
ఈ ధరిత్రికి ఏమైంది..? ఒకవైపు నీరు, గాలి, ధ్వని, కాలుష్యం.. మరోవైపు ప్రకృతి విధ్వంసం. 'యుగయుగానికి ప్రకృతిని చూసే విధానంలో మార్పురావొచ్చు. కానీ.. ప్రకృతి మాత్రం మారదు' అంటారు ప్రసిద్ధ ప్రకృతి తత్వవేత్త మసనోబు ఫుకుఓకా. నిజానికి ప్రకృతి మారడం లేదా? ప్రకృతిలో మార్పు రాదా? వంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే.. ప్రకృతి స్వభావంలో మాత్రం ఎటువంటి మార్పూలేదు. వచ్చిందల్లా.. అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం.. ప్రకృతి సహజ గమనానికి అడ్డుతగులుతోంది. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. కాలాలు తిరగబడుతున్నాయి. అడవులు అంతరిస్తున్నాయి. నీటి వనరులు తరిగిపోతున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. గనులు కనుమరుగవుతున్నాయి. సాగునేలలు తగ్గిపోతున్నాయి. కరువులు పెచ్చరిల్లుతున్నాయి. అకాల వర్షాలు సాధారణమవుతున్నాయి. తాగు, సాగు నీటి కష్టాలు పెరుగుతున్నాయి. తిండి గింజలు కరువవుతున్నాయి. ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలివి. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నెన్నో సవాళ్లు. ప్రకృతి సహజ ఆకృతిని కోల్పోతుండటంతో జీవుల వునికి ప్రశ్నార్థకం అవుతోంది.. మానవుడి వికృత క్రీడలో ధరిత్రి దారుణంగా మోసపోతోంది. తన సహజసిద్ధమైన పచ్చదనాన్ని కోల్పోతోంది. ఈ విధ్వంసక ప్రయత్నాలు శతాబ్దాలుగా జరుగుతూనే వున్నా.. ఇటీవల కాలంలో మరింత ఊపందుకున్నాయి. మానవాళి ప్రశాంతంగా జీవించాలంటే ప్రకృతి, పర్యావరణం సజావుగా ఉండాలి. అప్పుడే భూమి నిండుకుండలా తొణికిసలాడుతుంది. పుడమితల్లి పచ్చదనం సంతరించుకొని కళకళలాడుతుంది.

విశ్వంలో అతి పెద్ద గ్రహం.. భూమి. పంచభూతాలలో ప్రధానమైనది.. భూమి. గాలి, నీరు ఆవరించి వున్నది కూడా ఈ భూమిపైనే. జీవుల మనుగడకు నిలయమైన ఆవరణ ఈ నేలే. ఇలాంటి భూమికి ముప్పు వాటిల్లుతోంది. అడవుల నరికివేత, కాలుష్య కారకాలు, విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియోగం, ఖనిజ వనరుల పేరిట జరుగుతున్న దోపిడితో ధరిత్రీ విలాపం రోజురోజుకూ అధికమౌతోంది. భూమిలోని వనరులన్నీ దోపిడీకి గురై.. తన సహజశక్తిని కోల్పోతున్నది. భూమికి తూట్లు పొడుస్తోన్న మైనింగ్ కార్యకలాపాలతో వాతావరణమే కలుషితమై జీవావరణం దెబ్బతింటోంది. విపత్తులు, ప్రకృతి ప్రకోపాలు విజృంభించి, నానాటికి సాగు చిక్కిపోతోంది. వనరుల లూటీ, పారిశ్రామిక కాలుష్యం కారణంగా భూతాపం పెరుగుతోంది. నిస్సారమౌతున్న భూమితో జీవజాతులకు ఆహారం, నీటికొరత ఏయేటికాయేడు అధికమౌతోంది. ఆహారభద్రత కరువై, పేదరికం, పౌష్టికాహార సమస్య పెను ముప్పులా ప్రపంచాన్ని వణికిస్తోంది. భూగోళం మీద మానవజాతి మనుగడ సాగాలంటే.. ముందు తిండి కావాలి. కేవలం వ్యవసాయోత్పత్తుల వల్లే భూగోళం వేడెక్కుతుందన్న వాదన అర్థరహితం. భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణం అభివృద్ధి చెందిన దేశాలు అవలంబిస్తోన్న అభివృద్ధి వ్యూహం. ఏ నియంత్రణ లేకుండా తరిగిపోయే ఇంధన వనరుల మీద ఆధారపడి, విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్న మాట. వాతావరణ మార్పులపై 2030 నాటికి కర్బన్ ఉద్ఘారాలను తగ్గించాలని పారిస్ ఒప్పందంలో చేసిన ప్రతిజ్ఞ నెరవేరకపోవచ్చని ఇటీవలే ఐరాస నివేదిక తేటతెల్లం చేసింది. ఉన్న భూమిని నాశనం చేసుకుంటూ.. చంద్రమండలం వైపు అడుగులేస్తున్నాడు మనిషి. ఎంత ఎత్తు ఎదిగినా.. కాళ్లు నేల మీదే వుండాలి. గాలి, నీరు, నేల, నింగి, నిప్పు అనే పంచభూతాలు సవ్యంగా వుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. జీవజాతులకు హాని కలుగుతుంది.
