Nov 14,2023 08:22

ప్రజాశక్తి- కంచికచర్ల (ఎన్‌టిఆర్‌ జిల్లా):ఎన్‌టిఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని మున్నేరు వాగులో ఈతకు దిగిన ఐదుగురు యువకుల్లో ముగ్గురు మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు సరదాగా ఈత ఆడేందుకు కంచికచర్ల మండలం కీసర సమీపంలోని మున్నేరు వాగు వద్దకు వచ్చారు. పాత లోలెవల్‌ వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అక్కడికి వెళ్లారు. అయితే, ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ముగ్గురు ఒడ్డున ఉండగా.. ఐదుగురు ఈతకు దిగారు. నీటి ప్రవావాహనికి ఒక్కసారిగా అందరూ ఇసుక గుంతల్లో చిక్కుకుపోయారు. గమనించి పశువుల కాపారులు స్థానికులకు సమాచారం అందించారు. అందరూ కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. నీటి గుంతల్లో ఇరుక్కుపోయి ఊపిరాడక చేజెర్ల. వినిష్‌ (17), జి.సంతోష్‌ కుమార్‌ (24) యడవల్లి గణేష్‌ (29) మరణించారు. రవి, సిద్ధూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరిని ముందు నందిగామ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. చేజెర్ల. వినిష్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, సిద్దూ ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో షిప్ట్‌ ఆపరేటర్‌గా యడవల్లి గణేష్‌ పనిచేస్తున్నారు. సంతోష్‌కుమార్‌, రవి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం నందిగామ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.