Sep 25,2022 08:07

అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం అంటాడు మహాకవి శ్రీశ్రీ. మట్టి... మనిషి, చినుకు... చింత, చెట్టూ... చేమ, పొలము... పుట్రా, పంట... కరువు, బతుకు... ఆశ, ఆకలి... పండుగ - ఇలా అన్నీ కలగలిపి... కలబోసి, గుండెకోటలోని రహస్యాల కవాటాలు తెరచి... వరదలా పారించాడు కవి చింతా అప్పలనాయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే... శ్రమైక జీవన సౌందర్యాన్ని ఒడిసి పట్టుకొని, ఈ కవిత్వం నిండా ఒలికించాడు. ఉత్తరాంధ్ర మట్టి పరిమళాలను తన అక్షరాలకు అద్ది... మట్టి బాగుంటేనే మనిషి బాగుంటాడని తలపోసిన కవి ఈయన. రైతులోని వేదన, తపన వంటి అనేక పార్శ్వాలను దర్శించాడు గనుకనే 'అరసేతిలో బువ్వపువ్వు' కవిత్వం నిండా... రైతు కన్నీటి వెతలుంటాయి. రైతు ఉద్యమానికి సంఘీభావం ఉంటుంది. పైర గాలి పరవశం ఉంటుంది. అంతేకాదు.. తన కవిత్వం నిండా అచ్చమైన పల్లెపదాలను ఉత్తరాంధ్ర మాండలికంతో మేళవించి.. పల్లెతో మాట్లాడినట్లుగా, మట్టిని మచ్చిక చేసుకున్నట్లుగా అలవోకగా వల్లెవేశారు. ఈ కవిత్వంలో నిండా మునిగితే...'పంట చేల గట్ల మీద నడవాలి... ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి' అంటూ... పాలగుమ్మి విశ్వనాథం వారి పాట గుర్తుకు రాకమానదు.
నిలువుదోపిడీకి గురవుతున్న రైతు జీవితాన్ని వాస్తవిక దృష్టితో ఆవిష్కరించిన అక్షర దృశ్యం 'ఇదే కొడుకా రైతు బతుకు'. ఈ కవితలోని ప్రతి పదం నగ సత్యం. పొలంలో కుళ్లిపోతున్న గింజలు ఒకవైపు, మన ప్రమేయం లేకుండానే తరుముకొచ్చే పండుగ మరోవైపు. అప్పుచేసైనా అల్లుడికి మర్యాద చెయ్యాలి. అయినింటికొచ్చిన బిడ్డకు ఆకేసి కాస్తంత బువ్వ పెడితే సరిపోదు.. కనీసం ఒక కోకైనా కొనివ్వాలి. చాటుకెళ్లి కంటితడి తుడుచుకుంటాం తప్ప, తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని వదులుకుంటామా? బతుకు బండిని నడపకుండా వుండగలుగుతామా? పండగపూట పిండివంటలు చేసి, పెద్దలకు పెట్టుకోకపోతే వాళ్లు ఆగ్రహిస్తారేమో. కాసింత తవుడు కలిపి, కోడిపిల్లల్ని పిలిచినట్లు పిలిస్తే పెద్దలు శాంతిస్తారా?.. ఇన్ని ప్రశ్నలతో తల్లడిల్లేదే రైతు జీవితం. 'సాలీ సాలని డబ్బులు/ మదపుటేనుగుల్లా మదుపులు/కళ్లాన కుప్పలు ఊరల్లా అప్పులు/ ఎందుకొచ్చిన తిప్పలు!/ పోలీసుల దెబ్బల్లా/ వొల్లల్లా కనిపించని నొప్పులు/ ఇదే కొడుకా రైతు భారతం!/ రాములోరి రాజ్యం!!' అంటూ సగటు రైతు మనసులోని భారాన్నంతా ఈ కవితలో పలికిస్తాడు కవి.
