Sep 28,2023 21:54

-కెనడా ఏవియేషన్‌ కంపెనీతో ఒప్పందం
-రూ.600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
-3 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి!
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మరమ్మతు, నిర్వహణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. రూ.600 కోట్లతో మెయింటినెన్స్‌ అండ్‌ రిపేరింగ్‌ ఆపరేషన్‌ (ఎంఆర్‌ఒ) సెంటర్‌ ఏర్పాటుకు కెనడాకు చెందిన ప్రయివేట్‌ ఏవియేషన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఇది కార్యరూపం దాల్చితే ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు వేల మందికి ఉపాధి లభించనుందని చెప్తున్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మరమ్మతు, నిర్వహణ కోసం ఎంఆర్‌ఒ సెంటర్‌ ఏర్పాటుకు గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రితో పలుమార్లు సంప్రదింపులు జరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన ఇన్వెస్ట్‌ ఇండియా శిఖరాగ్ర సమావేశం వేదికగా ఇందుకోసం ఔత్సాహిక కంపెనీల నుంచి గతంలో టెండర్లను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఎంఆర్‌ఒ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన కెనడా ఏవియేషన్‌ కంపెనీ ప్రతినిధులు తిరుపతి విమానాశ్రయాన్ని గురువారం సందర్శించారు. ఇక్కడ ఎంఆర్‌ఒ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలోని ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ను సందర్శించారు. ఆ తర్వాత తిరుపతి ఎంపి ఎం.గురుమూర్తితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ పెద్ద నగరాలకు దీటుగా తిరుపతి నగరాన్ని, తిరుపతి జిల్లాను అభివృద్ధిపథంలో నడిపేందుకు రూపొందించబడిన ప్రణాళికలో భాగంగా తిరుపతి విమానాశ్రయంలో ఎంఆర్‌ఒ సెంటర్‌ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కెనడా ఏవియేషన్‌ కంపెనీ వారు వారి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారని, రానున్న ఆరు నెలల్లో ఇది కార్యరూపం దాల్చనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని తెలిపారు.

  • విమానాశ్రయంలో తాత్కాలిక మరమ్మతులు

తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ 12 విమానాలు 36 ట్రిప్పుల్లో ప్రయాణికులను చేరవేస్తున్నాయి. వీటికి ఏ చిన్న మరమ్మతులు వచ్చినా చెన్నరు, బెంగళూరు విమానాశ్రయాల నుంచి ఇంజనీర్లను పిలిపించుకోవాల్సి వస్తోంది. ఈ పదేళ్లలో 17 విమానాలు మరమ్మతుకు గురై ఆగిపోయిన సందర్బాలు ఉన్నాయి. కెనడా ఏవియేషన్‌ కంపెనీ వారు ఎంఆర్‌ఒ సెంటర్‌ ఏర్పాటు చేస్తే ఇటువంటి మరమ్మతులను స్థానికంగానే చేసుకునే వీలుంటుందని చెప్తున్నారు.