
దేశంలో వ్యక్తులకూ వ్యవస్థలకు కూడా స్వేచ్ఛా స్వాతంత్య్రాలు హరించబడుతున్న సమయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హడావుడి సాగుతున్నది. దేశమంటే మట్టి కాదోరు..దేశమంటే మనుషులోరు అన్నట్టు దేశ ప్రజల హక్కులు, అవస్థలతో నిమిత్తం లేకుండా ప్రధాని మోడీ హయాంలో భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవిస్తోందనే మోత మోగుతున్నది. ఈ ఉత్సవానికి పతాకాలు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే ప్రగతి ఎక్కడనే ప్రశ్న కూడా ఎదురైంది. స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేంద్రానికి ఈ సమయంలోనే తాళాలు పడ్డాయి. ఎగువసభ నడుస్తుండగానే అక్కడి ప్రతిపక్ష నాయకుడిని సమన్లిచ్చి పిలిపించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) విచారణ జరిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలకు కూడా ఇదే గతి తప్పదని బిజెపి నాయకులు బెదిరిస్తున్నారు. మరోవైపున ఇ.డి ఈ విధంగా చేయడం రాజ్యాంగబద్దమేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిస్తున్నది. పత్రికలకు పేరెన్నిక గన్న కేరళలో వీక్ వారపత్రిక కాళికాదేవి చిత్రాన్ని ప్రచురించిన తీరుపై నోటీసు ఇచ్చి క్షమాపణ చెప్పించడం జరుగుతున్నది. జాతీయ చిహ్నంలో సింహాలను గంభీరంగా కాకుండా క్రోధంగా మార్చిన అశోక చక్రం పార్లమెంటుపై మోడీ మాత్రమే ప్రతిష్టించారు. మోడీ సర్కారుపై విమర్శలు చేసినందుకు, మతోన్మాద పోకడలకు నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా పని చేస్తున్నందుకు ఎందరో మేధావులు, రచయితలు, హక్కుల ఉద్యమకారులు, పాత్రికేయులు జైళ్లలోనే స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్నారు. పాతికేళ్ల కిందట ఇండియా వెలిగిపోతోంది అని వాజ్‌పేయి హయాంలో స్వాతంత్య్ర దినోత్సవ యాభయ్యవ ఉత్సవాలు జరిగినప్పుడు రాజ్యాంగం తిరగదోడే ప్రయత్నం చూశాం. ఇప్పుడు మోడీ రెండవ దఫా పాలనలో పైకి ఏమీ చెప్పకుండానే ఆ రాజ్యాంగాన్ని తలకిందులు చేయడం చూస్తున్నాం. తారీఖులు, దస్తావేజులు అన్నట్టు ఈ సమయంలో బిజెపి అధికారంలో వుంది గనక వారు వీటిని జరపడం మినహాయిస్తే స్వాతంత్య్రోద్యమ భావాలన్నిటికీ వ్యతిరేకంగానే వారు చెలరేగిపోతున్నారు.
