Feb 13,2023 09:38
  • పునరావాసానికి నోచుకోని వలస కూలీలు, యువత
  • పోలీసు బందోబస్తు మధ్య గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : ప్రభుత్వ నిర్వాకంతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసితులు చెల్లాచెదురవుతున్నారు. ఎక్కడ తలదాచుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ఇటువంటి తరుణంలో కొంతగడువు ఇవ్వాల్సిన అధికార యంత్రాంగం ఇళ్లు ఖాళీ చేయకపోతే తామే కూల్చేస్తామంటూ బెదిరిస్తూ పోలీసులను మోహరింపజేయడంతో బాధితులంతా బిక్కుబిక్కుమంటూ మూటాముళ్లు సర్ధుకుంటున్నారు. తమపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, ఇటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రశ్నేలేదని అధికారులు చెప్తున్నారు. భోగాపురం ఎయిర్‌ పోర్టు కోసం సుమారు 2,700 ఎకరాలు భూమిని సేకరించిన విషయం విదితమే. ఇందులో భాగంగా మరడపాలెం, బొల్లెంకులపాలెం, ముడసర్లపాలెం, రెల్లిపేట గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం 367 నిర్వాసిత కుటుంబాలను అధికారులు గుర్తించారు. గూడెపువలస, లింగాలవలస రెవెన్యూ పరిధిలో స్థలాలు కేటాయించింది. భూములు, ఇళ్లు, చెట్లకు నష్టపరిహారంతోపాటు ప్రతి కుటుంబానికీ ఐదు సెంట్ల స్థలం, 9.50 లక్షల ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కల్పిస్తామని 2015లో అప్పటి ప్రభుత్వం తెలిపింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కల్పనకు అదుగో ఇదిగో అంటూ నెట్టుకొస్తూ 2021లో మంజూరు చేసింది.
 

                                                       పునరావాసానికి నోచుకోని వలస కుటుంబాలు

తొలుత ఒప్పందం కుదిరిన సమయంలో ఆయా గ్రామాల్లో చాలామంది ఉపాధి కోసం వలస వెళ్లడంతో నాయకులుగానీ, అధికారులుగానీ వారిని గుర్తించలేదు. దీంతో, మరడపాలేనికి చెందిన నీలాపు నర్సయ్యమ్మ, నీలాపు అప్పయ్యమ్మ, నీలాపు అప్పన్న, నీలాపు సునీత, నీలాపు చిన అప్పయ్మలతోపాటు సుమారు 34 మంది పునరావాసానికి నోచుకోలేదు. మిగిలిన మూడు గ్రామాల్లో కూడా ఇటువంటి వారు మరికొందరు ఉన్నారు. వీరంతా తమకు స్థలాలు కేటాయించాలని చాలాకాలంగా అడుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా బలవంతంగా ఖాళీ చేయించేందుకు వచ్చిన అధికారులను నిలదీయడంతో ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టంతో సంబంధం లేకుండా 1.5 సెంట్ల చొప్పున స్థలాలు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. తమకు కూడా అందరితోపాటు ఐదు సెంట్ల స్థలాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. భూములు తీసుకోవడానికి మాత్రం స్థానికులమనే ధ్రువీకరణ పత్రాలు అడగలేదని, అందరితోపాటు స్థలాలు, ఇళ్ల కట్టుకోవడానికి డబ్బులు అడిగితే స్థానికతతో కూడిన ఆధార్‌ కార్డులు చూపించమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్‌ కార్డుల్లో స్థానిక చిరునామాలు లేకపోవడం వల్ల ప్యాకేజీ వర్తింపజేయలేమని అధికారులు ఖరాఖండిగా చెబుతున్నారు.
 

                                                                     అన్ని ఆధారాలూ ఉన్నా...

మరడపాలెంలో రేషన్‌, ఆధార్‌ కార్డులు ఉన్నా కొంతమందికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్తింప జేయలేదు. ఇదే గ్రామానికి చెందిన కొండపు రమేష్‌ చదువు కోసం తల్లిదండ్రులు వేరొక ఊరు వెళ్లారు. గ్రామంలో సొంత ఇల్లు, పొలం కూడా ఉంది. వాటికి ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇచ్చింది. జాబితా తయారీ సమయంలో గ్రామంలో లేరన్న నెపంతో ఆర్‌అండ్‌ఆర్‌ వర్తింపజేయలేదు. కొండపు కొండమ్మ, భైరెడ్డి అసిరమ్మ, బూస నరసమ్మ సహా ఈ గ్రామంలో 11 కుటుంబాలు ఇదే సమస్యతో సతమతమవుతున్నాయి.
 

                                                            18 ఏళ్లు దాటిన వారికి ప్యాకేజీ ఏదీ ?

ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టం ప్రకారం గ్రామాలు ఖాళీ చేయించిన నాటికి 18 ఏళ్లు దాటిన వారికి కూడా ఐదు సెంట్ల ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.9.50 లక్షల చొప్పున ఇస్తామని 2015లో ప్రభుత్వ యంత్రాంగం హామీ ఇచ్చింది. ఆచరణలో అప్పట్లో గుర్తించిన 18 ఏళ్లు పైబడిన యువతకు మాత్రమే ప్యాకేజీ అమలు చేసింది. దీంతో, ఒక్క మరడపాలెంలోనే సుమారు 20 మంది యువతీ, యువకులు ఆర్‌అండ్‌ఆర్‌కు నోచుకోలేదు. తనకు 2015 నాటికే 18 ఏళ్లు దాటాయని, ప్యాకేజీ గురించి అడిగితే అధికారులు స్పందించడం లేదని మరడపాలేనికి చెందిన కొండపు నర్సింగరావు 'ప్రజాశక్తి' ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కొండపు రమణ సహా 18 ఏళ్ల నిండిన చాలామంది యువతీ, యువకులు గ్రామంలో ఉన్నారు.
 

                                                              ప్యాకేజీ పొందిన వారిది మరో సమస్య

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పొందినవారూ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఒప్పందం కుదిరిన ఆరేళ్ల తరువాత అంటే 2021లో ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. ఈలోపు నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో ఇంటి నిర్మాణ వ్యయం పెరిగింది. దీంతో, వివిధ స్థాయిల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. లింగాలవలస పునరావాస కాలనీలో మరడపాలేనికి చెందిన 70 ఇళ్ల నిర్మాణాన్ని స్థానిక వైసిపి నాయకుడు కాంట్రాక్టు తీసుకున్నారు. తొలుత కుదిరిన ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదనే పేరుతో నిర్మాణాలను మధ్యలో ఆయన విడిచిపెట్టారు. దీంతో, వీరంతా ఉన్న పళంగా ఆయా ఇళ్లల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.