
అమెరికాలో ప్రాంతీయ బ్యాంకులు వరుసగా దివాళా తీస్తున్న వైనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవర పాటుకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ వంటి దేశాలను బలవంతంగా యుద్ధంలోకి నెట్టేసి ఆయుధాల విక్రయాల ద్వారా తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్న అమెరికా ఎంతసేపూ యుద్ధానికి రంకెలేయడం తప్ప...ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఉపాధి సృష్టి, నూతన అవకాశాల అన్వేషణ వంటి సంస్థాగత చర్యలకు ఉపక్రమించకపోవడం ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందంటూ ఆర్థిక వేత్తలు లబోదిబోమంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమి పావెల్ మాత్రం అబ్బే అదేం లేదు..ప్రాంతీయ బ్యాంకుల్లో పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉందంటున్నారు. కానీ పావెల్ ఈ మాటలు అన్న మరుసటి రోజే పసిఫిక్ వెస్ట్రన్ బ్యాంకు దివాళా తీస్తున్న బ్యాంకుల సరసన చేరిపోయింది. ఇప్పటికే సిల్వర్‌గేట్ బ్యాంకు, సిగేచర్ బ్యాంకు, సిలికాన్ వేలీ బ్యాంకు, ఫస్ట్ హారిజోన్, టిడి బ్యాంక్, వెస్ట్రన్ అలయన్స్, కెబిడబ్ల్యు నాజ్‌డాక్ వంటి చిన్న, పెద్దా అనే తేడా లేకుండా బ్యాంకులు ఒక్కటొక్కటిగా దివాళా తీస్తున్నాయి. తాజాగా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును అమ్మేయడం అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతోందన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చుతోంది. ఇదంతా ఒక్క అమెరికానే కాదు...బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పెట్టుబడిదారీ దేశాలన్నింటినా ఇదే పరిస్థితి. అభివృద్ధి చెందిన పెట్టుబడి దేశాలకు వంత పాడుతున్న వర్థమాన దేశాల్లో ఆర్థిక పరిస్థితులూ దిగజారుతున్నాయన్నది కాదనలేని సత్యం. శ్రీలంక, పాకిస్తాన్ ఎంతటి రుణ సంక్షోభాల్లో చిక్కుకుపోయాయో చూశాం. భారత్‌లో సుదీర్ఘకాలంగా నడుస్తున్నవాటిలో ఒకటైన వాడియా గ్రూప్‌నకు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ గో ఫస్ట్ ఎయిర్‌వేస్ దివాళా తీసింది. ఇది ఇక్కడితో ఆగేపోయేలా లేదు.
అమెరికాకు కానీ, పెట్టుబడిదారీ దేశాలకు గానీ సంక్షోభాలు కొత్త కాదు. అవి నిత్యం కొనసాగుతూనే వుంటాయి. గాలి బుడగల్లా వ్యవస్థలు కుప్పకూలుతూనే వుంటాయి. సంక్షోభ నివారణకు చేదు గుళికలంటూ శ్రమ దోపిడిని తీవ్రతరం చేయడం, ప్రజల మూలగలను సైతం జుర్రుకునేలా భారాలు మోపడం మళ్లీ అంతా బాగుందంటూ గప్పాలు పోవడం రివాజు. ప్రస్తుత సంక్షోభం కూడా అలాంటిదే. 2008లో అమెరికా సబ్‌ప్రైమ్ రుణాలు ఊబిలో చిక్కుకుపోయి ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టిన వైనాన్ని చూశాం. ఆ సంక్షోభ పరిస్థితులు అంతకంతకూ విస్తరిస్తున్నాయే తప్ప తగ్గుముఖం పట్టింది లేదు. మహాశయుడు కార్ల్‌మార్క్స్ సంక్షోభం 'పెట్టుబడి' విత్తులోనే దాగుందని ఆనాడే ఉద్ఘాటించాడు. సంక్షోభాలకు తెర పడాలంటే శ్రమ దోపిడి వ్యవస్థకు సమాధి కట్టి కార్మిక నేతృత్వ సమతా సమాజానికి పురుడు పోయాలని ప్రపంచ కార్మిక లోకానికి లక్ష్యాన్ని నిర్దేశించారు.
అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో పొడచూపిన తాజా సంక్షోభం ఇప్పటికే కోవిడ్ మహమ్మారి కారణంగా చితికిపోయిన దేశాల ఆర్థిక వ్యవస్థల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. సంపద కేంద్రీకరణ, శ్రమదోపిడి, వనరుల దోపిడి వంటి వాటితో ప్రజలను పీల్చిపిప్చి చేస్తుండటంతో భారత్‌లోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభ పరిస్థితుల్లో దేశ బ్యాంకింగ్ వ్యవస్థపై దాని ప్రభావంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. రుణాల రేట్ల విషయంలో మధ్యవర్తిత్వాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాలని, ప్రజల నుంచి డిపాజిట్లను రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల(క్రిప్టో వంటి కొత్తగా ఉనికిలోకి వచ్చిన ఆర్థిక వ్యవస్థలను విశ్వసించే అమెరికా బ్యాకింగ్ వ్యవస్థ కుప్పకూలుతోంది)కు రుణ పరపతి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్దేశించారు. కానీ ఇవన్నీ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తాయే తప్ప పరిష్కారం చూపవు. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి, ఇ-నామ్, డ్రోన్ల తయారీ వంటి ప్రచార ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమవుతున్న మోడీ సర్కార్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగం వెన్ను విరుస్తోంది. గ్రామీణాభివృద్ధికి, ఉపాధి హామీ చట్టానికి నిధులు తెగ్గోయడంతో పాటు, ఆంక్షలతో వాటి ఉసురుతీస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యల్బోణం పోటాపోటీగా ఎగబాకుతున్నాయి. సంక్షోభాల నుంచి భారత్‌కు ఊరట దక్కాలంటే.. సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజల మధ్య మత విద్వేషాలు, వైషమ్యాలు రాజేయడం ద్వారా వారి దృష్టిని పక్కదారి పట్టిస్తున్న బిజెపిని ఇంటికి సాగనంపాల్సిందే.