.
            ఇటీవలి ఎన్నికల్లో బిజెపి అనుసరించే సాధారణ ఎత్తుగడలు, నినాదాలు పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదని ఇప్పటివరకు సాగిన ఎన్నికల ప్రచారం తెలియచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన తీరును దృష్టిలో పెట్టుకుంటే ''డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌'' అన్న నినాదం పూర్తిగా కుప్పకూలింది. హిందూత్వ తరుపుముక్కకు కూడా కొన్ని పరిమితులు వున్నాయి. ఇప్పటికే మతపరంగా చీలిపోయిన ప్రాంతాల్లో ఇది కొంచెం పని చేసే అవకాశం వుంది కానీ, అసమ్మతి, అసంతృప్తితో రగిలిపోతున్న అనేక వర్గాల ప్రజలను అంతగా ఆకర్షించలేకపోవచ్చు. హిందూత్వ పిలుపులు కేవలం కోస్తా తీర ప్రాంత జిల్లాలకు, అలాగే సెంట్రల్‌, మలనాద్‌ ప్రాంతంలో కొన్ని భాగాలకు పరిమితమైనట్లు కనిపిస్తోంది. పైగా టిక్కెట్ల పంపిణీపై బిజెపిలో లింగాయత్‌ నాయకత్వంలో నెలకొన్న నిరాశ ఆ వర్గానికి చెందిన కొంతమంది ప్రముఖ నేతలు పార్టీ నుండి బయటకు వెళ్ళిపోవడానికి దారి తీసింది.
         ''డబుల్‌ ఇంజన్‌'' నినాదంలో అంతర్లీనంగా వున్న కేంద్రీకృత ధోరణికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ప్రాంతీయ కన్నడిగ గుర్తింపును పరిరక్షించడమన్నది ఆవిర్భవించింది. కేంద్ర పోటీ పరీక్షల్లో కన్నడాన్ని నిర్లక్ష్యం చేసి హిందీని రుద్దడానికి ఈ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం తెగించింది. రాష్ట్రంలో పేరుమోసిన పాల బ్రాండ్‌ నందినిని దెబ్బ తీసేలా కర్ణాటక పాల సహకార సమాఖ్యను గుజరాత్‌ పాల సమాఖ్యతో విలీనం చేయడం గురించి మాట్లాడుతూ, కర్ణాటకలో అమూల్‌ చొరబాటుకు అనుమతించింది.
        తీవ్ర నైరాశ్యంలో వున్న బిజెపి మోడీ ప్రచారంపైనే పూర్తిగా ఆధారపడింది. బిజెపి అభ్యర్ధులకు ఓటు వేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ పట్ల మీరు అభిమానం చూపినట్లే అంటూ బసవరాజ్‌ బొమ్మై ఎన్నికల ర్యాలీల్లో చెబుతున్నారు. మోడీకి ఓటు వేయాలంటూ ఇలా విజ్ఞప్తి చేయడం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలను గుర్తు చేస్తోంది. 'బిజెపి అభ్యర్ధిని మీరు గుర్తుంచుకోనక్కరలేదు, కేవలం కమలం చిహ్నాన్ని గుర్తుంచుకోండి. కమలానికి ఓటు వేయడమంటే మోడీకి ఓటు వేసినట్లే' అంటూ మోడీ తన ప్రసంగాల్లో పిలుపు ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏమవుతుందో మనకు తెలుసు-బిజెపి ఓడిపోయి, ప్రభుత్వాన్ని కోల్పోవడం తథ్యం.
        బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి గణనీయమైన రాజకీయ, సైద్ధాంతిక ప్రభావాన్ని కలిగివున్న ఏకైక దక్షిణాది రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి హిందూత్వ శక్తులకు పెద్ద ఎదురుదెబ్బ కాగలదు. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి తీవ్రమైన సవాలును విసిరేందుకు లౌకిక, ప్రజాతంత్ర ప్రతిపక్ష ఐక్యతను ఇది మరింత వేగవంతం చేస్తుంది.
 

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)