Jan 22,2023 07:53
  • ది గార్డియన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలైదా

చిన్నప్పుడు మేము పాపి (తండ్రి)తో గడిపిన రోజులు తక్కువ. అతను బొలీవియాలో ప్రాణతర్పణ చేసే నాటికి (1967 అక్టోబరు 9 నాటికి) నాకు కేవలం ఆరు సంవత్సరాలు. మా అమ్మే మాకు విలువలు నేర్పింది. మా నాన్న చనిపోయిన తరువాత చాలా కాలం వరకు ఆయన స్మృతులను గుర్తు చేస్తూ ఆయనను సజీవంగా ఉంచింది. మాకు ఏదైనా చెప్పడానికి లేదా మమ్మల్ని బెదిరించడానికి ఆమె ఆయనను ఎప్పుడూ ఉపయోగించలేదు. మా పాపి మంచివాడు.
నా తల్లితో వున్న చే గువేరా నల్గురి పిల్లల్లో నేనే పెద్దదాన్ని. అర్జెంటీనా విప్లవకారుడిగా, గెరిల్లా నాయకుడిగా, క్యూబన్‌ విప్లవంలో ప్రముఖుడిగా మా తండ్రి ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. అయినా, మాది ఒక సాధారణ కుటుంబం. ఆయన కూతురిగా నేనెప్పుడూ ప్రత్యేకమని భావించలేదు. ఒకరినొకరు అమితంగా ప్రేమించుకునే దంపతుల బిడ్డ కావడమే ప్రత్యేకంగా భావించాను. చిన్నప్పుడు మేము పాపి (తండ్రి)తో గడిపిన రోజులు తక్కువ. అతను బొలీవియాలో ప్రాణతర్పణ చేసే నాటికి (1967 అక్టోబరు 9 నాటికి) నాకు కేవలం ఆరు సంవత్సరాలు. మా అమ్మే మాకు విలువలు నేర్పింది. మా నాన్న చనిపోయిన తరువాత చాలా కాలం వరకు ఆయన స్మృతులను గుర్తు చేస్తూ ఆయనను సజీవంగా ఉంచింది. మాకు ఏదైనా చెప్పడానికి లేదా మమ్మల్ని బెదిరించడానికి ఆమె ఆయనను ఎప్పుడూ ఉపయోగించలేదు. మా పాపి మంచివాడు. మేము ఎన్నడూ ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలను కోరుకోలేదు. అటువంటి వాటికి మా నాన్న వ్యతిరేకం. మా అమ్మ కూడా అదే పంథాను కొనసాగించింది. నల్గురు చిన్న పిల్లలతో ఆమె ఒంటరి జీవనం సాగిస్తున్నప్పుడు మా నాన్న స్నేహి తులు మాకు సాయం చేయాలనుకున్నారు. మా అమ్మ దానిని అంగీకరించ లేదు. ఆయన మరణంతో కోల్పోయిన ఆ ఆప్యాయత, అనురాగాన్ని ఈ భౌతిక వస్తువులేవీ పూడ్చలేవని చెప్పింది. 'మీరు మీ కాళ్లపై నేల మీద నిలబడండి. మీరు సంపాదించనిదేదీ మీ దగ్గర ఉండకూడదు, వాటిని ఇతరు లకు ఇచ్చేయండి' అని మా అమ్మ మాకు చెప్పింది. అదొక ముఖ్యమైన పాఠం.
మేము కష్ట కాలాలను చూశాము. నా యుక్త వయసులో మా అమ్మ తన పాత బ్లౌజు మెటీరియల్‌తో మా తమ్ముళ్లకు ప్యాంటు తయారుచేసేది. ఆడుతూ, పాడుతూ ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాళ్లం. మా గుంపులోని క్యూబన్‌ పిల్లలందరిల్లాగే మేమూ పెరిగాము. ఫైడెల్‌ నాకు అత్యంత ఆత్మీయులు. ఆయనను నేను ఎప్పుడూ 'మామయ్య' అనే పిలిచేదాన్ని. ఫైడెల్‌ తుది శ్వాస విడిచే దాకా ఆయన నుంచి ఆ ఆత్మీయత, అనురాగం పొందుతూ వచ్చాను. మా నాన్న , ఫైడెల్‌ ఎప్పుడూ సరదాగా, సంతోషంగా ఉండేవారు. జోకులు వేసుకుంటూ నవ్వుకునేవారు. వారి మధ్య పరస్పర గౌరవం, నమ్మకం ఎప్పుడూ చెక్కు చెదరలేదు. మా పాపి చనిపోయినప్పుడు పిల్లలమైన మాకు ఆ వార్తను ఫైడెల్‌ తెలియజేయాలనుకున్నాడు. మా అమ్మ అది తన డ్యూటీ అని నొక్కి చెప్పింది. 'యుద్ధంలో తాను చనిపోతే, తన కోసం ఏడవకూడదు. ఎందుకంటే తాను సాధించాలనుకున్న దానిని సాధించడం కోసం చేసే ప్రయత్నంలో ప్రాణాలొదలాల్సి వస్తుంది గనుక ఆ అవసరం లేదని మీ తండ్రి లేఖ రాశారనీ' ఫైడెల్‌ మాకు చెప్పాడు. ఆ మరుసటి రోజు కంటతడిపెడుతున్న మా అమ్మను చూశాను. ఆమె నన్ను మంచం మీద కూర్చోబెట్టుకుని పాపి నుంచి వచ్చిన ఆఖరి ఉత్తరాన్ని తీసి చూపించారు. ' ఈ ఉత్తరం మీకు చేరేసరికి ఇకపై మీతో నేను లేనని మీరు తెలుసుకుంటారు.' అని ఆ లేఖలో పాపి పేర్కొన్నారు. ఆ లేఖ చాలా చిన్నది. 'ఇదిగో తండ్రి నుంచి ఒక పెద్ద ముద్దు' అన్న పదాలతో ఆ లేఖ ముగించారు. నాకు అప్పుడు అర్థమైంది తండ్రి ఇక లేరన్న సంగతి! నాలో దుఃఖం తన్నుకొచ్చి బోరున ఏడ్చాను.