
కేరళలో హిందూ దేవాలయాల ఆదాయాన్ని చేజిక్కించుకోవడానికి కమ్యూనిస్టు ప్రభుత్వం వాటిని టేకోవర్ చేసుకుందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా వ్యాఖ్యానించడం కమ్యూనిస్టులపై అసూయతోనో, లేక స్వప్రయోజనాలను ఆశించో, ఇంకేదైనా రాజకీయ ప్రయోజనం కోసమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కేరళ దేవాలయాల చరిత్ర, వాటి నిర్వహణలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక వైఖరిని పరిశీలించిన వారెవరైనా ఆ వ్యాఖ్యలను వేరే విధంగా భావించలేరు. మితవాద శక్తులు చాలా ఏళ్లుగా పాడుతున్న పాచి పాట ఒక మాజీ న్యాయమూర్తి నోట రావడం జుగుప్సాకరం. కేరళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న సంఘపరివార్ కుట్రలకు ఆజ్యం పోసేలా దేవాలయాల విషయాన్ని చర్చనీయాంశం చేయాలని ఆ మాజీ న్యాయమూర్తి ప్రయత్నించడం తగదు. బిజెపి ప్రభుత్వం పలువురు మాజీ న్యాయమూర్తులను గవర్నర్లుగా, కొన్ని రాజ్యాంగ సంస్థలకు అధిపతులుగా, ఇంకొందర్ని రాజ్యసభకు నామినేట్ చేయడం చూస్తున్నాం. బహుశా మల్హోత్రా కూడా అటువంటిదేదో ఆశించే ఈ తతంగం సాగించారన్న విమర్శకుల వ్యాఖ్యలను తేలికగా త్రోసిపుచ్చలేం.
ట్రావెన్‌కోర్ లోని హిందూ దేవాలయాలు 19వ శతాబ్దంలోనే రెవెన్యూ శాఖ పరిధిలో ఉండేవనీ, ఆ తరువాత దేవాదాయ శాఖకు మార్చారన్న విషయం చారిత్రక సత్యం. ప్రస్తుతం దేవాలయాలు హిందూ మతానికి చెందిన శాసన సభ్యులతో కూడిన దేవాదాయ బోర్డు ఆధీనంలో నిర్వహించబడుతున్న విషయం ఆ మాజీ న్యాయమూర్తికి తెలియదను కోగలమా? లేక హిందుత్వ శక్తుల అజమాయిషీకి దేవాలయాలను అప్పగించాలన్న వాదనకు వంత పాడుతున్నారను కోవాలా? ఎన్నికైన శాసన సభ్యులతోనే బోర్డు అంటే పాపం బిజెపికి ఆ రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరు కదా! అందుకనేనా? దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వం చేజిక్కించుకో జూస్తున్నదన్న మాజీ జడ్జి ఆరోపణ కూడా పూర్తి అవాస్తవం. అసలు కేరళ బడ్జెట్‌కు దేవాలయాల నుండి ఒక్క పైసా కూడా జమ కాదు. అంతేగాక పినరయి విజయన్ ప్రభుత్వం 2017 తరువాత దేవాలయాలకు రూ.449 కోట్లు చెల్లించిందని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శాసనసభలో ప్రకటించారు. వరదల సమయంలో దేవాలయాల సిబ్బందికి జీతాలు, రిటైరయినవారికి పింఛను చెల్లించలేని పరిస్థితిలో రూ.140 కోట్లు, శబరిమలలో యాత్రికుల సదుపాయాల కల్పనకు కెఐఐఎఫ్‌బి నుండి రూ. 118 కోట్లు చెల్లించామని మంత్రి చెప్పారు. నేలమాళిగల్లో స్వర్ణాభరణాలు గలిగిన అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి కూడా మూడు కోట్లకు పైగా నిధులిచ్చామని మంత్రి చెప్పిన సత్యం విన్నవారికి పరివార్ మూకలు, వారికి వంతపాడేవారు ఎంతటి అబద్ధాలాడుతున్నారో విదితమవుతుంది.
పినరయి ప్రభుత్వం ఏర్పడ్డాక దేవాలయాల్లో అర్చకులుగా దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వారిని నియమించింది. ఈ సామాజికాంశం కూడా మితవాద శక్తులకు కంపరం పుట్టిస్తోంది. కేరళలోని దేవాలయాలను తమ మతతత్వ విద్వేష ప్రచారానికి ఆయుధాగారాల్లా వాడుకోవాలన్న పరివార్ శక్తులు పలు కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. గతంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలుచేయాలని ప్రయత్నించిన ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంపై విషం చిమ్మాయి. తాము బిజెపికి వ్యతిరేకమని బాకాలూదే కాంగ్రెస్ కూడా కాషాయ మూకతో చేతులు కలపడం దుర్మార్గం. ఏ చిన్న అవకాశం దొరికినా వామపక్షాలను దెబ్బ తీయాలని కాచుక్కూర్చున్న ఈ శక్తులు మాజీ న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉపయోగ పడతాయని ఆశించడం సహజం. కానీ దేవాలయాల నిర్వహణ, నిధుల కేటాయింపుల్లో ఎల్‌డిఎఫ్ సర్కారు అనుసరిస్తున్న వైఖరులను తమ అను భవంలో చూస్తున్న కేరళ ప్రజలు ఆ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోరు. దళితులు, బలహీన వర్గాలకు దేవాలయ ప్రవేశం కల్పించాలని కేరళలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులైన కృష్ణ పిళ్లై, ఎకె గోపాలన్ తదితరుల నాయకత్వంలో సాగించిన సుదీర్ఘ పోరాటాల చరిత్ర వారికి తెలుసు. కానీ సంఘపరివారం దేశమంతటా విద్వేష విషం చిమ్ముతోంది కనుక భారతీ యులందరూ కాషాయ కుట్రను అర్థం చేసుకోవాలి. దాన్ని తిప్పికొట్టాలి.