- హరించిపోతున్న అడవులు..
'వృక్షో రక్షతి రక్షిత:' అనే ఆర్యోక్తిని శిరస్సున ధరించాల్సిన మనిషి.. ఆ నినాదాన్ని 'వృక్షో భక్షతి భక్షిత:'గా తలకెత్తుకున్నాడు. ఫలితంగా అడవుల నరికివేత తీవ్రతరమౌతోంది. దాని పర్యవసానమే భూ తాప తీవ్రత. మనిషి బుద్ధికి చెద పట్టిన దరిమిలా.. మొత్తం ప్రకృతినే లోకువ కట్టడంతో భూతాపం తీవ్రంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల విస్తీర్ణంలో విస్తృతంగా వున్న శతాబ్దాల నాటి చెట్లు నేలకొరిగిపోతున్నాయి. మానవుడి స్వార్థానికి ముక్కలై ఇళ్లలో అలంకార వస్తువులుగా మారుతున్నాయి. వాస్తవానికి 160 కోట్ల ప్రజలకు ఆహార భద్రత, ఇంధన వనరులతో పాటు జీవన వనరులను అడవులు కల్పిస్తున్నాయి. అయితే, ప్రపంచ మానవాళి ధనదాహానికి ఇప్పటికే 46 శాతం అడవులు కనుమరుగయ్యాయి. పట్టణీకరణ, జనాభా పెరుగుదల వల్ల.. వచ్చే 200 ఏళ్లలో 54 శాతం అడవులు హరించుకుపోవచ్చని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మన దేశం విషయానికొస్తే.. 33.3 శాతం అడవులు వుండాలి. కానీ, 21 శాతానికి మించిన వన సంపద లేదు. విలువైన వనాలు నరికేస్తున్నా అడ్డుకునే వారే కరువయ్యారు. ఫలితంగా 420 కోట్ల సంవత్సరాల ధరణీతలం.. అభివృద్ధి పేరుతో జరుగుతున్న భీభత్సం కారణంగా.. రాబోయే 80 సంవత్సరాలలో బూడిద కాబోతోంది. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవజాతి క్రమంగా అంతరించిపోతున్నది. ఇప్పటికే కొన్ని జీవజాతులు అంతరించిపోయాయి. 2100 కల్లా ఈ భూమి మీద మానవుడు బతికే పరిస్థితి ఉండదని పలు పరిశోధనలు నొక్కి చెప్తున్నాయి. మనిషి చేసే కాలుష్యం వల్ల సమస్త భూగోళం వినాశనం దిశగా అడుగులేస్తోంది.
- భావితరాలకు అన్యాయం..
భావితరాలకు చక్కటి ఆహ్లాదకరమైన భూమిని ఇవ్వవలసిన మనం.. కలుషితమై, పర్యావరణ వినాశనం వైపు దూసుకుపోతున్న కరకు నేలను ఇవ్వబోతున్నామా? ఇంతటి విపత్కర పరిస్థితిలో వున్న భూగోళాన్ని పరిరక్షించే చర్యలు ఎందుకు చేపట్టలేదని మనల్ని మనం ప్రశ్నించుకుంటే దొరికే సమాధానం ఏమిటి? దీనికి ఎవరిని బాధ్యులను చేయగలం? ప్రకృతి వనరులను యధేచ్చగా దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులనా? ఆ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాధినేతలనా? కళ్ల ముందే దోపిడీకి గురవుతున్న ధరిత్రీ విలాపాన్ని చూస్తూ కూడా ప్రశ్నించలేని మనమేనా? ఏం చెప్పగలం?

