ఓ నది ఒడ్డున కలలు పేర్చుకున్న చోట
ఇంత జీవన ప్రయాణానికి
మోసుకొచ్చే దుఃఖానికి, ఆనందానికీ
నిలువెత్తు సాక్ష్యం ఈ వర్షమే.
కొండల్ని పెకలిస్తూ..
గాలుల్ని ప్రవహిస్తూ..
అల్లకల్లోలమైంది కదా ఈ గోదావరి.
ఈ వర్షం..
కరకట్టల సత్తువని జార్చి
ఊళ్లని కన్నీట ముంచి
చిరునామాలు చెరిపేసింది.
వాగులు రంకెలేసి దుముకుతున్నాయి
దిక్కుతోచని పిట్టలు
పునరావాస కేంద్రాలని
వెతుకుతున్నాయి.
మబ్బులు యుద్ధాలు చేసి
అంతంత నీటిని ఒంపుతున్నాయి.
లంకలు మునుగుతున్నాయి.
అమలిన దృశ్యాల్లో
శూన్యానికి వేలాడుతూ
ప్రాణాలు వేడుకుంటున్నాయి.
చూపులు సాయం కోసం
కృత్రిమపక్షి వైపు చూస్తున్నాయి.
మట్టి మనిషి
నీట మునిగాక
హృదయాలు చీకటిలో చిక్కుకున్నాక
దుఃఖాశ్రువులు వొలికి
రేపటి ఉనికి ప్రశ్నలు మొలుస్తున్నాయి
ఆకాశ సంద్రం కురిసీ
కుదిపిన జీవితాల
ఆరిన గుండెల ఆవేదన
నలుదిక్కులా నివేదిస్తున్నాయి.
- గవిడి శ్రీనివాస్
99665 50601