Aug 10,2023 14:31

ప్రజాశక్తి కాకినాడ : చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు, రక్తహీనత సమస్యలు లేకుండా చూసేందుకు అల్బెండజోల్ మాత్ర ఉపయోగపడుతుందని కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. గురువారం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనగర్ మున్సిపల్ హైస్కూల్లో కలెక్టర్ కృత్తికా శుక్లా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు అందించారు. అనంతరం కలెక్టర్ కృత్తికా శుక్లా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి, ఆగస్టులో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని మిషన్ మోడ్ లో జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. నులిపురుగులు ఉంటే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదని, పోషకాల శోషణ సరిగా జరగదని, ఎదుగుదలకు సమస్యలు ఎదురవుతాయని వివరించారు. అందువల్ల నులిపురుగులను నిర్మూలించేందుకు ఒకటి నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో గురువారం ఉచితంగా మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఆగస్టు 17వ తేదీన స్పెషల్ డ్రైవ్ కింద ఇంటింటి సర్వే చేసి మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియలో ఆశాలు ,ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు భాగస్వామ్యం అవుతున్నారని కలెక్టరు కృతికా శుక్లా తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఆర్. రమేష్, ఆర్బీఎస్కే సమన్వయకర్త డా. కె. సత్యనారాయణ, ఎంహెచ్వో డాక్టర్ కె. పృథ్వి చరణ్, డిప్యూటీ డీఈవో డేనియల్ రాజు, డెమో ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.