- అవగాహనతోనే పరిరక్షణ..
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉందంటే మాత్రం సమాధానం శూన్యం. ధరిత్రీ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు గానీ, హాని కలిగించకుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం. అటు పర్యావరణం, వాతావరణంతో పాటు మనిషి జీవన శైలిలో రావలసిన మార్పుల ద్వారా.. భూ పరిరక్షణపై అవగాహన కల్పించాలి. ఈ క్రమంలోంచి వచ్చిందే 'ప్రపంచ ధరిత్రీ దినోత్సవం'. ప్రతియేటా ఏప్రిల్ 22న నిర్వహించే ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తుంది. ప్రపంచదేశాలకు తమ పంథాను మార్చుకోమని చెపుతూ.. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు ధరిత్రీ దినోత్సవంలో భాగమవుతున్నాయి. చాలా నగరాల్లో భూమితో మానవాళికి వున్న సంబంధాన్ని తెలుపుతూ.. అనేక కార్యక్రమాలు, ప్రచారంతో 'ధరిత్రి వారం' నిర్వహిస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్ 16తో మొదలై.. ఏప్రిల్ 22తో ఇవి ముగుస్తాయి. ఈ క్రమంలో నిర్వహించే కార్యక్రమాలు పర్యావరణంతో నడుచుకునే విధానాన్ని ప్రోత్సహించటానికి తోడ్పడతాయి. వాస్తవానికి ధరిత్రీ దినోత్సవం అనేది - భూమి, పర్యావరణానికి సంబంధించిన పండుగ. ప్రతి సంవత్సరమూ నిర్వహించుకునే ఒక చారిత్రక ఘట్టం. మనం భూమికి ఎంత సన్నిహితంగా అనుసంధానించబడి వుంటామో.. అంతే సన్నిహితంగా ఆ భూమిని రక్షించుకుంటాం. అది మన బాధ్యత.
- మన చేతుల్లోనే.. మన భవిత..
విశ్వంలో మానవజాతిలాంటి జీవులను కలిగి వున్న ఒకే ఒక గ్రహం భూమి. దీనిపై జీవావిర్భావం దాదాపు 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగింది. విశ్వంలో మనలాంటి జీవాలు గల ఇతర గ్రహం మరేదైనా ఉందా అనే దిశలో పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. ఇప్పటి ధరిత్రిని అస్థిరపరిచే ఎన్నో చర్యలు కొనసాగుతున్నాయి. ధరిత్రిలోని అన్ని జీవాలను పలుమార్లు పూర్తిగా నాశనం చేయగల అణుబాంబులు అమెరికా వంటి పలుదేశాల దగ్గరున్నాయి. వీటిని సమకూర్చుకోడానికి మరికొన్ని దేశాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. అణు యుద్ధాలు జరిగితే ప్రపంచ వినాశనాన్ని కోరి తెచ్చుకున్నట్లే. అణు యుద్ధాలను నివారించడంతో పాటు భూతాపాన్ని చల్లార్చే చర్యలకు పూనుకోకపోతే మన భవిష్యత్తు మన చేతిలో నుంచి జారిపోతుంది.

- భూమి బాగుంటేనే..
'నీతల్లి మోసేది నవమాసాలేరా.. ఈ తల్లి మోయాలి కడవరకురా.. కట్టె కాలేవరకురా' అంటాడో కవి. మనము.. మన పిల్లలు.. వారి పిల్లలు- తరతరాలు సురక్షితంగా వుండాలంటే.. సమృద్ధిగా ఆహారాన్ని తీసుకోవాలంటే- ఈ భూమిని కాపాడుకోవాలి. ఈ ధరిత్రి బాగుంటేనే ఈ భూమిపై ఆవాసమై వున్న జీవజాతులు బాగుంటాయి. ఈ ధరణి కాలుష్య కాసారమైతే.. భవిష్యత్తు అంథకారమే. ఈ హెచ్చరికనే ధరిత్రీ దినోత్సవం మరోసారి గుర్తు చేస్తోంది. అనాలోచిత మానవ చర్యల వల్ల కలుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించాలన్న బృహత్తర లక్ష్యంతో ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్ల భూగోళం అమితంగా వేడెక్కిపోతోంది. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడడం వల్ల వాయుకాలుష్యం పెచ్చుమీరుతోంది. పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. వ్యవసాయంలో రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పదికాలాలపాటు పదిలంగా చూసుకోవాల్సిన భూమిని నిస్సారంగా మార్చుతున్నాం.