చరిత్ర వక్రీకరణ, నేతల హైజాక్
స్వతంత్ర పోరాటంతో ఏ సంబంధం లేని ఆరెస్సెస్, బిజెపిలు దానికి తామే గుత్తేదార్లమైనట్టు ప్రవర్తించడం చరిత్రను తారుమారు చేయడం చాలాసార్లు చెప్పుకున్నదే. మొదటి జాతీయపార్టీ అయిన కాంగ్రెస్‌లో తర్వాత ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీలో వేలాది మంది నేతలు, యోధులు అనేక విధాల త్యాగాలు చేశారు. ప్రాణాలర్పించారు. చెప్పాలంటే ఆ జాబితా చాలా పెద్దది. కాని బిజెపికి చెప్పుకోవడానికి కూడా అలాంటి ఒక్క వీరుడు లేడు. వారి వ్యవస్థాపకుడైన హెగ్డేవార్ కూడా బ్రిటిష్ వారికంటే మొఘలాయిలు ప్రధాన శత్రువులని ప్రచారం చేసిన వ్యక్తి. వారికి ప్రేరకుడైన వి.డి.సావర్కర్ బ్రిటిష్ వారి దయాభిక్షతో విడుదల చేయించుకున్న వ్యక్తి. జాతిపిత గాంధీజీ మత సామరస్య సందేశం గిట్టక నిలువునా కాల్చి చంపిన నాథూరాం గాడ్సేకు గురువు. సాంకేతిక కారణాలతో బయిటపడ్డాడు గాని లేకుంటే తననూ ఉరితీసేవారు. వాజ్‌పేయి హయాంలో సావర్కర్ విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించగా ఇప్పుడు సంఘపరివార్ ఆయన కూడా జాతిపితేనన్నట్టు మాట్లాడుతున్నది. గాంధీజీని ఏ పరిస్థితుల్లో గాడ్సే హత్య చేశాడో వాంగ్మూలంలో చెప్పిన విషయాన్ని ప్రశంసించే విధంగా అఖండ భారత్ చిత్రం ఈవారం విడుదల కానుంది. దీన్ని సెన్సార్ చేసేందుకు హైదరాబాదు లోని బోర్డు కార్యాలయం నిరాకరిస్తే ముంబై వెళ్లి మరీ చేయించుకున్నారు. అమృతోత్సవంలో గాంధీజి స్మృతికి ఇంతకన్నా కళంకం ఏముంటుంది?
గాంధీ గారి పేరును స్వచ్ఛభారత్‌కే పరిమితం చేసిన మోడీ సర్కారు...ఆయన ప్రాణాలర్పించిన మత సామరస్య సందేశమే...ఆయన బొమ్మ పెట్టుకుని మరీ వూడ్చిపారేసింది. స్వచ్ఛభారత్ అంటూ కక్షభారత్ తీసుకొచ్చింది. అమృతోత్సవాలను మొదలుపెట్టినపుడు గాంధీజీ చిత్రానికి ఏమాత్రం ప్రాధాన్యత లభించకపోవడంపై విమర్శలు వచ్చాయి. మరుగుపడిన వీరులను పైకి తేవడంపై కేంద్రీకరిస్తున్నామని కేంద్రం అప్పుడు జవాబు చెప్పింది. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో దేశభక్తి గీతంలో గాంధీ, నెహ్రూల ఫోటోలు చూడం. అప్పట్లో ఏదో సమర్థించుకున్న కథకుడు విజయేంద్రప్రసాద్ తర్వాత రాజ్యసభకు నామినేట్ చేయబడటం యాదృచ్ఛికం కాదు. సర్దార్ పటేల్‌ను కాదని నెహ్రూను ప్రధానిగా ఎంపిక చేయడం గాంధీ చేసిన పెద్ద తప్పని ఆయన తర్వాత ఇంటర్వ్యూలో తెలిసీతెలియని చరిత్ర చెప్పారు. వాస్తవం ఏమంటే సర్దార్ పటేల్ కూడా ఈ విషయంలో గాంధీని అభి నందిం చారు. గాంధీజీ హత్య సమయంలో ఆరె స్సెస్ పై నిషేధం విధించిందీ ఆయనే. తమ చరిత్రలో ఎవరూ స్వాతంత్య్ర యోధులు లేరు గనక బిజెపి ఆయనను హైజాక్ చేసింది. అక్కడ పటేల్ నుంచి ఇక్కడ అల్లూరి సీతారామరాజు వరకూ, హైదరాబాద్‌లో పోలీసు చర్య ద్వారా విలీనం వరకూ అదే తప్పు కథనం చెబుతూ బిజెపి మన కళ్ల ముందే చరిత్ర పాఠం మార్చేసింది. 1998లో తొలిసారి ఎల్.కె.అద్వానీ హైదరాబాదులో ఈ ప్రహసనం ప్రారంభించారు. పావు శతాబ్దంగా ఇదే చెప్పడం పెరుగుతున్న తరాలలో తప్పు భావనలు ప్రతిష్టించింది.
