Nov 14,2023 13:35

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత మరింత క్షీణించింది. గత రెండు రోజుల క్రితం ఆకస్మిక వర్షాల వల్ల అక్కడ వాయు నాణ్యత కొంత మెరుగుపడినా.. దీపావళి టపాసుల వల్ల గాలి నాణ్యత మరింత క్షీణించిందని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్ని పొగ కమ్మేసింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 363గా రికార్డు అయ్యింది. దీంతో ఢిల్లీలో వాయుకాలుష్యం తారాస్థాయికి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో వెదర్‌ డేటా తెలుసుకునేందుకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం 40 మానిటరింగ్‌ స్టేషన్లలో కేవలం తొమ్మిది స్టేషన్ల ద్వారా మాత్రమే వెదర్‌ డేటాను రిలీజ్‌ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, దీపావళి పండుగ సందర్భంగా పేల్చిన టపాసుల వల్ల మరోసారి ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. దీంతో సోమవారం రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా ఢిల్లీ రికార్డు అయినట్లు స్విస్‌ కంపెనీ ఐక్యూఎయిర్‌ పేర్కొంది. ఆ తర్వాత స్థానాల్లో పాకిస్తాన్‌లోని లాహోర్‌, కరాచీ ఉన్నాయి. అయిదు, ఆరు స్థానాల్లో ముంబై, కోల్‌కతా నగరాలు ఉన్నాయి.