సమాజంలో నా ఉనికికి సమాధానం లేదు
ఆసరా ఇచ్చిన అక్షరం తప్ప
లోకాన్ని పరిచయం చేసుకునేందుకు
లోతైన భావాన్ని హృదయంలో నుంచి తోడుతున్న...
గత తాలూకు జ్ఞాపకాలు ఎన్నో
ఘనీభవించి మనసులో కూర్చున్నాయి
వర్తమానం ఆశలను కలుగజేస్తుంటే
సమస్యలెన్నిటినో ప్రశ్నలా వేధిస్తున్నాయి..
అనుభవాలను కాలప్రవాహం వెనకేస్తుంటే
ప్రోగుచేసి విజ్ఞానం ముందుకు నడిపిస్తుంది
అవసరమైతే అక్షయపాత్రలా నిలుస్తుంది
శూన్యములో చిరుదీపంలా తోడుంటుంది
కొత్త లోకాలెన్నో ఇంద్రధనస్సులా మెరుస్తూ
సరికొత్త కోరికలతో మనసు నింపుతూ
ఒక్కోసారి నింగిలో తోకచుక్కలా జారుతూ
మరోసారి నేలపై మాణిక్యాల్లా కనిపిస్తున్నాయి..
సూక్ష్మమైన విత్తనం విశ్వరూపం చూపినట్లుగా
గుప్పెడు అక్షరాలు ప్రపంచమంతా తిరిగే
సాహిత్యపు వినీలాకాశంలో కాంతిపుంజంగా
మస్తకానికి తోడుగా అక్షరం క్షేత్రమై నిలిచే..
మానసిక ఆనందము సాహిత్యంలో దొరుకుతుంటే
రాబడి లేదా అంటూ ప్రశ్నిస్తున్న లోకం
రసజ్ఞత లేని హృదయాలు విమర్శిస్తుంటే
సాహిత్యం తోటమాలిగా ఉండాలని కోరుకుంటాను..
- కొప్పుల ప్రసాద్
98850 66235