విభజన కోసం విద్వేష వ్యూహం
ఇంతకన్నా ప్రమాదకరమైంది మతాల మధ్య మరీ ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య విభజనను పెంచే విద్వేష వ్యూహం. కాంగ్రెస్ హయాంలో ముస్లింల పట్ల బుజ్జగింపు రాజకీయాలు అనుసరించారు గనక హిందూ మతం దెబ్బతిని పోయిందనే ప్రచారం. రాజ్యాంగం అన్ని మతాలకు సమాన హక్కులతో పాటు అల్ప సంఖ్యాకులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. రాజకీయ అవసరాల కోసం పాలక పార్టీలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్ని మతాలవారీ ఆకట్టుకోవడానికి లౌకికతత్వాన్ని నీరుగార్చడం వాస్తవం. దేశంలోనూ ఎక్కువ రాష్ట్రాలలోనూ ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ ఈ క్రమంలో అనేక పొరబాట్లు చేసిన మాట కాదనలేనిది. అయితే వాటితో ముస్లిం జన బాహుళ్యం పాముకున్నదేమీలేదు. వారిప్పటికీ గరీబు సాబ్‌లుగానే వున్నారు గాని అమీర్లయిపోలేదు. వివక్షలూ తప్పలేదు. ప్రసార భారతికి మాజీ చైర్మన్ ఎ.సూర్యప్రకాశ్ ఈ మధ్యనే వ్యాసం రాస్తూ సరికొత్త శక్తిగల హిందూ భావన తీసుకురావాలని ప్రతిపాదించారు. హిందువుల వల్లనే ఈ దేశం లౌకిక రాజ్యమైందనీ, హిందువులు తమ హక్కులను నొక్కి చెప్పాలనీ మదరాసాలను నియంత్రించాలనీ ప్రతిపాదించారు. హిందూత్వ రాజకీయ సారాంశం ఇదే. దేశంలో అత్యధిక మెజారిటీ హిందువులు గనక వారికి అగ్రస్థానం ఇవ్వాలనే ఈ వాదన ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. కాని ఈ శక్తులే ఇప్పుడు రాజ్యాన్ని శాసిస్తున్న ఫలితంగానే గోరక్షణ పేరిట మానవులపై మూక హత్యలకు కారణమవుతున్నది. శివం లేదా శవం అని కొందరంటుంటే ప్రతి మసీదులో శివలింగాలు వెతకక్కర్లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. అసలు ఏ మసీదులోనైనా ఎందుకు వెతకాలి? ఈ కపట నాటకమే గొప్ప ఉదారభావనగా మీడియా చిత్రిస్తున్నది. ప్రతిదీ మత కోణంలోనే చూడటం వల్లనే కాశ్మీర్‌లో 370 రద్దు, పాకిస్తాన్ పేరిట వైమానిక దాడులు, కోవిడ్ సమయంలో చప్పట్లు, దీపాలు ప్రతిదీ గొప్పగా చిత్రించబడతాయి. అమృతోత్సవంలో గరళం చిందే ఈ ధోరణులు అక్షరాలా అధికార పరివారం నుంచే రావడం అసలైన ముప్పు.
కొత్త రాష్ట్రపతి ఆహారం దాకా!