- రసాయనాలతో పెనుముప్పు..
నేలంటే నిర్జీవ పదార్థం కాదు. లక్షలాది జీవజాతులు, పోషకాలతో కూడిన జీవావరణం. వ్యవసాయం కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చుతున్నాయి. జీవం కోల్పోయిన నేల.. రసం పిండేసిన పిప్పిలా మారిపోయింది. అటువంటి నేలలో దిగుబడులు కూడా నాసిరకంగానే వుంటాయి. రసాయనిక ఎరువులతో దిగుబడులను పెంచుకోవాలనే దురాశ భూమిని మరింత నిర్జీవంగా మార్చుతున్నది. దీర్ఘకాలంలో దిగుబడులు మరింత తగ్గిపోయి, ఆహార సంక్షోభాలకు దారితీసే ముప్పు పొంచి ఉందని ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఆలివర్ డి షట్టర్ హెచ్చరిస్తున్నారు. పర్యావరణ అనుకూల విధానాలవైపు మళ్లడం తప్ప మరో మార్గంలేదని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల పర్యావరణ అనుకూల చర్యలను చేపట్టాలన్నది ఈ ఏడాది ధరిత్రీ దినోత్సవం లక్ష్యంగా పెట్టుకుంది.
- మనమేం చేద్దామంటే..
ఈ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మనవంతు కృషి చేయాలని నిర్ణయించుకుంటే.. పెద్దపెద్ద నిర్ణయాలు ఏమీ తీసుకోనక్కరలేదు. కఠినమైన ప్రతిజ్ఞలు చేయనవసరంలేదు. ఆకుపచ్చ పుడమి కోసం.. మన రోజువారీ అలవాట్లు, కార్యక్రమాల్లో కొంత మార్పు చేసుకుంటే చాలు. మనం వాటిని సరిగ్గా పాటించడంతో పాటు, కుటుంబంలోని ప్రతి ఒక్కరితోనూ పాటించేలా చేస్తే సరి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినట్లే. 'నేను సైతం/ ప్రపంచాబ్జపు/ తెల్లరేకై పల్లవిస్తాను/ నేను సైతం/ విశ్వవీణకు/ తంత్రినై మూర్చనలు పోతాను' అంటాడు మహాకవి శ్రీశ్రీ. అలాగే ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ ముందుకు అడుగేయాల్సిన సమయం ఇది.

- ఇవి తెలుసుకోండి..!
- చిన్నచిన్న పనుల కోసం బయటికి వెళ్లేటప్పుడు బైక్, కారు కాకుండా నడిచి వెళ్ళడం లేదా సైకిల్‌పై వెళ్లడం ఉత్తమం.
- పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగించండి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించండి.
- పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్ బాటిల్స్, బ్యాగ్‌లనే ఉపయోగించండి.
- అవసరం లేనప్పుడు విద్యుత్ బల్బులను ఉపయోగించొద్దు.
- స్థానిక మార్కెట్‌లోనే షాపింగ్ చేయండి, స్థానికంగా దొరికే ఆహారాన్నే వినియోగించాలి. కాటన్, పేపర్ సంచులనే వాడాలి.
- పిల్లలకు ధరిత్రి దినోత్సవ పద్యాలను, పాటలను, కవితలను నేర్పాలి. వ్యాస రచన పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. వారికి ప్రకృతి, పర్యావరణం పట్ల అవగాహనను, ఇష్టాన్ని పెంచాలి.
- పర్యావరణ సమస్యల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే.. ఎదుటివారికి అంతగా వివరించగలం.
- సాధ్యమైనంత వరకూ రీసైక్లింగ్‌కు అవకాశం ఉండే వస్తువులనే ఉపయోగించాలి.
- ప్లాస్టిక్, డిస్పోజబుల్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి.
- మన ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాల్లో భూగోళ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మానవాళి పురోగమన చర్యలకు తోడ్పడండి. ధరిత్రి పరిరక్షణకు స్ఫూర్తిని పెంచుకోండి.
- ప్రకృతి వనరులను కొల్లగొట్టే సామ్రాజ్యవాద, కార్పొరేట్ శక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలి.
