కాలం మారింది
అక్కడొక దేహం
ఆకలి పాట ఆలపిస్తోంది
కరువు మేఘాల ధాటికి
అరువు పిడుగులు
నిలువునా దిగుతాంటే
ఎసరు మరగడం లేదు
కొన ఊపిరి కొట్టాల్లో
కొన్ని దేహపు కట్టెలు
ఓ మూలకు
ఆన్చుకుని నిలబడ్డాయి
ఊపిరందించే చేయి కోసం
పొద్దు గడుస్తాలేదు
ఆకలి రాగానికి
ఒట్టి పేగుల తాళంతో
తాళలేక ఊగుతాంటే
శక్తి కొండెక్కినాది
ఇక్కడన్నీ
పేక మేడల కలలే
ఉదయానికల్లా కూలిపోతే
యథా బతుకు
సదా సాగిపోతాది
ఊతమిచ్చే చేతులు
పైపైకి చాపుతాంటే
నేల బతుకుల గతి
పాతాళానికి చూస్తాండాది
ఏపొద్దైనా
ఆకలి రాగానికి
బక్క దేహం ఊగాల్సిందే
వెక్కిరింతల
కోరస్ పలికే గొంతులకు
ఒంత పాడాల్సిందే
ఆకలి పాటకు
అడుగడుగునా
మడుగులొత్తుతా
గొడుగు పట్టాల్సిందే
అందుకే
గూడు ఘొళ్లుమంటాంది
- నరెద్దుల రాజారెడ్డి
96660 16636