Apr 05,2023 07:19

          దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం మరోసారి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో వందకుపైగా కేసులు నమోదైతే, మార్చి నెలాఖరు నాటికి మూడు వేల మార్కుకు చేరుకుంది. మంగళవారం కూడా మూడు వేలకుపైగా కేసులు, తొమ్మిది మరణాలు సంభవించాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 21 వేలు దాటిపోయింది. రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌, మాజీ సిఎం వసుంధర రాజె వంటి ప్రముఖులు సైతం వైరస్‌ బారినపడ్డారు. టెస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉన్న నేపథ్యంలో కేసుల సంఖ్య అంతకన్నా మరిన్ని రెట్లు ఎక్కువగానే ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్‌ విజృంభణకు వైరస్‌ తరచూ మ్యుటేషన్‌ జరగడమే ప్రధాన కారణం. ఇప్పటివరకూ 700కుపైగా వేరియంట్లు పుట్టుకొచ్చాయి. వాటిలో ప్రస్తుతం హెచ్‌1ఎన్‌1, హెచ్‌3ఎన్‌2, డెల్టా, ఒమిక్రాన్‌, దాని సబ్‌ వేరియంట్లయిన బిఎ1, బిఎ2, ఎక్స్‌ఇ తదితరాలు విజృంభిస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు మూడేళ్ల క్రితం నాటితో పోల్చితే స్వల్పమే అయినప్పటికీ... ఇదేవిధంగా పెరుగుదల నమోదైతే మరింత కష్టం. కనుక కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలతో కదలాలి.
ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, కేరళలో ఉధృతి అధికంగా ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు తదితర చోట్ల కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. కరోనా వైరస్‌లో జన్యుపరమైన వేరియంట్లను గుర్తించడానికి 50కి పైగా ప్రయోగశాలలతో కూడిన 'ఇండియన్‌ సార్క్‌- కోవ్‌ - 2 జీనోమిక్స్‌ కన్సార్టియమ్‌' (ఇన్సాకాగ్‌) కృషి చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ పాజిటివ్‌ నమూనాలను ఇన్సాకాగ్‌ ల్యాబ్‌లకు పంపి, జన్యు నిర్మాణ క్రమాన్ని విశ్లేషిస్తే కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు కనిపెట్టి, చర్యలు తీసుకునేందుకు అవకాశముంది. గత నెలలో ప్రధాని కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 'టెస్టింగ్‌ - ట్రాకింగ్‌ - చికిత్స -టీకా - కోవిడ్‌ అప్పట్లోనే సూచనలు జారీ చేసింది. దేశంలో ఇప్పటివరకూ 220.60 కోట్లకుపైగా డోసులు పంపిణీ జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఎక్కువమంది కోవిడ్‌ బారినపడటంతో రోగనిరోధక శక్తి ఉండటం కూడా తాజా వేరియంట్లను ఎదుర్కోవడానికి కొంత అవకాశంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. నాటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే... 'గంగ... శవ గంగ'గా మారిందన్న ఓ కవయిత్రి ఆవేదన, శ్మశానాల ముందు బారులు తీరిన మృతదేహాలు, ఒకేసారి వందలాదిగా సాగిన అంత్యక్రియలు, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పూర్తిస్థాయిలో సరఫరా కాక ఆగిన మరణాలు, ఆప్తులను, కుటుంబ పెద్దలను కోల్పోయి తల్లడిల్లిన కుటుంబాలు, చివరి చూపునకూ నోచని వైనాలు, కోవిడ్‌ మరణాలను సక్రమంగా నమోదు చేయలేదన్న విమర్శలు... కళ్ల ముందు కదలాడతాయి.
       ఇంత జరిగినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరులో మార్పు వచ్చిందా అంటే రాలేదనే చెప్పాలి. ఐసియులు, పడకలు, ఆక్సిజన్‌ ప్లాంట్లు, సరఫరా తదితర అంశాలపై శ్రద్ధ అంతంతమాత్రంగానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనే ప్రతిరోజూ 400 పైగా కేసులు నమోదవుతున్నాయి. హృదయ, ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్‌ బాధపడుతున్న వారు కోవిడ్‌ని ఎదుర్కొనేందుకు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి కావడానికి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉందంటున్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర జాగ్రత్తలు పాటించడం ద్వారా దీనికి కొంతమేర అడ్డుకట్ట వేయవచ్చు. ప్రభుత్వాల తీరులోనూ సన్నద్ధత మరింత పెరగాలి.
        కోవిడ్‌ బాధితులకు పూర్తిస్థాయి వైద్యం అందించేలా అన్ని ప్రభుత్వాసుపత్రులనూ సిద్ధం చేయాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిబంధనల ప్రకారం అడ్మిట్‌ చేసుకోవడం మొదలు అక్రమంగా అధిక బిల్లులు వసూలు చేయకుండా కట్టడి చేయడమూ సర్కారు బాధ్యతే! వైరస్‌ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు, వ్యాధి సోకినా తట్టుకునేవిధంగా జాగ్రత్తలు పాటించడం మనందరి బాధ్యత.