Apr 16,2023 07:41

నేను నిన్ను చూసిన తొలిచూపులోనే
నిన్ను చుట్టుకున్న ఎరుపు ఓణీపై అసూయ రగిలింది..
నేను కలలు గన్న ఎరుపు మేలుకొలుపు..నా ప్రేమకి అంకురార్పణయింది.. !!
నీ పై ప్రేమకి
ఆ ఎర్రని ఓణీ కే ప్రథమ ఓటు
నా కళ్లలో ఆ ఓణీ ఇంకా మెదులుతోంది..
నీ బిగించిన పిడికిలిలో
చైతన్య బీజాలు
ఈ నేలలో నాటుతుంటే
రేపటి తరం భవిష్యత్తు కళ్ళముందు
నాట్యమాడుతోంది..

నా దానివి అనుకున్నప్పుడే
నీ చుట్టూ నా కళ్ళు పరిభ్రమించు
రెటీనాలో ప్రతిబింబం శాశ్వతం
తూర్పు పొద్దు నీ మోములో సిగ్గు దొంతరల ఎరుపు
చెక్కిలి నిండా!
లేలేత కిరణాలు గిరులు దాటి కురుల మీదుగా
నీ నీడలో దాచుకున్న నేను రేపటి సమిధగా నీ ప్రేమ సందేశాలు మోస్తూ
ఆగని నడకనై సాగుతా..
ప్రేమలో నా అనే స్వార్థం పరిపూర్ణం !
ఆ ప్రేమ నీలో నాలో ప్రవహించే రుధిర జ్వాలలు!!
విప్లవం నా ప్రేయసి
ఎన్నాళ్ళైనా నా నిరీక్షణలో ఓ తుళ్ళింత
విప్లవం ధ్వనించే వేళ
రుధిర శంఖం పూరిద్దాం..!

- గిరి ప్రసాద్‌ చెలమల్లు
94933 88201