Jul 30,2023 21:40

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో :స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన కార్తీక్‌ (19) వెంకట పద్మావతి మెడికల్‌ కళాశాలలో ఫిజియోథెరపీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితులైన సంతోష్‌, మహబూబ్‌ బాషాలతో కలిసి రెడ్డివారిపల్లె సమీపంలోని స్వర్ణముఖి నదిలో సరదాగా ఈతకు వెళ్లారు. నది ఇసుక రీచ్‌కి తవ్విన గుంతలో కార్తీక్‌ కూరుకుపోయారు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. స్థానికులు వచ్చి కార్తీక్‌ను వెలికితీయగా అప్పటికే అతడు మృతి చెందారు. చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.