- సోషల్ మీడియాలో చవaత్‌ీష్ట్రసay2023 అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించడం ద్వారా ధరిత్రీ దినోత్సవ అవగాహనను పెంచుకోవచ్చు.
- 53 ఏళ్ల చరిత్ర ..
వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి మన సమయం, వనరులు, శక్తిని అంకితం చేయడానికి నిర్ణయం తీసుకునే ఒకరోజు ఇది. ఏప్రిల్ 22, 2023 ఆధునిక పర్యావరణ ఉద్యమం ఆవిర్భవించి 53 ఏళ్లు పూర్తయ్యాయి. పర్యావరణ స్పృహ వేడుక ప్రపంచవ్యాప్తంగా 193కి పైగా దేశాలలో జరుగుతుంది. ఈ రోజున ర్యాలీలు, కచేరీలు, ఉపన్యాసాలు, చెట్ల పెంపకానికి సంబంధించిన కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భూమి పరిరక్షణకు మద్దతు తెలుపుతారు. ఈ నేలను రక్షించడంలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ ధరిత్రీ దినోత్సవాన్ని మొట్టమొదట 1970, ఏప్రిల్ 22న జరుపుకున్నారు.
'ధరిత్రీ దినోత్సవం 2023' ఒక శక్తిమంతమైన సందేశంతో కూడిన గ్లోబల్ ఈవెంట్. వాతావరణంలో మార్పుల గురించి మరింతగా తెలుసుకోవడానికి స్థానికంగా జరిగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొనాలి. లేదా కనీసం మద్దతునైనా తెలియజేయాలి. ఇందుకోసం మనం వెచ్చించే ప్రతి నిమిషమూ మన ధరిత్రి పరిరక్షణకు వెచ్చించినట్లే. మన భూమిని మనమే కాపాడుకుందాం. చెట్లు నాటుదాం.. భూమిని చల్లగా, సురక్షితంగా వుంచుదాం. 'ఈ భూమి ఈ గాలి ఈ నీరు మనకు పెద్దల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు కావు. ఈ సహజ వనరులను మనం ఏ రూపంలో అందుకున్నామో, అదే రూపంలో మన పిల్లలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది' అంటారు మహాత్మాగాంధీ. అలా చేస్తే ప్రకృతిని, పర్యావరణాన్ని, అది ప్రసాదించిన జీవవైవిధ్యాన్ని మనం పరిరక్షించిన వాళ్లమవుతాం. మనం బతకడమే కాదు, మన భవిష్యత్తరాల వారినీ బతకినిచ్చిన వాళ్లమవుతాం.

- 2023 థీమ్..
'మన గ్రహం మీదనే పెట్టుబడి పెట్టండి' అని గతేడాది తీసుకున్న థీమ్‌నే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. మన గ్రహానికి ఇప్పుడు మన పెట్టుబడి అవసరం. మాతృభూమి పరిరక్షణ కోసం ఒకరికొకరు కలిసి నడవాల్సిన అవసరం. ఆకుపచ్చని, సుసంపన్నమైన, సర్వ సమానమైన భవిష్యత్తును వాస్తవికతగా మార్చుకోవాలంటే.. ప్రకృతికి, పర్యావరణానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిని ఎదిరించాల్సిన అవసరం ఇప్పుడు తలెత్తింది. సమయం తక్కువగా వున్నందున ప్రజలు ఏకతాటిపైకి వచ్చి జీవవైవిధ్యాన్ని, భూగ్రహాన్ని రక్షించే చర్యలను ప్రారంభించాల్సిన అవసరాన్ని ఈ థీమ్ నొక్కి చెబుతోంది. మన గ్రహం చుట్టూ వున్న పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పించడానికి, భూమిపై వున్న జీవజాతులను రక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కావలసిన సమయాన్ని, ఆలోచనలను పెట్టుబడిగా పెడదాం. 'మనం ఏ మంచిని ఇస్తే.. అది తిరిగి మనకు వస్తుంది' అంటారు పెద్దలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, కనీసం ఒక్క చెట్టైనా నాటుదాం. మన చుట్టూ వున్నవారితో నాటించేలా ప్రయత్నిద్దాం. అదే భూమికి మనం పెట్టే అతి పెద్ద పెట్టుబడి.
రాజాబాబు కంచర్ల
9490099231