వ్యవసాయం దండగ అంటూ వక్రభాష్యాలు చెప్పే నకిలీలున్న నేటి సమాజంలో 'ఎన్నెన్ని తుపానులొచ్చినా.../ ఎన్నెన్ని పర్రాకులు పెట్టినా.../ అరి సేతిలో బువ్వ పువ్వులై/ పూయకుండా బతకలేము' అనే రైతులు వుండబట్టే ఇంకా నాలుగు మెతుకులు జనం నోట్లోకి వెళుతున్నాయి. నగరీకరణ పెరిగిన ఈ కాంక్రీట్‌ యుగంలోనూ రైతు 'నాగలి పట్టుకోకుండా/ సేతులు ముడుసుకోలేము' అంటాడు కాబట్టే... ఇంకా పంట పొలాలు నిండు చూలాల్లా కనిపిస్తున్నాయి. 'అరసేతిలో బువ్వపువ్వు' కవితలో తుపాను యమదూతలా పంటను ఎత్తుకుపోవడం నుంచి రైతు బతుకును ఈ కవితలో పురిపుష్టంగావిస్తారు చింతా అప్పలనాయుడు.
ఈ కవితా సంపుటి నిండా రైతు, వాన, పంట గురించే కాకుండా... స్టీలుప్లాంట్‌ ఉద్యమాన్ని 'వేడెక్కుతున్న ఉక్కు' కవితలోను, 'పుట్టిన మట్టిలో/ బతుకును ఎతుక్కోవడానికి/ సెమట నదులన్నీ/ సొంతూరికి సేరుకున్నాయి' అంటూ 'లాక్‌డౌన్‌' కవితలోనూ తన సామాజిక బాధ్యతను కూడా గుర్తు చేసుకున్నారు కవి. 'అచ్చమైన దేశివాళీ గంగిగోవా/ మా వంగపండు ప్రసాదరావా' అంటూ 'ప్రజా పాటల గంగిగోవు'లో ఆ ప్రజాకవిని యాది పెట్టుకున్నారు. 'మా సుకవీ/ మళ్లీ నువ్వు భూమి మీద పుట్టాల/ కలం పట్టాల/ అసమానతల అడ్డుగోడల్ని/ మొదలంటూ కూలదొయ్యాల' అంటూ మహాకవి గుర్రం జాషువాను ఆవాహన చేసుకున్నారు. 'ఒంటి నిండా మతం గుడ్డలు కప్పి/ దేశితల్లిని ఉరేగించుతున్న/ కొడుకుల్ని చూసి/ కడుపు ఉడికిపోతుంది' అంటూ అక్షరాస్త్రాలు ఎక్కుపెట్టేందుకు విశ్వనరుడిని ఈ భూమిపై మళ్లీ పుట్టమని 'సుకవి'లో ఆశాభావం వ్యక్తం చేస్తారు.
రైతు విశ్వ స్వరూపాన్ని 55 కవితలున్న ఈ పుస్తకం నిండా ఆవిష్కరించారు కవి. ఈ సమీక్ష ఈ కవితల్లోని మట్టికి మనిషికి ఉన్న బంధాన్ని రుచి చూపించడానికే తప్ప... అన్నింటినీ విశ్లేషించాలంటే మరో పుస్తకం రాయాల్సి ఉంటుంది. ఈ పుస్తకంలోని ప్రతి కవితను అనుభూతించాలంటే... కచ్చితంగా ఈ పుస్తకం చదవాలి. మన అరసేతిలోని బువ్వ పువ్వు రుచి... పొలం గట్టుపై కూర్చొని, సద్దిమూట విప్పి, అందులోని పచ్చడి మెతుకులను అమృతంలా ఆరగిస్తూ... పక్కనే వున్న పంటకాల్వలోని నీటిని దోసిళ్లతో తాగితే.. ఎంత అద్భుతంగా ఉంటుందో... భుక్తాయాసం తీర్చుకునేందుకు గట్టు మీదనున్న చెట్టు కింద తుండుగుడ్డ పరుచుకొని, దానిపై నడుమువాల్చి ఆకాశంలోకి చూస్తూ కలలుకంటూ ఎంత అనుభూతించవచ్చో.. ఈ కవితా బువ్వపువ్వును కడుపారా తిని, తేన్చుతూ... మనసారా ఆస్వాదించొచ్చునని ఘంటాపథంగా చెప్పొచ్చు.

- రాజాబాబు కంచర్ల
 

అరిసేతిలో బువ్వపువ్వు
చింతా అప్పలనాయుడు
ముద్రణ : శ్రీశ్రీ ప్రింటర్స్‌
ప్రతులకు : వైకెఎం కాలనీ
పార్వతీపురం, మన్యం జిల్లా
ఫోన్‌ : 9441713185
వెల : 150