ఇది ముదిరి సమాజ స్థాయిలో వ్యక్తుల వేషభాషలపైనా ఆహార విహారాల పైనా ఆంక్షలకు దారితీయడం బాగా తెలిసిందే. ఇది ముస్లిములనే గాక ఇతర మతాలనూ ఆఖరుకు హిందూ మతంలోనే అణగారిన వర్గాలుగా వున్న దళితులు వెనకబడిన వారిని, అందరికన్నా ఎక్కువగా కొండకోనల్లో పుట్టిన గిరిజనులను పక్కకు నెడుతుంది. వారి సమస్యలకు సామాజిక న్యాయం కోణంలో హక్కులు సాధించుకోవాలని గాక హిందూత్వకరణమే పరిష్కారమైనట్టు చెబుతుంది. తాజాగా ఆదివాసి పేరిట ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసిన సర్కారు ఆమె రాష్ట్రపతి భవన్‌లో మాంసాహారం నిషేధించినట్టు కథనాలకు కారణమైంది. విమర్శలు పెరిగాక అదేమీ లేదని అయితే ఆమె తానుగా చాలా ఏళ్ల కిందటే మాంసాహారం మానేశారని సమాచార శాఖ ప్రకటన విడుదల చేసింది. అసలీ వివాదంతో అర్థమయ్యేది ఒకటే. ఆహారంపై ఆంక్షలు ప్రథమ పౌరురాలి దాకా పాకాయన్నమాట. ఆర్య, ద్రావిడ జాతులనే భావం సరికాదని, అందరూ ఒకే మూలం కలిగివున్నారని తమిళనాడు గవర్నర్ ఈ మధ్యనే అసందర్భ ప్రసంగం చేశారు. పంచగౌడ పంచద్రవిడ అని మంత్రం జపించే ఆరెస్సెస్ పరివార్ ద్రవిడ జాతి ఉనికిని, ప్రత్యేకతలను గుర్తించదన్న మాట. ద్రావిడ ఉత్కళ వంగ అన్న జాతీయగీతం వారికి నచ్చదు. ఆరెస్సెస్ చెప్పే అఖండ భారత్ ఆచరణలో ఒకే దేశం ఒకే మతం ఒకే పార్టీ ఒకే మోడీ అయింది. రాష్ట్రాల ఉనికినే తోసిపుచ్చి, క్యాబినెట్ పార్లమెంటు వంటివాటిని కూడా ఉల్లంఘించి ఏకపక్ష పాలన చేస్తున్నది.
కీర్తన కాదు, రక్షణే కర్తవ్యం
ఇందిరాగాంధీ ఎమర్జన్సీని నిరంతరం ఖండించే ఆరెస్సెస్ అధినేత గోల్వాల్కర్ ఆ రోజుల్లో ఆమెకు లొంగుబాటు లేఖ కూడా రాశారని మర్చిపోరాదు. అప్పట్లో అరెస్టు చేయబడి తర్వాత జనతా ప్రభుత్వంలో మంత్రులై దాన్నీ కూలగొట్టిన నాటి జనసంఫ్‌ు పెద్దలే ఆ పేరు కలుపుకొని భారతీయ జనతాపార్టీ స్థాపించారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకతను మత మార్గం పట్టించడం వారి ప్రాథమిక వ్యూహం. మోడీ హయాంలో అది పరాకాష్టకు చేరింది. వామపక్షాల బలం గణనీయంగా వున్నంతకాలం ఈ పాచికను అడ్డుకుంటూ వచ్చాయి. రాజకీయ స్వార్థం, అదే ఆర్థిక విధానాల అమలు కారణంగా ప్రాంతీయ పార్టీలు, అస్తిత్వ పార్టీల నేతలు అవకాశవాదంతో బిజెపికి లోబడటం ఈ పరిస్థితి మార్చేసింది. ఆ విధంగా కేంద్రీకృత పెత్తనంతో మతతత్వంవైపు భారత దేశ గమనం మరలించబడింది. కార్పొరేట్ చోదిత మతతత్వ పూరిత విధానాలతో మోడీ సర్కార్ సామ్రాజ్యవాద అమెరికాకు లోబడిపోయి సార్వభౌమత్వానికీ ముప్పు తెచ్చింది. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు, పార్లమెంటు, కాగ్ తదితరాల స్వయం ప్రతిపత్తికీ ప్రణాళికా సంఘం, ఫెడరలిజం, సామాజిక తత్వంతో సహా రాజ్యాంగ విలువలన్నిటికీ ఎసరు పెడుతున్నది. ప్రభుత్వ సంస్థలన్నీ వరసగా అమ్మేయడమే గాక రూ. కోటిన్నర కోట్ల అప్పులో దేశాన్ని ముంచేసింది. ఉద్యమాలతో రచనలతో వీటిని ప్రశ్నించేవారిని జైళ్లపాలు చేస్తూ అప్రకటిత ఎమర్జన్సీలోకి దేశాన్ని నెట్టింది. కనుకనే 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకగా గాక స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని, భావ స్వేచ్ఛనూ రక్షించుకోవాల్సిన సందర్భమవుతున్నది.
తెలకపల్లి రవి