Apr 30,2023 07:33

అక్షరాలను
శిల్పాలుగా మలిచే కౌశలమేదో
అరచేతిలో కుదురుకుంది
అదొక్క పని తప్ప
మరేదీ చేతికి చిక్కలేదు

ప్రపంచాన్ని
అనేక ఆకృతులుగా చూపే
పుస్తకం తప్ప
ఇష్టమైన మరో
గురువెవరూ దొరకలేదు
మనిషిని
కృతిగా మలిచే
మట్టి తప్ప
మహా ఆరాధనీయులు
వేరెవ్వరూ
ఎదురు పడలేదు

చిట్టి రెక్కలతో
అవధి లేని ఆకాశాన్ని
అవలీలగా లొంగదీసుకునే
బుల్లిపిట్ట తప్ప
భుజం తట్టే ప్రియమైన
నేస్తాలెవ్వరూ దొరకలేదు

కాలాన్ని పరీక్షిస్తూ
అనియతంగా నాలో ప్రవహించే
నాగధార తప్ప
స్ఫూర్తినిచ్చే
మరో పాట వినిపించలేదు

ఒంటిలో ప్రాణమై ప్రవహించే
రక్తం రాజుకున్నపుడు
భగ్గున మండే గుండె తప్ప
చేతికి అందే మరోగొప్ప
ఆయుధం స్ఫురించలేదు
నేను నిప్పు రాజేసిన అక్షరాల్లో
సూర్యుడు మెరిసినప్పుడు
వెలిగే కళ్లు తప్ప
నన్ను వెలిగించే ఆకాశాలే లేవు!

-కంచరాన భుజంగరావు
9441589602